వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Grafting Technique: చనిపోయిన ప్రాచీన దేశవాళీ పండ్ల జాతులకు 'అంటుకట్టి' ప్రాణం పోస్తున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మామిడి తోటలో షైజు మచ్చత్తి

కొత్త తరం తోటను పెంచటానికి ఒక గ్రామం మొత్తం కష్టపడాల్సి రావచ్చు. కేరళలోని కన్నాపురం పట్టణాన్ని 'దేశవాళీ మామిడి వారసత్వ సంపద ప్రాంతం (ఇండిజీనియస్ మ్యాంగో హెరిటేజ్ ఏరియా)'గా 2020లో రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ప్రకటించినపుడు.. ఆ గ్రామానికి చెందిన 42 ఏళ్ల షైజు మచ్చత్తికి ఆ విషయమే తెలిసివచ్చింది. ఆయన పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు.

గ్రామస్తులందరూ ఏకమై 200 దేశవాళీ మామిడి జాతులను పెంచారు. చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి వీటిని సేకరించారు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న విభిన్న రకాల మామిడి మొక్కలను సంరక్షించారు.

పాత కాలపు అంటుకట్టే విధానం వల్ల ఇది సాధ్యమైందని మచ్చత్తి చెప్తున్నారు. వ్యవసాయంలో ఎటువంటి శిక్షణా లేని ఆయన 2016 జూలైలో అంటుకట్టటం మీద ప్రయోగాలు ప్రారంభించారు. ఆయన ఆ పని చేయటానికి కారణం.. కన్నాపురం పట్టణంలో ఓ దురదృష్టకరమైన సంఘటన కలకలం సృష్టించటమే.

ఆయన పొరిగింట్లో ఉన్న ఒక మామాడి చెట్టును ఆ ఇంటి యజమాని నరికివేశారు. అది 200 ఏళ్ల వయసున్న చెట్టు. స్థానికంగా వెళ్లత్తన్ అని దానిని పిలిచేవారు.

కన్నాపురం గ్రామస్తులతో మచ్చత్తి

''ఆ చెట్టుకు అత్యంత తీపి మామిడి పళ్లు కాసేవి. నేను రుచి చూసిన మామిడి పళ్లలో అంత తీపి పళ్లు ఎక్కడా తగలలేదు'' అంటారు మచ్చత్తి.

''అది చాలా అరుదైన దేశవాళీ రకం. అంతరించిపోయే ప్రమాదంలో ఉంది'' అని తెలిపారు. అయితే.. ఆ చెట్టు చాలా పాతదనటంలో సందేహం లేదు. ఆ భారీ చెట్టులోని కొన్ని భాగాలు నేలకూలుతూ ప్రమాదకరంగా పరిణమించేవి. దీంతో తాను మనశ్శాంతిగా ఉండాలంటే ఆ చెట్టును నరికివేయాలని ఆ చెట్టు ఉన్న ఇంటి యజమాని నిర్ణయించుకున్నాడు.

''ఆ చెట్టు మా చిన్నప్పటి నుంచీ మా జీవితాల్లో ఒక భాగంగా ఉండింది. రాత్రికి రాత్రి అది పోవటం చూసి మేమంతా దిగ్భ్రాంతి చెందాం'' అని మచ్చత్తి చెప్పారు.

ఆ మరుసటి రోజు నేలకొరిగిన ఆ చెట్టు కొమ్మలను దిగాలుగా చూస్తూ గడిపిన మచ్చత్తి.. కేరళ ప్రభుత్వంలో వ్యవసాయాధికారిగా పనిచేస్తున్న తన మిత్రుడు ఒకరిని సంప్రదించారు. ఆ చెట్టును కాపాడటానికి ఒక దారి ఉందని ఆ మిత్రుడు మచ్చత్తికి చెప్పారు.

ఆ చెట్టులోని కొన్ని భాగాలను.. బలమైన వేళ్లున్న మరొక మామిడి మొక్కకు అంటుకడితే, ఆ పాత చెట్టును మళ్లీ పుట్టించవచ్చునని, ఒక రోజున ఆ చెట్టు పళ్లను మళ్లీ రుచి చూడవచ్చునని వివరించారు.

మామిడి అంటు

అంటుకట్టటం అంటే.. ఒకే జాతికి చెందిన రెండు మొక్కల సేంద్రియ కణజాలాన్ని అనుసంధానించటం ద్వారా కొత్త మొక్కను నిర్మించటం. విభిన్న జాతులు, రకాల మొక్కలకు కూడా అంటుకట్టవచ్చు. కానీ అలా తయారైన మొక్కలు చాలా వరకూ బలహీనంగా ఉంటాయి. వాటి జీవిత కాలం తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి మొక్క తయారే కాదు.

మనం కావాలనుకుంటున్న మొక్క చిగురు కొమ్మను.. విత్తనం నుంచి పెరిగిన వేరొక మొక్క వేరు మొదలుకు అతికించి కడతారు.

కన్నాపురంలో నరికివేసిన చెట్టు నుంచి జాగ్రత్తగా పరిశీలించి ఒక చిగురు కొమ్మను ఎంపిక చేసుకుని దానిని తీసుకొచ్చారు. విత్తనం నుంచి మొలిచిన ఒక బలమైన మామిడి మొక్కను ఎంచుకున్నారు. ఆ మొక్క కాండం మీద చీలిక వంటి గాటు పెట్టారు. ఆ గాటుకు అనుగుణంగా ఉండేలా చిగురు కొమ్మ అడుగుభాగంలో రెండు వైపులా చెక్కారు. ఆ మొక్క కాండం గాటులో చిగురు కొమ్మను జొప్పించారు. ఈ రెండిటినీ కలిపి గట్టిగా కట్టివేశారు. అలా కట్టేసిన భాగాన్ని 'అంటు'గా పిలుస్తారు. ఇది నయమై, ఇవి రెండు కలిసిపోతే మొక్క పెరుగుతుంది.

''ఆ పాత చెట్టు నుంచి మేం 50 అంట్లు తయారు చేశాం. ఆ చెట్టు పూర్తిగా చచ్చిపోకుండా అడ్డుకోగలిగాం. ఆ చెట్లన్నీ ఇప్పుడు ఇంకా బలంగా పెరుగుతున్నాయి. మేం అరుదైన సంపదను సంరక్షించామనే భావన, సంతోషం మాకు కలిగింది'' అని మచ్చత్తి వివరించారు.

అంటుకట్టటం ద్వారా మనకు కావలసిన మొక్కకు సంబంధించి కచ్చితమైన జన్యు ప్రతిరూపం లభిస్తుంది

అంటుకట్టటం వెనుక అనేక కారణాలున్నాయని వ్యవసాయ పరిశోధన ప్రొఫెసర్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ అసోసియేట్ డీన్ నారాయణన్ కుట్టి చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ నడుపుతున్నారు. అంటుకట్టటం మీద రైతులకు, తోటమాలులకు, సంస్థలకు సాంకేతిక సూచనలు అందిస్తున్నారు.

''అంటుకట్టటం ద్వారా మనకు కావలసిన మొక్కకు సంబంధించి కచ్చితమైన జన్యు ప్రతిరూపం లభిస్తుంది. ఎందుకంటే విత్తనాల నుంచి మొలిచే మొక్కలకు కూడా తమ తల్లి మొక్కలకు చెందిన కచ్చతమైన స్వభావం ఉండదు'' అని ఆయన తెలిపారు.

ఇలా అంటుకట్టటం ద్వారా పుట్టే మొక్క పూత, కాత పెరగవచ్చునని, తద్వారా ఆ మొక్క వాణిజ్య విలువ పెరుగుతుందని చెప్పారు.

అంటుకట్టటం ఇప్పుడు మళ్లీ పునరుద్ధరణ జరుగుతున్నప్పటికీ.. ఈ ప్రక్రియ భారతదేశానికి కొత్త కాదని సాంస్కృతిక చరిత్రకారుడు పాల్ క్రాడాక్ చెప్పారు. ఆయన 'స్పేర్ పార్ట్స్: ఎ సర్ప్రైజింగ్ హిస్టరీ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్స్' అనే పుస్తకం రాశారు.

చర్మం అంటుకట్టటం (స్కిన్ గ్రాఫ్టింగ్) ఒక వైద్య ప్రక్రియగా ఆరంభమైనపుడు.. అది ప్రాచీన భారతదేశంలో మూలాలున్న వ్యవసాయ అంటుకట్టే ప్రక్రియల నుంచే స్ఫూర్తి పొందిందని పాల్ చెప్తారు.

మేఘాలయ సజీవ వేరు వంతెనలు ప్రకృతి సహజంగా అంటుకట్టుకుని ఏర్పడ్డాయి

అంటుకట్టటం సహజంగా కూడా జరగవచ్చు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ 'సజీవ వేరు వంతెనల'కు చాలా పేరుపడింది. కొన్ని చెట్ల వేర్లు పెనవేసుకుపోయి గాలిలో వంతెనలుగా ఏర్పడి ఉంటాయి. వాటి మీద మనుషులు వంతెనల మీద నడిచినట్లుగా నడిచివెళ్లేంత బలంగా, గట్టిగా ఉంటాయవి. వీటి మీద నడుస్తూ లోతైన ప్రాంతాలను జనం అధిగమిస్తుంటారు.

ఆ చెట్ల వేర్లు కలగలిసిపోయి స్వయంగా అంటుకట్టుకునే ప్రక్రియ ద్వారా నయమవుతాయి. ఈ సహజ ప్రక్రియను ఇనాస్క్యులేషన్ అంటారు. వేర్వేరు చెట్ల కొమ్మలు కానీ, వేళ్లు కానీ, మొదళ్లు కానీ కొన్ని సంత్సరాలు లేదా దశాబ్దాల పాటు కలిసిపోవటం వల్ల కాలక్రమంలో ఒకే నిర్మాణంగా మారిపోయి పెరుగుతుండటాన్ని వ్యవసాయ శాస్త్ర పరిభాషలో ఇనాస్క్యులేషన్ అని వ్యవహరిస్తారు.

కొన్ని గిరిజన సముదాయాలు.. చెట్ల వేర్లను కలిపివేసి అంటుకట్టటం కూడా చేస్తుంటాయి.

ఇప్పుడు భారతదేశమంతటా సాగుతున్న తోటల పెంపకం ఉద్యమం.. ఆ దేశీయ విజ్ఞానాన్ని పునరుద్ధరించటానికి దోహదపడుతోంది.

మట్టి నాణ్యత క్షీణించటం వంటి ఆధునిక సమస్యలను పరిష్కరించటానికి, మొక్కలు చీడపీడలను తట్టుకునేలా బలోపేతం చేయటానికి, రసాయనాల వినియోగాన్ని తగ్గించటానికి, వాతావరణ మార్పును, వేడిమిని మరింతగా తట్టుకునే మొక్కలను తయారు చేయటానికి ఇది చాలా ఉపయోగపడుతోందని కుట్టి చెప్తున్నారు.

భారతదేశంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి రకం మామిడిపండును కూడా దాదాపుగా అంటుకట్టే ప్రక్రియ నుంచే సాగు చేశారని ఆయన తెలిపారు.

సాధారణంగా, ఒక మొక్కకు గరిష్టంగా నాలుగు నుంచి ఐదు రకాల జాతులను అంటుకట్టవచ్చు. అయితే కొందరు ఈ నియమాన్ని పరీక్షిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మలీహాబాద్‌కు చెందిన 80 ఏళ్ల రైతు కలీమ్ ఉల్లా ఖాన్.. ఒక చెట్టుకు 315 రకాల మామిడి మొక్కలను విజయవంతంగా అంటుకట్టి ప్రపంచ పతాక శీర్షికలకు ఎక్కారు. ఆ చెట్టుకు ఒక్కో కొమ్మ ఒక్కో రకంగా ఉంటుందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న అరుదైన మామిడి రకాలను సేకరించి ఒక చెట్టులో అంటుకట్టారాయన.

‘మ్యాంగో మాన్’గా పేరుపడ్డ కలీమ్ ఉల్లా ఖాన్ ఒకే తల్లి చెట్టుకు వందలాది రకాల మామిడి మొక్కలను అంటుకట్టారు

73 ఏళ్ల టోమి ఇనాసియో సీక్వీరా ఒకప్పుడు మస్కట్‌లో ఆటోమొబైల్ కంపెనీలో పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత మొక్కల మీద తనకున్న ఆసక్తితో ఆ పనిలో తలమునకలయ్యారు. గోవాలోని తన రెండున్నర ఎకరాల 'ద ఫామ్ గోవా' తోటలో అంటుకట్టే ప్రక్రియల మీద ప్రయోగాలు ప్రారంభించారు. తన నలుగురు కొడుకులనూ ఇదే పనిలో పెట్టారు.

''మేం మామిడి, పనస, సపోట, అవకాడో అంట్లు తయారు చేస్తాం. మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లలో విశ్వసనీయమైన నర్సరీల నుంచి వీటిని సేకరిస్తాం'' అని ఇనాసియో కుమారుడు టోస్వెల్ సీక్వీరా చెప్పారు. ఆయన ఐటీ రంగంలో పనిచేస్తారు. వారాంతంలో తమ తోట పని చేస్తుంటారు.

వీరి సంస్థ ఓ సాముదాయిక ప్రాజెక్టుగా మారింది. అంటుకట్టటం ద్వారా తాము విభిన్న రకాల జాతులను పునరుద్ధరించవచ్చుననే ఆసక్తి స్థానికుల్లో పెరిగింది. స్థానికులు నామమాత్రపు ధరతో మంచి నాణ్యమైన అంటు మొక్కలను ఫామ్ గోవా నుంచి కొనవచ్చు. ఈ తోటలో 15 రకాల మామిడి మొక్కలను అంటుకట్టారు.

అంటుకట్టటంతో పాటు టిష్యూ కల్చర్ మీద కూడా ఈ తోటలో ప్రయోగాలు చేశారు. ఒక చెట్టుకు చెందిన కణజాలం (టిష్యూ) నమూనాలతో ప్రయోగశాల వంటి వాతావరణంలో పూర్తిగా కొత్త మొక్కలను పెంచటాన్ని టిష్యూ కల్చర్ అంటారు. వీరు గుజరాత్‌లోని బాల్తారు నర్సరీ నుంచి 2015లో ఒక నిమ్మ చెట్టు టిష్యూ సేకరించారు. ఆ టిష్యూ నుంచి పెంచిన మొక్క నాలుగేళ్ల తర్వాత గింజలు లేని నిమ్మ పండ్లను కాసింది. అయితే.. టిష్యూ కల్చర్‌కు మరింత ఎక్కువ నైపుణ్యం అవసరం.

కన్నాపురం గ్రామస్తులతో మచ్చత్తి

కన్నాపురం తిరిగివస్తే.. ప్రాచీన మామిడి చెట్టు మామిడి పండ్లను మచ్చత్తి విజయవంతంగా మళ్లీ పుట్టించారని తెలుసుకున్న గ్రామస్తులు.. అంతరించిపోతున్న ఇతర రకాల మామిడి జాతులను కూడా కనిపెట్టి, పునరుద్ధరించటానికి సాయం అందించటానికి ముందుకు వచ్చారు.

వారు ఇంటింటికీ తిరిగి జిల్లాలో దొరికే మామిడి జాతుల వివరాలను నమోదు చేసుకున్నారు. అలా అతి త్వరలోనే 200 పైగా రకాల దేశవాళీ మామిడి అంట్లను సేకరించారు. వాటిని పెంచి పెద్దచేశారు. మచ్చత్తి 2016లో 'నాట్టు మంచొట్టిల్ ఎడ్యుకేషనల్ అండ్ ఇండిజీనియస్ ఫ్రూట్ ప్లాంట్స్ కన్సర్వేషన్ అండ్ రీసెర్చ్ ట్రస్ట్'ను ప్రారంభించారు. 'నాట్టు మంచొట్టిల్' అంటే.. 'నాటు మామిడి చెట్టు నీడలో' అని అర్థం.

నాలుగేళ్ల తర్వాత వారి శ్రమ ఫలించింది. ప్రభుత్వం ఈ ట్రస్టుకు 'ప్లాంట్ జీనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు'ను అందించింది. ఈ అవార్డును సాధారణంగా.. విభిన్న జాతుల మామిడి పండ్లను సంరక్షించే వాణిజ్య రైతులకు ఇస్తుంటారు.

ఇప్పుడు మచ్చత్తి రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు పిల్లలు - నేషనల్ సోషల్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) వలంటీర్లతో కలిసి విశిష్టమైన మామిడి తోటలను సృష్టించటం కోసం కృషి చేస్తున్నారు.

ఎవరికి తెలుసు.. మచ్చత్తి అంటుకట్టిన చెట్లు 200 ఏళ్ల వయసున్న వెళ్లత్తన్ లాగా అంత కాలం పెరగవచ్చునేమో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Grafting Technique: Dead ancient indigenous fruit species are given life by 'grafting'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X