పేరెంట్స్ మాట వినలేదు: ప్రేయసిని పెళ్లాడిన యువతి!
జబల్‌పూర్: యువతిని యువకుడు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం సాధారణమే. అయితే ఇక్కడ విచిత్రం జరిగింది. ప్రేమించిన తన ప్రేయసిని పెళ్లాడింది ఓ యువతి. అదేంటి యువతిని ప్రేమించిన మరో యువతి ఆమెనే పెళ్లాడిందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయినా ఇది నిజమే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గత చాలా కాలంగా తనతోపాటు ఉంటున్న యువతిపై ప్రేమ కలిగిన మరో యువతి ఆమెనే వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నికితా అసానీ(24) అనే యువతి సత్నా ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి కనబడకుండా పోయింది. దీంతో ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు గురువారం జబల్‌పూర్ ప్రాంతంలో అచ్చం నికితాలాగే ఉండే ఓ అమ్మాయి కనిపించింది. ఆమెను గుర్తించాలని తల్లిదండ్రులను ఇక్కడకు రప్పించారు. ఆ అమ్మాయి నికితా అసానీనేనని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. అయితే నికిత ఆమె తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. తానెప్పటికీ తన ప్రేయసితోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పింది. తమతో రావాలన్న తండ్రిదండ్రుల మాటను ఆమె తిరస్కరించింది.
అంతేకాదు, చాలాకాలంగా తాను సహజీవనం చేస్తున్న రజినీ రాజ్ నగర్ అనే యువతినే తాను పెళ్లి చేసుకున్నానని తెలిపింది. తల్లిదండ్రుల వెంట వెళ్లాలని పోలీసులు ఎంత సర్ది చెప్పినా ఆమె వినలేదు. తాను మేజర్ అని, తనకు మంచి చెడు తెలుసని బదులిచ్చింది. కాగా, నికితను ట్రాప్ చేసిన రజనీ నగర్‌కు ఇదేమీ కొత్త కాదని, ఇంతకుముందు కూడా ఓ యువతిని ట్రాప్ చేసిందని పోలీసులు తెలిపారు. రజినీపై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని తెలిసింది.












Click it and Unblock the Notifications