తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు TTD బిగ్ అలర్ట్ - ఇవి తప్పని సరిగా పాటించండి..!!
తిరుమలలో భక్తుల సందడి పెరిగింది. శ్రావణ మాసం.. వరుస సెలవులు కావటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెలలో రెండు సార్లు శ్రీవారికి గరుడ వాహన సేవ.. ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో.. టీటీడీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. బ్రహ్మోత్సవాల వేళ వసతి సముదాయాలు.. కొత్త నిర్మాణాలు ప్రారంభించనున్నారు. కాగా.. ఈ సమయంలోనే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. భక్తులు తప్పని సరిగా పాటించాల్సిన అంశాలను వెల్లడించింది.
తిరుమల కు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలు నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్‌లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.

దీంతో, భక్తులు టీటీడీకి సంబంధించిన దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే అనధికారిక బుకింగ్ లింకులతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
అదే విధంగా టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్‌మార్క్‌లను ఉపయోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీస్ తదితర విభాగాల సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఇటువంటి నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను గుర్తిస్తున్నామని.. 259 ఫేక్ వెబ్ సైట్లను గుర్తించి తొలగించడంతో పాటు ఆ వెబ్ సైట్ లకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
భక్తులు టీటీడీ సేవలు, దర్శనం, వసతి బుకింగ్‌లను అధికారిక టీటీడీ వెబ్‌సైట్/యాప్ లో మాత్రమే చేసుకోవాలని.. వాట్సాప్‌లో వచ్చే అనధికారిక బుకింగ్ సందేశాలు, లింకులను నమ్మవద్దని సూచించారు. టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలను చూసి మోసపోవద్దని.. తెలియని వ్యక్తులకు బుకింగ్ పేరుతో డబ్బులు పంపవద్దని సూచన చేస్తున్నారు. టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తున్న వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ఖాతా అధికారికమైనదో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని.. వీటిని భక్తులు పాటించాలని టీటీడీ సూచిస్తోంది.














Click it and Unblock the Notifications