త్వరలో కొత్త పార్లమెంటు భవనం..గుజరాత్ సంస్థకు పనులు అప్పగించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఢిల్లీ అంటే చాలామందికి టక్కున గుర్తుకొచ్చేది ఎర్రకోట, కుతుబ్ మినార్. ఈ రెండు కాకుండా మరొకటి గుర్తుకొచ్చేది పార్లమెంట్ భవనం. బ్రిటీషు కాలం నుంచి నెలవై ఉన్న ఆ పార్లమెంటు భవనంలో ఎన్నో చట్టాలు చేశారు. ఎన్నో శాసనాలు లిఖించారు. ఆ భవనం అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఢిల్లీకి వెళ్లిన వారెవరైనా సరే ల్యూటెన్స్ ప్రాంతానికి వెళ్లాల్సిందే.. అక్కడ పార్లమెంటు భవనం దగ్గర ఒక ఫోటో దిగాల్సిందే. అలాంటి పార్లమెంటు భవనంలో కొన్ని మార్పులు చేర్పులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే ఓ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించింది.

కొత్త పార్లమెంటు భవనం

కొత్త పార్లమెంటు భవనం


దేశంలోని చట్టాలకు, శాసనాలకు నెలవైయున్న పార్లమెంటు భవనంలో మార్పులు చేర్పులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చకుండానే అందులో మార్పులు చేపట్టనుంది. ఇందుకోసం గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్ , ప్లానింగ్ మరియు మేనేజ్‌మెంట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. పార్లమెంటు భవనం బాహ్య ముఖభాగంలో ఎలాంటి మార్పులు చేయకుండానే లోపలి డిజైన్‌ను మార్చి అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఎంపీలు కూర్చునేందుకు చోటు లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.

హెచ్‌సీపీ సంస్థకు అప్పగించిన పనులు

హెచ్‌సీపీ సంస్థకు అప్పగించిన పనులు

ఇక డిజైన్ కోసం హెచ్‌సీపీ సంస్థకు రూ.229.75 కోట్లు కేంద్రం చెల్లించనుంది. మాస్టర్ ప్లాన్‌ కూడా ఈ సంస్థ రూపొందిస్తుంది. ఈ మాస్టర్‌ ప్లాన్‌లో డిజైన్, ఖర్చు అంచనా, సమగ్ర ట్రాఫిక్ ప్రణాళిక, పార్కింగ్‌ అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా అందిస్తుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12,450 కోట్లు కానుండగా అందులో 3శాతం కన్సల్టేషన్ ఫీజు కింద హెచ్‌సీపీ సంస్థకు చెల్లిస్తున్నట్లు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెచ్‌సీపీ సంస్థకు అధినేత ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్. ఈ సంస్థకు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఉంది. ఇందులో ముఖ్యంగా సబర్మతీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కూడా ఉంది.

నూతన సచివాలయం కూడా..

నూతన సచివాలయం కూడా..

ఇక చాలావరకు మార్పులు పార్లమెంటు లోపలి భాగంలోనే ఉంటాయని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఇక కొత్త నిర్మాణాలు అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తామని చెప్పిన మంత్రి వీటి పనుల అప్పగింతను 2020కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఇక రాష్ట్రపతి భవన్, ఇండియా‌గేట్‌ల మధ్య ఉన్న సెంట్రల్ విస్తా ప్రాంతాన్ని 2021 నవంబర్‌ కల్లా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్త పార్లమెంటు భవనం 2022 కల్లా పూర్తవుతుందని చెప్పిన మంత్రి... 2024 నాటికల్లా సెక్రటేరియట్ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఇక నూతన సెక్రటేరియట్ కోసం శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, కృషి భవన్‌, ఉద్యోగ్ భవన్‌లను కూల్చే విషయమై ఆలోచిస్తున్నామని అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పూరీ స్పష్టం చేశారు. మొత్తం 70వేల మంది ఉద్యోగులు కొలువుదీరేలా ఈ సచివాలయ నిర్మాణం ఉంటుందని మంత్రి తెలిపారు. అన్ని శాఖలు ఇక్కడి నుంచే పనిచేస్తాయని స్పష్టం చేశారు.

 200 ఏళ్లు అవసరాలకు అనుగుణంగా...

200 ఏళ్లు అవసరాలకు అనుగుణంగా...

ఇక ఈ నిర్మాణాలన్నీ భూకంపం సంభవించిన తట్టుకునేలా ఉంటాయని అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం చేపడుతామని మంత్రి వెల్లడించారు. 200 ఏళ్ల వరకు స్టాండర్డ్‌గా ఉండాలన్న తపనతో పార్లమెంటు భవనం, సచివాలయం నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. అదే సమయంలో పార్లమెంటు, నార్త్‌బ్లాక్, సౌత్ బ్లాక్‌లు వారసత్వ సంపదగా ఉన్నాయని వాటిని ఏమి చేయబోమని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ ప్రభాకర్ సింగ్ తెలిపారు. ఇంటీరియర్స్‌ను మాత్రమే మారుస్తామని చెప్పారు.

రైసీనా హిల్స్ 1911 నుంచి 1931వరకు నిర్మాణం జరిగిన ప్రభుత్వ కార్యాలయాలను అప్పట్లో ఎడ్విన్ ల్యూటెన్స్ మరియు హర్బర్ట్ బేకర్‌లు డిజైన్ చేశారు. ఆ సమయంలోనే పార్లమెంటు భవనం కూడా నిర్మాణం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+