చైనాకు షాక్: దేశ భద్రత దృష్ట్యా మరో 54 యాప్‌ల నిషేధానికి సిద్ధమైన భారత్
న్యూఢిల్లీ: దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారత్, చైనా మధ్య లడఖ్ ప్రతిష్టంబన కొనసాగుతున్న క్రమంలో ఆ దేశ యాప్‌లపై మరోసారి కొరఢా ఝలిపించేందుకు సిద్ధమైంది.
బ్యూటీ కెమెరా సెల్ఫీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ రివర్, యాప్‌లాక్, డ్యూయల్ స్పేస్ లైట్ వంటి 54 యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. సదరు యాప్‌లతో దేశ భద్రతకు ముప్పు పొంచిఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
2020 ఏప్రిల్ నెలలో చైనా బలగాలు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడటంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే 2020 జూన్ 15న గల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. చైనా బలగాల దాడిలో 20 మందికిపైగా భారత సైనికులు మరణించగా, 40 మందికిపైగా చైనా సైనికులు హతమయ్యారు. దీంతో చైనా దుశ్చర్యలకు భారత్ అన్ని వైపులనుంచి గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో 2020లో వందల సంఖ్యలో చైనా యాప్స్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. గల్వాన్ ఘర్షణలు చోటు చేసుకున్న కొద్ది నెలలకే జులై 2020 నెలలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది.
ఆ తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో మరో 118 యాప్‌లు, నవంబర్ నెలలో 43 చైనా యాప్‌లను నిషేధించింది. టిక్ టాక్ తోపాటు విచాట్, షేర్ఇట్, హలో, లైకీ, యూసీ బ్రౌజర్, పబ్జీ వంటి ప్రముఖ యాప్‌లున్నాయి. ఈ క్రమంలో చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని, ఆ యాప్‌లను పునరుద్ధరించేది లేదని భారత్ తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications