జనరల్ కోచ్ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: జనరల్ రైల్ బోగీల్లో ప్రయాణించే ప్రజలకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. జనరల్ కోచ్ ప్రయాణికులకు అందుబాటు ధరలోనే ఆహారాన్ని, మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించే వారి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ ఆహార పదార్థాలు ఆయా స్టేషన్లలో జనరల్ కోచ్‌లు ఆగే చోట ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉంచుతారని రైల్వే బోర్డు తెలిపింది. జనరల్ కోచ్ మీల్స్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. ఏడు పూరీలు, డ్రై ఆలూ, పికిల్‌తో కూడిన ప్యాక్‌ను రూ. 20కే అందిస్తారు. ఇక రెండో కేటగిరీ ఆహారాన్ని రూ. 50గా నిర్ణయించారు. ఇందులో అన్నం, రాజ్మా, ఛోలే, కిచిడీ, కుల్చే, భతురే, పావ్ బాజీ, మసాల దోశ.. ఇలా ఏదో ఒక ఆహారాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆహారంతోపాటు 200 ఎంఎల్ వాటర్ గ్లాసులను కూడా ఈ కౌంటర్లలో అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

చౌక ధరలో ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కౌంటర్లను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది జోనల్ రైల్వే అధికారులకు అప్పగించింది రైల్వే శాఖ. కాగా, జనరల్ కోచ్ అంటే రిజర్వేషన్ లేని వారు ఇందులో ప్రయాణిస్తారు. వీటిని సెకండ్ క్లాస్ అన్ రిజర్వ్‌డ్ కోచ్‌లుగా వ్యవహరిస్తారు. సాధారణంగా మెయిల్/ఎక్స్‌ప్రెస్ రెండేసి జనరల్ బోగీలు ఉంటాయి. పెద్ద సంఖ్యలో కిక్కిరిసి ఈ బోగీల్లో సాధారణ ప్రజలు ప్రయాణిస్తుంటారు.
సదరు రైలులో ప్యాంట్రీ కారు సదుపాయం ఉన్నా.. సేవలు అందవు. ఈ క్రమంలోనే అలాంటి జనరల్ కోచ్ ప్రయాణికులకు తక్కువ ధరకే మీల్స్ అందించే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మొదట ప్రయోగాత్మకంగా ఆరు నెలలపాటు దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం 51 స్టేషన్లలో ఈ కౌంటర్లు తీసుకొచ్చామని, గురువారం నుంచి మరో 13 స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications