జగన్ కంచుకోట పై టీడీపీ బ్రహ్మాస్త్రం..!!
రాయలసీమ జిల్లాల్లో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు 2029 ఎన్నికలకు వారి పార్టీ అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి.ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి కడప జిల్లా పై టీడీపీ అధిష్టానం ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రొద్దుటూరు పాలిటిక్స్..!
ఉమ్మడి కడప జిల్లా... రాష్ట్ర రాజకీయలు ఒక ఎత్తు.. కడప జిల్లా పాలిటిక్స్ మరో ఎత్తు అన్నట్లుగా ఉంటాయి. ఎందుకంటే కడప జిల్లా వైయస్ ఫ్యామిలీకి అడ్డాగా ఉందనే విషయం బహిరంగ రహస్యమే. అయితే 2019 ఎన్నికల్లో కడప జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా...2024లో సీన్ రివర్స్ అయ్యింది. మెజార్టీ స్థానాలు కూటమి సాధించింది. ఇక కడప జిల్లా రాజకీయాల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గం చాలా కీలకమైనది. 2019లో వైసీపీ నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయం సాధించగా..2024లో నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. వాస్తవానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి 2024లో టీడీపీ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం మాత్రం వరదరాజుల రెడ్డికే అవకాశం వచ్చింది. అంతకుముందు అంటే వైయస్ ప్రభంజనం ఉన్నప్పుడు టీడీపీ నుంచి లింగారెడ్డి గెలిచారు.

వరద VS ఉక్కు ప్రవీణ్
తాజాగా ప్రొద్దుటూరు నియోజకవర్గం పై టీడీపీ దృష్టి సారించింది. ఇందుకు కారణం అక్కడ స్థానిక టీడీపీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమే అని సమాచారం. వరదరాజుల రెడ్డి వర్గం ఒక వైపుండగా.. ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం మరో వైపుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. దీంతో అధిష్టానానికి కూడా తలనొప్పిగా వ్యవహారం తయారైంది. ఇక ప్రొద్దుటూరులో అన్ని శాఖల్లో అవినీతి కూరుకుపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.ఇక వరదరాజుల రెడ్డి తీసుకునే ప్రతీ నిర్ణయంపై ప్రవీణ్ కుమార్ రెడ్డి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు.ఎస్ఎస్ మాల్ విషయంలో ఇరు వర్గాలు పరస్పర దాడులకు సైతం దిగాయి.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలోనే మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన సందర్భంగా ప్రొద్దుటూరు పొలిటికల్ పంచాయితీపై ఫోకస్ చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేసినవారికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఉంటే పార్టీలో ఉండాలని ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చని గట్టిగా నాయకులకు, క్యాడర్‌కు హెచ్చరించారు. అంతేకాదు వరదరాజుల రెడ్డి తీరు కూడా మార్చుకోవాలని మంత్రి లోకేష్ సున్నితంగా చెప్పినట్లు సమాచారం. ఈ గ్రూప్ వార్‌కు బ్రేక్ వేసేందుకు టీడీపీ అధిష్టానం మరో కొత్త ఫార్ములాతో ముందుకు వస్తున్నట్లు సమాచారం.
లింగారెడ్డి వైపు అధిష్టానం చూపు..?
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఇంటర్నల్ వార్ తారాస్థాయికి చేరడంతో అధిష్టానం కూడా పునరాలోచనలో పడింది. 2029 ఎన్నికలకు మరో అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మృదు స్వభావిగా పేరున్న లింగారెడ్డి 2014 తర్వాత రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. ఈ మధ్యనే తిరిగి నియోజకవర్గంలో గడప గడపను పలకరిస్తూ.. క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. లింగారెడ్డికి అధిష్టానం నుంచి హామీ వచ్చిందనే వార్త ఇప్పుడు ప్రొద్దుటూరులో ప్రచారంలో ఉంది. అందుకే పొలిటికల్‌గా యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. వైయస్ గాలి వీస్తున్న సమయంలో కూడా లింగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత పార్టీలో పలు పదవుల్లో కొనసాగారు.
మొత్తానికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజులరెడ్డికి అధిష్టానం చెక్ పెడుతుందా..ప్రవీణ్ కుమార్ రెడ్డికి మంత్రి లోకేష్ మద్దతు లభిస్తుందా..రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి లింగారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తారా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదు.














Click it and Unblock the Notifications