NEET PG Exam 2021 -4నెలలు వాయిదా -కొవిడ్ విధుల్లోకి మెడికల్ స్టూడెంట్లు -పీఎంవో కీలక ప్రకటన
దేశంలో కొవిడ్ మహమ్మారి రెండో దశ విలయం ఉగ్రరూపం దాల్చల్చినవేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతూ ఆస్పత్రులన్నీ నిండుకుని, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిపై పనిభారం పెరిగిన దరిమిలా కొవిడ్ బాధితులకు చికిత్సలు అందించేందుకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదివే విద్యార్థులను విధుల్లోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం..
వైద్య విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు తప్పనిసరిగా రాయాల్సిన NEET PG Exam 2021 (నీట్-పీజీ పరీక్షను) నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్‌పై పోరు వైద్య సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎంవో తెలిపింది. సాధారణంగా పరీక్షలు, పరీక్షల వాయిదాకు సంబంధించిన ప్రకటనలు కేంద్ర విద్యా శాఖ నుంచి వెలువడాల్సి ఉన్నా ఈసారి పీఎంవో నుంచి రావడం గమనార్హం.

ప్రధాని మోదీ ఆదివారం పలువురు ఉన్నతాధికారులతో నిర్వహించిన రివ్యూలో.. మెడికల్ స్డూడెంట్లను సైతం కొవిడ్ సేవలకు వినియోగించుకునే అంశంపై చర్చ జరిగింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బోధకుల పర్యవేక్షణలో స్వల్ప లక్షణాలున్న కొవిడ్ బాధితులకు చికిత్సలు అందించే విధుల్లో ఉపయోగించుకోవచ్చని పీఎంవో తెలిపింది. అలాగే బీఎస్సీ/జీఎన్‌ఎం ఉత్తీర్ణులైన నర్సులను.. సీనియర్ డాక్టర్లు, సీనియర్ నర్సుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి కొవిడ్ నర్సింగ్ విధుల్లోకి తీసుకోవచ్చని పేర్కొంది.
ఇందుకోసం నీట్ పీజీ పరీక్షను నాలుగు నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ పరీక్ష ఏప్రిల్ 18న జరగాల్సి ఉండగా కరోనా దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. తాజాగా మరో నాలుగు నెలలు వాయిదా వేసింది. అంతేగాక, 100 రోజులు కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికి భవిష్యత్తులో జరగబోయే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications