ఇండియాలో ఫుట్‌బాల్ క్రేజ్.. కానీ ప్రసారాలపై పైసల పంచాయితీ!
ఫిఫా ప్రపంచకప్ మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నా.. ఇండియాలోని కోట్లాది మంది ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లను టీవీల్లో ఎక్కడ చూడాలో తెలియక తీవ్ర గందరగోళంలో పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రేజ్ ఎలా ఉన్నా.. భారత్‌లో మాత్రం ఈ మెగా టోర్నీకి ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. మన దేశ జట్టు ఈ టోర్నీలో ఆడకపోయినప్పటికీ.. కేరళ, కోల్‌కతా వంటి ప్రాంతాలు బ్రెజిల్, అర్జెంటీనా జెండాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. సాధారణంగా క్లబ్ ఫుట్‌బాల్ చూడని వారు సైతం మెస్సి, రొనాల్డో, ఎంబాపే లాంటి స్టార్ల కోసం అర్ధరాత్రి 3 గంటల వరకు మేల్కొని మరీ మ్యాచ్‌లు చూస్తుంటారు. అయితే జూన్ 11 నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానున్నా.. ఇప్పటివరకు అధికారిక బ్రాడ్‌కాస్టర్ (ప్రసార హక్కులు) ఎవరో ఖరారు కాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఫిఫా ఆశించిన భారీ ధర, భారతీయ ఛానెల్స్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక వనరుల మధ్య ఉన్న వ్యత్యాసమే. భారత్‌లో 2026, 2030 ప్రపంచకప్‌ల ప్యాకేజీ కోసం ఫిఫా మొదట దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 830 కోట్లు) ఆశించింది. కానీ, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులను బట్టి ఆ విలువను 35 మిలియన్ డాలర్లకు తగ్గించాల్సి వచ్చింది. జియోస్టార్ ఇచ్చిన 20 మిలియన్ డాలర్ల ఆఫర్‌ను ఫిఫా తిరస్కరించగా.. సోనీ గ్రూప్ అసలు అధికారికంగా బిడ్‌ను దాఖలు చేయనే లేదు. చివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రసిద్ధ నెట్‌వర్క్ 'జీ' దాదాపు 30 నుండి 35 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 250-290 కోట్లు) ఒప్పందంతో ఈ హక్కులను దక్కించుకోవడానికి నిశ్చయించుకుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

భారతీయ బ్రాడ్‌కాస్టర్లు ఈ హక్కులను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడానికి 'టైమింగ్స్' ఓ పెద్ద సమస్యగా మారాయి. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతుండగా.. అందులో కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లోపు ప్రారంభమవుతాయి. మిగిలినవన్నీ అర్ధరాత్రి దాటాక లేదా తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. పీడబ్ల్యూసీ ఇండియా మీడియా నిపుణుడు రాజేష్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్‌లు ప్రసారమైతే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. పైగా చివరి నిమిషంలో డీల్ కుదిరితే స్పాన్సర్లను వెతుక్కోవడానికి ఛానెళ్లకు తగిన సమయం ఉండదు. జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రకటనకర్తలు డబ్బులు కుమ్మరించరని, వీక్షకుల సంఖ్యను బట్టే రేట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదే విషయమై క్రీడా చట్టాల నిపుణురాలు అహ్నా మెహ్రోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ లాంటి అతిపెద్ద మొబైల్ డేటా వినియోగదారుల మార్కెట్‌ను ఫిఫా అంత సులభంగా వదులుకోలేదని ఆమె అన్నారు. గత 2022 ఖతార్ ప్రపంచకప్ సమయంలో భారత్ నుంచి దాదాపు 110 మిలియన్ల మంది డిజిటల్ వీక్షకులు మ్యాచ్‌లను వీక్షించారు. టోర్నీ గ్లోబల్ ఆడియన్స్‌లో భారత్ వాటానే 2.9 శాతంగా ఉంది. అందువల్ల, భారతీయ మార్కెట్‌ను విస్మరిస్తే అది ఫిఫా లాంగ్ టర్మ్ రెవెన్యూపై ప్రభావం చూపుతుంది. అయితే గతంలో సోనీ, వయాకామ్18 వంటి సంస్థల మధ్య గట్టి పోటీ ఉండేదని, కానీ ఇప్పుడు రిలయన్స్-డిస్నీ విలీనం తర్వాత మార్కెట్ రూపురేఖలు మారిపోయాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలుదారుల హవా నడుస్తుండటంతో ఫిఫా తన పట్టును కోల్పోయి తక్కువ ధరకే హక్కులను అప్పగించాల్సి వస్తోంది.
కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా.. చివరకు భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రసారాలు నిలిచిపోయే ప్రమాదం అయితే లేదు. 'జీ' నెట్‌వర్క్ తన స్పోర్ట్స్ ఛానెల్స్, జీ5 ఓటీటీ యాప్ ద్వారా బహుభాషా ఆడియోతో 104 మ్యాచ్‌లను లైవ్ ప్రసారం చేయడానికి ముంబై స్టూడియోలలో ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే 100 మిలియన్ డాలర్లు పలకాల్సిన ఈ రైట్స్ కేవలం 30 మిలియన్లకే పరిమితం కావడం ఫుట్‌బాల్ మార్కెట్‌కు కొత్త బెంచ్‌మార్క్‌గా మారనుంది. భవిష్యత్తులో మిగతా ఫుట్‌బాల్ లీగ్‌ల ప్రసార హక్కుల ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా, వ్యాపారవేత్తలు మిలియన్ డాలర్ల కోసం బోర్డ్‌రూమ్‌లలో కొట్లాడుకుంటుంటే.. చివరకు నలిగిపోయేది మాత్రం అర్ధరాత్రి దాకా నిద్ర లేకుండా వేచి చూసే సామాన్య ఫుట్‌బాల్ అభిమానులే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications