గోవా బీచ్ గ్యాంగ్ రేప్... దుమారం రేపుతున్న సీఎం సావంత్ వ్యాఖ్యలు... భగ్గుమన్న ప్రతిపక్షాలు...
గోవా బీచ్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. స్నేహితులతో కలిసి బీచ్ పార్టీకి వెళ్లిన ఆ బాలికలపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా... ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆ రాత్రి బీచ్‌లో బాలికలకు ఏం పని అని సీఎం ప్రశ్నించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండక్కర్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగింది....
గోవాలోని బెనౌలిమ్ బీచ్‌లో ఇటీవల 10 మంది టీనేజర్లు పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఆరుగురు తమ తమ ఇళ్లకు వెళ్లిపోగా నలుగురు మాత్రం ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. ఆ నలుగురిలో ఇద్దరు బాలికలు,ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. తాము పోలీసులం అని చెప్పి ఇద్దరు అబ్బాయిలను చితకబాదారు. ఆపై ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ ఘటనపై సీఎం రియాక్షన్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది.

సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు...
'14 ఏళ్ల పిల్లలు రాత్రంతా బీచ్‌లో గడిపారంటే వారి తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పిల్లలు మాట వినట్లేదన్న కారణంతో ప్రభుత్వంపై,పోలీసులపై ఆ బాధ్యత వదిలేయడం సరికాదు.' అని సీఎం ప్రమోద్ సావంత్ వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు పిల్లల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని... రాత్రిపూట ఆడపిల్లలను బయటకు పంపించరాదని అన్నారు.మైనర్లయితే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పౌరులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రాత్రిపూట ఆడపిల్లలను బయట తిరగవద్దని చెప్పడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Recommended Video

భగ్గుమన్న ప్రతిపక్షాలు
'రాత్రిపూట బయట తిరిగేందుకు ఎందుకు భయపడాలి. నేరస్తులంతా జైళ్లలో ఉండాలి... చట్టాలను కట్టుబడి ఉండే పౌరులు స్వేచ్చగా తిరగ్గలగాలి.' అని గోవా కాంగ్రెస్ పేర్కొంది. గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయ్ మాట్లాడుతూ... పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేనిపక్షంలో ప్రమోద్ సావంత్‌కు సీఎం కుర్చీలో కూర్చొనే అర్హత లేదన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రోహన్ మాట్లాడుతూ... మహిళలకు సురక్షితమైన రాష్ట్రంగా గోవాకు పేరు ఉన్నదని,కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పేరు తుడిచిపెట్టుకుపోతోందని విమర్శించారు. ప్రభుత్వమే పౌరులకు రక్షణ కల్పించకపోతే ఇంకెవరు కల్పిస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications