అసలేం జరిగింది?: యూనివర్సిటలోని గాంధీ విగ్రహం తొలగింపు
ఆక్రా: ఘనా దేశ రాజధాని అక్రాలోని యూనివర్సిటీ ప్రాంగణంలో నెలకొల్పిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గాంధీని 'జాత్యాహంకారి'గా పేర్కొంటూ యూనివర్సిటీ ఆఫ్ ఘనాలోని కొందరు ప్రొఫెసర్లు ఆ విగ్రహాన్ని తీసేయాలంటూ గత నెలలో పిటిషన్ల ఉద్యమం మొదలుపెట్టారు.
ఇది జాతి దురహంకారమే అవుతుందని విమర్శకులు మండిపడుతున్నా, ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కచ్చితమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదని పిటిషన్ ఉద్యమానికి నేతృత్వం వహించిన ఆబాదెల్ కాంబోన్ చెప్పారు. ఘనా యూనివర్సిటీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది జూన్ నెలలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

భారత్, ఘనా దేశాల మధ్య సత్సంబంధాలకు సూచికగా దీన్ని అక్కడ నెలకొల్పారు. నల్లజాతీయులైన ఆఫ్రికావాసుల కంటే భారతీయులు ఎంతో ఉన్నతులని మహాత్మా గాంధీ చెప్పినట్లు ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. ఇందుకు నిరసనగా గాంధీ విగ్రహాన్ని తొలగించాలంటూ యూనివర్సిటీ ఆఫ్ ఘనాలోని కొందరు ప్రొఫెసర్లు ఉద్యమిస్తున్నారు.
దీంతో విగ్రహం భద్రత కోసం దాన్ని యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వేరే చోటుకు తరలించాలని భావిస్తున్నట్లు ఘనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే విగ్రహాన్ని ఘనాలోని వేరే చోటుకు తరలించాలన్న నిర్ణయం మంచిది కాదని, దానిని భారత్‌కు తిప్పి పంపేయాలని కాంబోన్ ఘనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గాంధీ విగ్రహానికి బదులు ఘనా దేశానికి చెందిన ప్రముఖ నాయకుడు యా అసంటెవా లేదా ఘనా తొలి అధ్యక్షుడు క్వామే ఎన్‌క్రుమా లాంటి వాళ్ల విగ్రహాలు పెట్టాలని ప్రొఫెసర్లు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications