అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్-ఎయిర్ పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్, చెక్స్ ఇలా..!
అంతర్జాతీయంగా విమాన ప్రయాణాల్లో పలు మార్పులు వస్తున్నాయి. వివిధ దేశాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అంతర్జాతీయ ప్రయాణికులకు అందించే సేవల రూపురేఖలే మార్చేస్తున్నాయి. కానీ భారత్ లో మాత్రం ఎన్నో ఏళ్లుగా అవే పాత వ్యవస్ధలు,విధానాలు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణాలపై ఆసక్తి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
అంతర్జాతీయ ప్రయాణికులకు వేగవంతమైన ఇమ్మిగ్రేషన్, తనిఖీలు చేపట్టేందుకు వీలుగా విమానాశ్రయాల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలో ఇమ్మిగ్రేషన్, తనిఖీ వ్యవస్ధల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇమ్మిగ్రేషన్ తనిఖీలకు బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్ధల్ని అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే తనిఖీల కోసం ఈ-గేట్లను అమర్చనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదలుపెట్టి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకూ ఈ సేవల్ని విస్తరించనున్నారు.

ఎయిర్ పోర్టు ఆపరేటర్లు, సీఐఎస్ఎఫ్, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో ఈ మేరకు పౌర విమానయానమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చర్చలు జరిపారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చే వ్యవస్ధల కోసం ఎయిర్ పోర్టుల్లో చేయాల్సిన మార్పులపై వీరితో చర్చలు జరిపినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఇమ్మిగ్రేషన్, భద్రతా తనిఖీ వ్యవస్ధల్లో మార్పులు తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications