గోవాలో ఆ పని చేస్తే 3 లక్షలు ఫైన్..! అశోక్ గజపతిరాజు ఎఫెక్ట్ మొదలు
ఏపీలో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు చేసి తాజాగా గోవా గవర్నర్ గా ఎంపికైన అశోక్ గజపతిరాజు తాజాగా ఆ బాధ్యతలు చేపట్టారు. వచ్చీ రాగానే గోవాపై తనదైన ముద్ర వేసేందుకు అక్కడి ప్రభుత్వంతో కలిసి ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గోవా మంత్రివర్గం తాజాగా కేబినెట్ భేటీలో ఓ కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే కచ్చితంగా రాష్ట్రంలో మార్పు కనిపించబోతోంది.
చిన్న రాష్ట్రమైన గోవాలో ప్రస్తుతం జనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారబోయటం. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు బహిరంగంగా కూడా అక్కడి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు చొరవ చూపినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చెత్త సమస్యపై తగు చర్యలు తీసుకోవాలని రాజు గారు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం తాజా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఇకపై చెత్త పార బోస్తే తొలుత 200 జరిమానా విధిస్తామని రెండోసారి పట్టుబడితే మాత్రం 3 లక్షల వరకూ జరిమానా విధించేందుకు వీలుగా కొత్తగా చట్టంలో మార్పులు చేయబోతోంది. ఈ మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం గోవా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో కేబినెట్ ఆమోదించిన మార్పుల ప్రకారం గోవా నాన్ బయోగ్రేడబుల్ గార్బేజ్ చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు సీఎం ప్రమోద్ సావంత్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్ధలాలు, జలవనరుల్లో చెత్త పారబోసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలపై అక్కడి కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ పెంచి జరిమానాలు విధించబోతోంది.












Click it and Unblock the Notifications