
జనరిక్ మందులు: కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ చికిత్స దాకా ఏ మందులైనా 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే.. అయినా వీటిని ఎందుకు కొనట్లేదు?

జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లటానికి ముందు సాధారణంగా ఒకటి రెండు రోజుల పాటు మందుల షాపుకు వెళ్లి జ్వరం బిళ్లలు తెచ్చుకుని వాడటం పరిపాటి. మెడికల్ షాపుకు వెళ్లినపుడు జ్వరం బిళ్లలు అనగానే 'డోలో 650', 'క్రోసిన్ 650' వంటి బ్రాండెడ్ మందులు ఇస్తారు.
డోలో 650 ట్యాబ్లెట్లు 15 బిళ్లల షీట్ ధర 29 రూపాయలు. ఇందులో ఉండే ఔషధం పారాసెటమాల్, మోతాదు 650 మిల్లీ గ్రాములు. ఇదే ఔషధాన్ని మరో కంపెనీ 'పారాసిప్ 650' పేరుతో అమ్ముతుంది. ఇది 10 ట్యాబ్లెట్ల షీట్ ధర 18 రూపాయలు.
అయితే.. ఇదే ఔషధం 'పారాసెటమాల్ 650' పేరుతో 'జనరిక్ మందు'గా కూడా దొరకుతుంది. ఇది 10 ట్యాబ్లెట్ల షీట్ 4.50 రూపాయలకే లభిస్తుంది.
కానీ జనం ఎక్కువగా వాడేది డోలో 650 లేదా క్రోసిన్ 650 లేదా పారాసిప్ 650 వంటి ఖరీదైన బ్రాండెడ్ మందే. పారాసెటమాల్ 650 అనే అతి చౌకైన జనరిక్ మందు వాడటం చాలా చాలా చాలా అరుదు.
ఇలాగే.. ముందులున్న అన్ని జబ్బులకూ ఖరీదైన బ్రాండెడ్ మందులతో పాటు చౌకైన జనరిక్ మందులు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. ప్రభుత్వం సైతం జనరిక్ మందుల షాపులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది.
కానీ జనం ఎక్కువగా తాహతుకు మించి ఖర్చయినా బ్రాండెడ్ మందులే వాడుతున్నారు. అత్యంత చౌకగా దొరికే జనరిక్ మందుల వైపు చూసే వారు అతి తక్కువ. ఎందుకిలా?
అసలు బ్రాండెడ్ మందులు అంటే ఏమిటి? జనరిక్ మందులు అంటే ఏమిటి? వీటి మధ్య తేడా ఏమిటి? ప్రభుత్వం ఏం చేస్తోంది? నిపుణులు ఏం చెప్తున్నారు?
ఈ వివరాలన్నీ 7 ప్రశ్నలు, సమాధానాల్లో చూద్దాం.
- ఆరోగ్యం: యాంటీబయాటిక్స్‌కు లొంగని బాక్టీరియాతో దేశంలో కొత్త సంక్షోభం
- గ్యాస్ట్రిక్ అల్సర్ల కోసం కనిపెట్టిన మాత్రను అబార్షన్ల కోసం ఎలా ఉపయోగిస్తున్నారంటే

1. బ్రాండెడ్ మందులు అంటే ఏమిటి? ధరలు ఎక్కువగా ఎందుకు ఉంటాయి?
వివిధ జబ్బులను నయం చేయటం కోసం ఫార్మాస్యూటికల్ కంపెనీలు మందులు తయారు చేస్తుంటాయి. ఒక కంపెనీ కొత్తగా తయారు చేసిన మందుకు తన బ్రాండ్ పేరు పెట్టి విక్రయిస్తుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఆ కంపెనీ నిర్దిష్ట కాలం పాటు పేటెంట్ హక్కులు పొందుతుంది. గరిష్టంగా 20 ఏళ్ల పాటు ఈ పేటెంట్ హక్కు ఉంటుంది.
అంటే.. ఒక మందు మీద ఏదైనా కంపెనీకి పేటెంట్ హక్కు ఉంటే.. ఆ మందును వేరే కంపెనీ తయారు చేసి విక్రయించటానికి వీలు లేదు.
సదరు బ్రాండెడ్ మందులో ఉపయోగించిన రసాయనం లేదా రసాయనాల మిశ్రమం (ఫార్ములా) ఏమిటనే వివరాలు తెలిసినా కూడా వేరే కంపెనీలు వీటిని తయారు చేయకూడదు.
ఆ మందు మీద పేటెంట్ పొందిన కంపెనీ.. ఆ మందు తయారీకి అయ్యే ఖర్చు కన్నా ఎక్కువ ధరకు దానిని విక్రయిస్తుంది. ఆ మందును కనిపెట్టటానికి చేసిన పరిశోధనలు, ప్రయోగాలు, క్లినికల్ పరీక్షల కోసం వెచ్చించిన సొమ్ము వంటి ఖర్చులన్నీ రాబట్టుకోవటానికి ఇలా ఎక్కువ ధరకు అమ్ముతుంది.
ఇలాంటి మందులనే బ్రాండెడ్ మందులుగా పిలుస్తారు. వీటిని స్టాండర్డ్ మందులని కూడా అంటారు.
- మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి ఎందుకు పెరుగుతున్నాయి... జనరిక్ ఔషధాలతో పరిష్కారం దొరుకుతుందా?
- వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?
2. జనరిక్ మందులు అంటే ఏమిటి? ధరలు తక్కువగా ఎందుకు ఉంటాయి?
ఓ కంపెనీ తయారు చేసిన మందు మీద పేటెంట్ హక్కు కాలపరిమితి ముగిసిన తర్వాత.. అదే ఫార్ములాతో ఇతర కంపెనీలు కూడా ఆ మందు తయారు చేసి విక్రయించవచ్చు.
అంటే ఈ కంపెనీలు పరిశోధనలు, ప్రయోగాలు, పరీక్షలు లేకుండానే ఆ మందును తయారు చేస్తాయి. ఈ మందుకు అందులో ఉపయోగించిన ఔషధం పేరును మాత్రమే పెడతాయి. ఇలా తయారు చేసే మందులనే జనరిక్ మందులు అంటారు.
అంటా 'పారాసెటమాల్ 650' వంటి పేరు. ఇలాంటి జనరిక్ మందుల ధరలు.. బ్రాండెడ్ మందులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.
బ్రాండెడ్ మందులకు - జనరిక్ మందులకు ధరలో తేడా ఉంటుంది కానీ.. ఈ రెండిటిలో ఒకే రకమైన ఔషధ మిశ్రమం, ఔషధ పరిమాణం, నాణ్యత ఉంటుందని నిపుణులు చెప్తారు.
https://twitter.com/AmritMahotsav/status/1576986195317313537
ప్రపంచంలో జనరిక్ మందులను సరఫరా చేయటంలో అతి పెద్ద దేశం భారతదేశమే. అయితే.. దేశీయ మార్కెట్‌లో కేవలం రసాయన పేర్లతో విక్రయించే జనరిక్ మందుల వాటా కేవలం 10 శాతం గానే ఉంది.
భారతదేశంలో విక్రయించే మందుల్లో 87 శాతం ఔషధాలు.. 'బ్రాండెడ్ జనరిక్ మందులు'. అంటే.. బ్రాండ్ పేరుతో అమ్మే జనరిక్ మందులు.
ఏదైనా బ్రాండెడ్ మందు మీద ఒక కంపెనీకి పేటెంట్ హక్కు ముగిసిన తర్వాత.. ఇతర కంపెనీలు అదే ఫార్ములాతో మందును తయారు చేసి తమ బ్రాండ్ పేరు పెట్టుకుని విక్రయించవచ్చు. ఇలాంటి మందులను 'బ్రాండెడ్ జనరిక్ మందులు' అంటారు.
బ్రాండెడ్ మందుల ధర కన్నా ఈ బ్రాండెడ్ జనరిక్ మందుల ధర కాస్త తక్కువగా ఉంటుంది. కానీ మామూలు జనరిక్ మందుల ధరకన్నా ఎక్కువగా ఉంటుంది.
- ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు.. మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
- బీట్రూట్, వెల్లుల్లి, పుచ్చకాయ తింటే బీపీ అదుపులో ఉంటుందా
https://twitter.com/pmbjppmbi/status/1500139081505730560
3. జనరిక్ మందుల కోసం పీఎంబీజేపీ పథకం ఏమిటి?
చాలా చౌకైన జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులోకి తేవటానికి.. 'ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ)' పేరుతో కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖలోని ఔషధ విభాగం 2008 నవంబరులో పథకాన్ని ప్రారంభించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో రూపొందిన ఈ పథకం కింద.. తక్కువ ధరలకు జనరిక్ మందులను విక్రయించే ప్రత్యేక 'జనౌషధి కేంద్రాల'ను ప్రారంభించారు. కానీ ఆరేళ్లలో అంటే 2014 నాటికి దేశంలో కేవలం 80 కేంద్రాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఈ కేంద్రాలను విస్తరించాలని 2015లో కార్యదర్శుల కమిటీ సిఫారసు చేసింది.
ఫలితంగా.. ఆ తర్వాతి ఆరేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 8,000 జనౌషధి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ కేంద్రాలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం.. 2021 చివరి నాటికి దేశంలో 8,640 జనౌషధి కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిద్వారా 1,451 ఔషధాలు, 250 సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో సగటు నెల వారీ విక్రయాలు రూ. 1.50 లక్షలకు పెరిగాయి.
2025 మార్చి నాటికి 10,500 జనౌషధి కేంద్రాలు ప్రారంభించాలని, వీటిలో 2,000 రకాల వరకూ మందులు, 300 సర్జికల్ వస్తువులు విక్రయించాలని పీఎంబీజేపీ పథకం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం అమలు కోసం 2020-21 నుంచి 2024-25 సంవత్సరాల కోసం రూ. 490 కోట్ల కేటాయింపులు చేశారు.
నాణ్యమైన ఔషధాలను ప్రజలకు ముఖ్యంగా పేదలకు, అణగారిన వర్గాలకు అందించటం.. జనరిక్ మందుల గురించి విద్య, ప్రచారం ద్వారా అవగాహన కల్పించటం, పీఎంబీజేపీ కేంద్రాల ద్వారా ఉపాధి సృష్టించటం ఈ పథకం లక్ష్యాలు.
జనరిక్ మందుల ధరలు బహిరంగ మార్కెట్‌లో బ్రాండెడ్ మందుల కన్నా 50 శాతం నుంచి 90 శాతం వరకూ తక్కువగా ఉంటాయి.
- కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?
- పతంజలి కరోనిల్: కరోనావైరస్కు విరుగుడు అనే ప్రచారంలో నిజమెంత

4. జన ఔషధి కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి?
ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రవైటు వ్యాపారుల ద్వారా కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఉత్పత్తులు నాణ్యంగా ఉండేలా చూడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ - గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ (డబ్ల్యూహెచ్ఓ - జీఎంపీ) సర్టిఫై చేసిన సరఫరాదారుల నుంచి మాత్రమే ఈ మందులను సేకరించటం జరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది.
జనౌషధి కేంద్రాల్లో విక్రయించే జనరిక్ మందులను ఈ-టెండర్ల ద్వారా సేకరిస్తోంది.
ఉత్తమ నాణ్యత ఉండేలా చూడటానికి.. ప్రతి బ్యాచ్ మందునూ 'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబరేటరీస్ (ఎన్ఏబీఎల్) అధీకృత లేబరేటరీల్లో పరీక్షించటం జరుగుతుందని పేర్కొంది.
పీఎం బీజేపీ అంటే ఏంటి?
- ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పథకం.. షార్ట్ కట్‌లో పీఎం బీజేపీ అని పిలుస్తున్నారు.
- బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు 50 శాతం నుంచి 90 శాతం రాయితీతో లభిస్తాయి.
- డయాబెటిస్ మందులు గరిష్టంగా 100 రూపాయలకు, ఆర్థరైటిస్ మందులు గరిష్టంగా 65 రూపాయలకు, యాంటీబయోటిక్స్ గరిష్టంగా 56 రూపాయలకు, క్యాన్సర్ చికిత్స మందులు గరిష్టంగా 440 రూపాయలకు లభిస్తున్నాయి.
- మందులే కాకుండా రోజువారీ పోషణకు సంబంధించిన న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా ఈ దుకాణాల్లో లభిస్తాయి.
- 2022 అక్టోబర్ రెండోవారం నాటికి 1616 జనరిక్ మందులు, 250 రకాల మెడికల్ పరికరాలు జన ఔషధి దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా 8700 ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు (పీఎంబీజేకే) ఉన్నాయి.
- బ్రాండెడ్ మందులకు సరితూగే జనరిక్ మందులను ఆ మందు కోడ్, ప్రొడక్ట్ నేమ్ ఆధారంగా ఈ లింక్‌ను క్లిక్ చేసి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఈ మందుల జాబితా పీడీఎఫ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటి ధరలను కూడా అక్కడే చూడొచ్చు.
- పీఎంబీజేకే.. జన ఔషధి కేంద్రాన్ని మీరు ఏర్పాటు చేయాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి సమాచారం పొందవచ్చు. కొత్త కేంద్రానికి అప్లై చేయొచ్చు.
- జనరిక్ మందుల సమాచారం, వాటి ధరలు, వాటిని విక్రయించే షాపుల వివరాలు మొత్తం జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్, ఉమంగ్ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మహిళల కోసం జన్ ఔషధి సువిధ ఆక్సో-బయోడిగ్రేడబుల్ సానిటరీ నాప్కిన్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ జన్ ఔషధి సువిధా న్యాప్కిన్లు ఒక్కో ప్యాడ్ ధర కేవలం 1 రూపాయి మాత్రమే.
ఈ కేంద్రాల్లో ఎన్-95 ఫేస్‌మాస్క్‌ను 25 రూపాయలకు అందిస్తున్నారు. అలాగే.. దాదాపు 75 రకాల ఆయుర్వేద ఔషధాలను కూడా ఈ జనౌషధి కేంద్రాల్లో విక్రయిస్తున్నారు.
పీఎంబీజేపీ పథకం ద్వారా.. 2020-21 సంవత్సరంలో జనౌషధి కేంద్రాల ద్వారా 652.67 కోట్ల రూపాయల విక్రయాలు జరిగాయని తాజా నివేదిక చెప్పింది. దీని ద్వారా దేశంలో సామాన్య ప్రజలకు సుమారు రూ. 3,800 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం అంచనా వేసింది.
'జనౌషధి సుగమ్' అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా.. సమీపంలో జనౌషధి కేంద్రం ఎక్కడ ఉందనే వివరాలతో పాటు, జనౌషధి కేంద్రాల్లో లభించే జనరిక్ మందుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
- బాత్ సోప్‌లు, టూత్ పేస్టులు, కాస్మెటిక్స్‌లో వాడే ట్రైక్లోసాన్... నరాలను దెబ్బతీస్తోందా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?

5. జనరిక్ మందులను జనం ఎందుకు ఎక్కువగా వాడటం లేదు?
ప్రాణాధారమైన ఔషధాలను ప్రజలకు చౌకగా అందించటానికి జనరిక్ మందుల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రత్యేక దుకాణాలనూ తెరుస్తోంది. కానీ ప్రజల్లో ఈ జనరిక్ మందుల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. అది అనుకున్నంత స్థాయిలో లేదు.
అత్యధికులకు ఈ జనరిక్ మందుల గురించి.. ఆ మాటకు వస్తే మందుల గురించే సరైన అవగాహన లేదు. వైద్యుల ఇచ్చిన చీటీని మందుల షాపుకు తీసుకువెళ్లి, ఆ షాపులో ఇచ్చిన మందులకు డబ్బులు చెల్లించి, ఆ మందులను డాక్టర్ చెప్పిన ప్రకారం వాడటమే తెలుసు.
అయితే మందుల గురించి, చౌకైన జనరిక్ మందుల గురించి తెలిసిన వాళ్లలో కూడా వీటి కొనుగోళ్లకు వెనుకాడుతున్నారు. ఎక్కువగా బ్రాండెడ్ మందులు, జనరిక్ బ్రాండెడ్ మందులకే మొగ్గుచూపుతున్నారు.
చౌకైన మందులకన్నా ఖరీదైన మందులు బాగా పనిచేస్తాయనే అపోహ ఎక్కువగా ప్రజల్లో ఉందని, అందుకే జనరిక్ మందుల కన్నా బ్రాండెడ్ మందుల వైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారని చెప్తుంటారు. ఆ విషయం ఎంతవరకూ నిజమనే దాని మీద సరైన సమాచారం లేదు.
అలాగే.. డాక్టర్ రాసిచ్చే మందుల చీటీ (ప్రిస్క్రిప్షన్)లో బ్రాండెడ్ మందులనే ఎక్కువగా సిఫారసు చేస్తుండటం.. జనం జనరిక్ మందుల వైపు ఎక్కువగా వెళ్లకపోవటానికి ఒక ప్రధాన కారణమనే వాదనా ఒకటి బలంగా ఉంది.
https://twitter.com/pmbjppmbi/status/1564586122608422912
నిజానికి.. వైద్యులు సాధ్యమైనంత వరకూ మందుల చీటీలో జనరిక్ మందులు స్పష్టంగా, పెద్ద అక్షరాలతో రాయాలని భారత వైద్య మండలి తన నియమావళిలో నిర్దేశించింది. అలా చేయకపోతే చర్యలు ఉంటాయని కూడా స్పష్టంచేసింది.
కానీ.. ప్రిస్క్రిప్షన్‌లో జనరిక్ మందులు రాసే వైద్యులు చాలా అరుదు. ఎక్కువ మంది బ్రాండెడ్ మందులు లేదా జనరిక్ బ్రాండెడ్ మందులు రాస్తుంటారు. ఇలా రాయటం గురించి భిన్న వాదనలు ఉన్నాయి.
ఫార్మా కంపెనీలు మార్కెటింగ్‌లో భాగంగా తమ బ్రాండెడ్ మందులను రోగులకు రాసివ్వాలంటూ వైద్యులను అనేక రకాలుగా ప్రలోభ పెడుతుంటాయని, అందుకే వైద్యులు చౌకైన జనరిక్ మందులను విస్మరించి, ఖరీదైన బ్రాండెడ్ మందులు సిఫారసు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ అంశం.. ఇటీవలి 'డోలో 650' వివాదంతో మరోసారి చర్చనీయాంశమైంది. రోగులకు 'డోలో 650' ప్రిస్క్రైబ్ చేసేలా వైద్యులను అనేక కానుకలు, టూర్లు వంటి ప్రలోభాలు అందించటానికి ఆ కంపెనీ భారీగా డబ్బులు ఖర్చు చేసిందనే వివాదం కొద్ది నెలల కిందట సంచలనం సృష్టించింది.
ప్రిస్క్రిప్షన్‌లో బ్రాండ్ ఔషధాల పేర్లు రాసే విధానాల వల్ల.. దేశీయ రిటైల్ మార్కెట్‌లో జనరిక్ మందులకు డిమాండ్ తక్కువగా ఉంటోందని ప్రభుత్వ 'మార్కెట్ స్టడీ ఆన్ ది ఫార్మాస్కూటికల్ సెక్టార్ ఇన్ ఇండియా' నివేదిక చెప్తోంది. దీనివల్ల తయారీ సంస్థలు ఇటువంటి జనరిక్ మందులను ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాయని అభిప్రాయపడింది.
ఆకలిని నియంత్రించే ఆహార పదార్థాలు ఏవి?

6. డాక్టర్లు జనరిక్ మందులు ఎందుకు రాయటం లేదు?
అయితే.. వైద్యులు జనరిక్ మందులకన్నా ఎక్కువగా బ్రాండెడ్, బ్రాండెడ్ జనరిక్ మందుల వైపు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం.. ఆ మందుల నాణ్యత, విశ్వసనీయత అని కొందరు వాదిస్తున్నారు.
''డాక్టర్లు సాధారణంగా బ్రాండెడ్ జనరిక్ మందులు సిఫారసు చేస్తుంటారు. ఎందుకంటే సాధారణ జనరిక్ మందుల నాణ్యత గురించి వారికి కచ్చితంగా తెలీదు. అందువల్ల రోగి ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టదలచుకోరు. ఇంకోవైపు బ్రాండెడ్ మందులు డాక్టర్లు నమ్మే నాణ్యమైన కంపెనీకి చెందినవి. గత అనుభవాన్ని బట్టి కూడా డాక్టర్ ఒక బ్రాండును ఎంచుకుంటారు'' అని డాక్టర్ రాహుల్ భార్గవ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఇటీవల రాసిన ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు. ఆయన ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో హెమటాలజీ అండ్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగానికి ప్రిన్సిపల్ డైరెక్టర్‌గా ఉన్నారు.
''డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు రోగి దీర్ఘ కాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందు నాణ్యతలో తేడా ఉంటే రోగి ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం ఉండొచ్చు. ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగుల మీద వైద్యులెవరూ జనరిక్ మందులతో ప్రయోగం చేయరు'' అని కూడా డాక్టర్ రాహుల్ భార్గవ పేర్కొన్నారు.
''జనరిక్ మందులు ఎక్కువగా పెద్దగా తెలియని కంపెనీల నుంచి వస్తాయి. బ్రాండెడ్ మందులు తయారు చేసే కంపెనీలకు ఒక నాణ్యతా నియంత్రణ వ్యవస్థ, తయారీ విధానాలు, సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు ఉంటాయి. జనరిక్ మందులు తయారు చేసే కంపెనీలకు ఇదే తరహా పటిష్ట వ్యవస్థ ఉందా లేదా అన్నది డాక్టర్లు నిర్ధారించుకోలేరు'' అని చెప్పారు.
''జనరిక్ మందులను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేముందు నాణ్యత తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ప్రస్తుతం వనరులు, సిబ్బంది పరిమితంగా ఉండటం వల్ల.. మందుల పరీక్షలు, తనిఖీలు తగినంతగా జరగటం లేదు. దీనివల్ల నాసిరకం మందులు, కలుషిత మందులు పంపిణీ వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
- ఆస్పత్రికి వెళ్ళిన రోగులు 17 రకాల హక్కులను వినియోగించుకోవచ్చు, అవి ఏంటో మీకు తెలుసా
- డోలో 650: ఈ ఔషధాన్ని ప్రజలకు సూచించాలని డాక్టర్లకు రూ.1000 కోట్లు ఇచ్చారా

7. జనరిక్ మందులు నాణ్యమైనవా? కావా?
భారతదేశంలో ఔషధ పరిశ్రమ టర్నోవర్ 1990లో 1,750 కోట్లుగా ఉండగా.. మూడు దశాబ్దాల్లో 2019-20 నాటికి ఆ టర్నోవర్ 2.89 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఔషధ వ్యాపారంలో సగ భాగం విదేశీ ఎగుమతులదే. అలా విదేశాలకు ఎగుమతయ్యే ఔషధాల్లో జనరిక్ మందులదే సింహ భాగం.
దేశంలో ప్రభుత్వ ఔషధ సేకరణ సంస్థలు ప్రధానంగా జనరిక్ మందులనే సేకరించి వినియోగిస్తాయి. అంటే ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ విభాగాలు నిర్వహించే ఆస్పత్రుల్లో అత్యధికంగా ఉపయోగించేది జనరిక్ మందులనే.
''ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ జనరిక్ మెడిసిన్' అని పేరున్న భారతదేశంలో చౌక ధరకు జనరిక్ మందులు పొందటం చాలా సులభం. 'నాణ్యమైనవని భావించే' జనరిక్ మందులు వరదలా ముంచెత్తే మార్కెట్‌లో.. 'నాణ్యమైనవని భరోసా ఇచ్చే' జనరిక్ మందులను కనుగొనటం అసలైన కష్టం'' అని.. మహారాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ సారావ్‌దేకర్ ఇటీవల ఎక్స్‌ప్రెస్‌ఫార్మా పత్రికలో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
మూడు దశాబ్దాల పాటు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సరఫరాల సేకరణకు అధిపతిగా పనిచేసినపుడు.. అతి తక్కువ ధరలకు జనరిక్ మందులను అందించే బాధ్యతలను తాను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
''ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు 2,00,000 మందులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 10,000 సంస్థలు వీటిని మార్కెట్ చేస్తున్నాయి. బ్రాండెడ్ మందులైనా, జనరిక్ మందులైనా.. వాటిని ఏ లైసెన్సు కింద తయారు చేశారనే దానినిబట్టి వాటి నాణ్యతలో తేడా ఉంటుంది. ... చాలా కంపెనీలు 'లోన్ లైసెన్స్' మీద కానీ, పీర్ టు పీర్ లైసెన్స్ మీద కానీ, థర్డ్ పార్టీ లైసెన్స్ మీద కానీ.. సుమారు 6,000కు పైగా ఉన్న స్మాల్ స్కేల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లలో అతి తక్కువ ధరకు తయారు చేయించుకుంటాయి. వాటిని తమ బ్రాండ్ పేరుతో ఎక్కువ ధరకు మార్కెట్ చేస్తాయి'' అని ఆయన వివరించారు.
- సెక్స్ అంటే అరబ్ కుర్రాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, వయాగ్రాకు అక్కడ ఎందుకంత డిమాండ్?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే 'వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?

దాదాపు 1,000 కంపెనీలు అసలు ఏ మందులూ తయారు చేయవని, చిన్న స్థాయి తయారీ యూనిట్లలో మందులు తయారు చేయించి, వాటిని మార్కెట్ చేస్తాయని డాక్టర్ సురేష్ సారావ్‌దేకర్ చెప్తున్నారు. ఆ మందులు నాసిరకమని తేలితే తయారు చేసిన సంస్థకు ఇబ్బందుల్లో పడుతుంది కానీ, మార్కెట్ చేసిన కంపెనీ తప్పించుకుంటుందని, వేరే చిన్న స్థాయి యూనిట్లలో మందులు తయారు చేయించి మార్కెట్ చేస్తుందని ఆయన తెలిపారు.
భారతదేశం ఫార్మా రంగం మార్కెట్‌లో సగ భాగం ఎగుమతులదే. ఇలా మందులు ఎగుమతి చేసే భారత కంపెనీలు.. అమెరికా, యూరప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి కఠిన నియంత్రణ మార్కెట్లకు ఎగుమతులు చేసేట్లయితే.. అంతర్జాతీయ ప్రమాణాలైన 'గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్'కు కట్టుబడి ఉండాలి.
''కానీ, దేశీయ మార్కెట్‌కు ఈ కఠిన ప్రమాణాలు పాటించటం తప్పనిసరి కాదు. కాబట్టి ఒక నిర్దిష్ట సంస్థ అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేయటానికి అత్యధిక నాణ్యతలతో కూడిన మందులు తయారు చేయవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయటానికి మధ్యస్థ ప్రమాణాలతో మందులు తయారు చేయవచ్చు. దేశీయ మార్కెట్ కోసం, నైజీరియా, యెమెన్ వంటి నియంత్రణ లేని మార్కెట్ల కోసం అతి తక్కువ ప్రమాణాలతో మందులు తయారు చేయవచ్చు. కాబట్టి.. భరోసా గల నాణ్యతతో అతి తక్కువ ధరలకు జనరిక్ మందులను అందించటం అనేది అనేక స్థాయిల్లో, అనేక అంశాలతో ముడిపడి ఉన్న సంక్లిష్టమైన అంశం'' అని డాక్టర్ సురేష్ సారావ్‌దేకర్ విశ్లేషించారు.
మందులకు సంబంధించి వినియోగదారుల్లో అవగాహన పెంచటం, మందుల మీద పూర్తి వివరాలు వెల్లడించటం వంటి చర్యలతో పాటు.. ప్రభుత్వ మందుల సేకరణ కోసం డబ్ల్యూహెచ్ఓ-జీఎంపీ సర్టిఫికిషేన్, సొంత లైసెన్సు ఉండటం వంటి నిబంధనలు, ప్రమాణాలను పాటించటం వల్ల ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చునని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)