IPL 2026 Final: సిరాజ్ vs వెంకటేష్ అయ్యర్ డిష్యూం.. డిష్యూం!
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జట్ల మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత పోరులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులకే పరిమితమైంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో గుజరాత్ బౌలర్లు బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆర్సీబీ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ మధ్య మైదానంలో తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ సిరాజ్ మొదటి ఓవర్ వేయగా.. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ క్రీజులోకి వచ్చారు. ఆ ఓవర్‌లో సిరాజ్ వేసిన ఓ అద్భుతమైన డెలివరీ వెంకటేష్ అయ్యర్ డిఫెన్స్‌ను దాటుకుంటూ వికెట్ల పైనుంచి వెళ్ళింది. దాంతో వెంకటేష్ అయ్యర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ వెంటనే సిరాజ్ బ్యాటర్‌కు దగ్గరగా వెళ్లి మైండ్ గేమ్ ఆడటం ప్రారంభించాడు. "నీకు అంతగా అటాక్ చేయాలని ఉంటే.. ధైర్యముంటే వచ్చే బంతిని కొట్టి చూపించు" అంటూ వెంకటేష్ అయ్యర్‌ను కవ్వించాడు. దీనికి వెంకటేష్ అయ్యర్ కూడా అంతే ఘాటుగా సమాధానమిస్తూ.. "నువ్వు వెళ్లి నీ రనప్ చూసుకుని బౌలింగ్ చెయ్, ఆ బంతిని ఎలా కొట్టాలో నేను చూపిస్తా" అని కౌంటర్ ఇచ్చాడు.

ఈ సవాల్‌తో మరింత ఆగ్రహానికి గురైన మహ్మద్ సిరాజ్ తర్వాతి బంతిని అంతే వేగంతో, దూకుడుతో వెంకటేష్ అయ్యర్ శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌన్స్ చేశాడు. ఆ బంతి అయ్యర్ శరీరానికి బలంగా తాకడంతో వెంకటేష్ అయ్యర్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి అయ్యర్‌ను పరీక్షించాల్సి వచ్చింది. ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన సిరాజ్.. గుజరాత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్ ఆరంభంలో కాస్త తడబడినా, ఆ తర్వాత పుంజుకున్న సిరాజ్ ఫైనల్ మ్యాచ్‌కు ముందే 17 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
అయితే ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో చివరకు సిరాజ్‌దే పైచేయి అయింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన సిరాజ్.. అప్పటికే క్రీజులో సెట్ అయి ప్రమాదకరంగా మారుతున్న వెంకటేష్ అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సిరాజ్ గట్టిగా అరుస్తూ తనదైన శైలిలో వికెట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఔట్ కావడానికి ముందు వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేట్‌తో మెరుపు వేగంతో 32 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ ఔటయ్యే సమయానికి బెంగళూరు 4.3 ఓవర్లలో 62 పరుగులు చేసింది. ఒక వికెట్ పడినప్పటికీ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ ఈ లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ గెలవడానికి పటిష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications