గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్ల నిధులు.. పనులపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు
2027 గోదావరి పుష్కరాలను తెలంగాణా సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన పనులు సెప్టెంబర్ మొదటివారంలో పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాల సన్నద్దత, ఏర్పాట్లపైన అధికారులకు దిశా నిర్దేశం
నేడు తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు శాఖల వారీగా గోదావరి పుష్కరాల సన్నద్దత, ఏర్పాట్లపైన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

గోదావరి పుష్కరాలు జరిగేది అప్పుడే
26 జూన్ 2027 నుంచి 7 జూలై 2027 వరకు గోదావరి నది తీరం పుష్కర శోభతో విరాజిల్లేలా, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాలపై ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటి సంకల్పించింది.
సమగ్ర ఏర్పాట్ల కోసం రూ. 1000 కోట్లతో వివిధ శాఖల పరిధిలో పనులు
పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి, దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గోదావరి పుష్కరాల సమగ్ర ఏర్పాట్ల కోసం రూ. 1000 కోట్లతో వివిధ శాఖల పరిధిలో పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి: మంత్రి శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల పనుల పురోగతిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. వీలుకాని పక్షంలో వర్చువల్ మీటింగ్ ల ద్వారా పనులను సమీక్షించాలని సూచించారు. గోదావరి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక కార్యక్రమంగా భావిస్తున్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.
గోదావరి పుష్కరాల స్పెషల్ ఫండ్స్ వినతులపై సీఎంతో చర్చిస్తానన్న మంత్రి
పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డు ద్వారా సమీక్షించేందుకు వీలుగా, శాఖల వారీగా చేపడుతున్న పనులు, పురోగతి తదితర వివరాలు అందుబాటులో ఉండేలా డ్యాష్‌బోర్డును రూపొందించాలని అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిమిత్తం స్పెషల్ ఫండ్స్ కావాలని పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వినతుల వస్తున్నందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతం సుదీర్ఘంగా వున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించాలని సూచించారు.













Click it and Unblock the Notifications