18 నెలలైనా బిల్లులు రాలేదు! పవన్ పై మండిపడ్డ కడప లీడర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్, కడప జిల్లా మాజీ అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి ఒక ఆసక్తికరమైన బహిరంగ లేఖ రాశారు. గతంలో కడపలో జరిగిన ఉప ముఖ్యమంత్రి అధికారిక పర్యటనకు సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు విడుదల కాకపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం ఒక కూటమి పార్టీ కార్యకర్త తన సొంత డబ్బులు ఖర్చు చేస్తే, దానికి సంబంధించిన నిధులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
లేఖలోని వివరాల ప్రకారం.. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో నిర్వహించిన 'పేరెంట్-టీచర్ మీటింగ్' (Parent-Teacher Meeting) కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పర్యటనకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ చిట్టా శివారెడ్డి తన సొంత నిధులతో పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ పర్యటన ఏర్పాట్ల వ్యయాల చెల్లింపుల కోసం ఆర్‌అండ్‌బీ (R&B) శాఖ ద్వారా సంబంధిత అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయినప్పటికీ, దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా నేటికీ ఆ బిల్లులు విడుదల కాకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది అని ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు?
"పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల కోసం కార్యకర్తలు ముందుకొచ్చి తమ సమయాన్ని, శ్రమను, ఆర్థిక వనరులను వెచ్చిస్తున్నారు. అలాంటి వారికి సకాలంలో న్యాయం జరగకపోతే, రేపు ఏ నమ్మకంతో కార్యకర్తలను ముందుకు రావాలని చెప్పగలం?" అని శ్రీనివాస రెడ్డి లేఖలో పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన సొంత డబ్బులను తిరిగి పొందడానికి, ఒక బాధ్యతాయుతమైన పార్టీ కార్యకర్త ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి
ఈ పెండింగ్ బిల్లుల సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చలనం లేదని లేఖలో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సదరు కార్యకర్త (చిట్టా శివారెడ్డి) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని శ్రీనివాస రెడ్డి వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి తోడ్పడిన వ్యక్తికి ఇదేనా దక్కాల్సిన గౌరవం అనే ప్రశ్న క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోందని, కాబట్టి ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదలయ్యేలా చూడాలని ఆయన కోరారు.













Click it and Unblock the Notifications