గణతంత్ర వేడుకలు: కిరణ్ రెడ్డికి టి సెగ, ప్రతిగా సమైక్యం
న్యూఢిల్లీ/హైదరాబాద్: సికింద్రాబాదులోని పరేడ్ మైదానంలో ఆదివారం 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడారు. అమరవీరుల, త్యాగధనులను స్మరించుకోవాలన్నారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పారదర్శకంగా పని చేయడంలో తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నరసింహన్‌తో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసన సభాపతి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. డిజిపి, పోలీసు కమిషనర్‌ల కార్యాలయాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
అసెంబ్లీ, మండలిలోల గణతంత్ర వేడుకలు జరిగాయి. శాసన సభ ప్రాంగణంలో సభాపతి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ చక్రపాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సిఎంకు తెలంగాణ సెగ
ఎన్టీఆర్, ట్రస్ట్ భవన్, తెరాస భవన్, బిజెపి తదితర పార్టీల కార్యాలయాలలో గణతంత్ర వేడుకలు జరిగాయి. గాంధీ భవన్లో జరిగిన వేడుకలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం తెలంగాణవాదులు సిఎం గో బ్యాక్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా సమైక్యవాదులు కూడా నినాదాలు చేశారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలకు జపాన్ ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్ పథ్ వద్ద సైనిక శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వేడుకల్లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్మారీ, ప్రధాని మన్మోహన్, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications