రేపు తొలిదశ పోలింగ్.. యువతరం ఎటువైపు.. రాహుల్ ప్రచారం గట్టెక్కిస్తుందా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: దేశ భవితవ్యానికి.. ప్రత్యేకించి ప్రధాని మోదీ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం తొలిదశ పోలింగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై గుజరాతీల్లో క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నాలుగు నెలలుగా సాగుతున్న ప్రచారం.. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వస్తున్న మార్పులపై నిర్వహించిన వివిధ సంస్థల సర్వేలే చెప్తున్నాయి. 22 ఏళ్లుగా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ముగ్గురు యువ నేతల మద్దతుతో రోజురోజుకూ బలం కూడదీసుకుంటోంది. తాను చేయబోయే పనులపై, పథకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటిస్తే, అధికార బీజేపీ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది.
బీజేపీ పరిస్థితి ఒకింత మందగించడానికి కారణాలు అనేకం. రెండు దశాబ్దాల పాలన, ఎన్నో ఏళ్లుగా వెన్నంటి ఉన్న పాటిదార్లు కోటా డిమాండ్‌తో దూరం కావడం, దళితులు, కొన్ని బీసీ సంఘాల్లో అసంతృప్తి, బీజేపీ ఆరో వరుస గెలుపును అడ్డుకుంటాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దేశానికి రెండో ప్రధానిని దేశానికి అందించిన గుజరాత్‌లో మార్పు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

65 జనాభా యువతే.. వారే కీలకం

65 జనాభా యువతే.. వారే కీలకం

వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నివసించే పారిశ్రామిక నగరం సూరత్‌ బీజేపీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ కూడా అనేక చిన్న పరిశ్రమలు ఇటీవల మూతబడడంతో శ్రామికవర్గంతో పాటు ఫ్యాక్టరీ యజమానుల్లో కూడా అధికార బీజేపీపై అసంతృప్తి వ్యక్తమౌతోంది. 22 ఏళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర జనాభాలో చాలా మార్పులొచ్చాయి. ప్రస్తుత జనాభాలో 65 శాతం యువతే కావడం ఆసక్తికర పరిణామం. 14 శాతం మంది పాటిదార్లతోపాటు ఐదుశాతం క్షత్రియులు, బ్రాహ్మణ - వైశ్యులు రెండు శాతం మంది చొప్పున ఉన్నారు. తొలిసారిగా ప్రస్తావనే రాని ముస్లింలు 10 శాతం మంది, 15 శాతం మంది గిరిజనులు కూడా ఈ దఫా ఎన్నికల్లో కీలకం కానున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ గానీ, అటు ముస్లింలు గానీ మైనారిటీ కార్డు పేరుతో అధికార బీజేపీ దాడి చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

జై సర్దార్ జై పటేల్ అంటూ రాహుల్ ఇలా ప్రచారం

జై సర్దార్ జై పటేల్ అంటూ రాహుల్ ఇలా ప్రచారం

కాంగ్రెస్ పార్టీకి కీలక సామాజిక వర్గాల నేతలు మద్దతుగా నిలవడంతో అధికార బీజేపీ.. ప్రత్యేకించి ప్రధాని మోదీ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నదమ్ముళ్ల మధ్య ‘హస్తం' పార్టీ విభజన రేఖలు గీస్తున్నదని ప్రచారం సాగించారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో ‘జై సర్దార్', ‘జై పటేల్' నినాదాలతో విస్త్రుత పర్యటనలు సాగిస్తూ.. అడుగడుగునా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ.. పాటిదార్లు, వ్యాపార వర్గాలు, ఇతర సామాజిక వర్గాల మనస్సు చూరగొంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేశారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజల ద్వారా హిందుత్వ పట్ల రాహుల్ సానుకూల ధోరణి కమలనాథుల అవకాశాలను తటస్థీకరించిందన్న అభిప్రాయం గుజరాతీల్లో ప్రబలంగా వినిపిస్తున్నది.

పండిట్ నెహ్రూపై ఇలా మోదీ విమర్శలు

పండిట్ నెహ్రూపై ఇలా మోదీ విమర్శలు

అవకాశం చిక్కిన ప్రతిసారీ రాహుల్ గాంధీపై వ్యక్తిగత ప్రచారానికి బీజేపీ నేతలు వెనుకాడలేదు. ప్రతిష్ఠాత్మక సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆయన విశ్వాసాలు లక్ష్యంగా ఒకవైపు.. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అసలు ఆ దేవాలయం తెరవడానికి అంగీకరించలేదనే విమర్శలు సాగించారు. నవ్య భారతావని నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన పండిట్ నెహ్రూను.. ఆయనతోపాటు భుజంభుజం కలిపి పని చేసిన తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్‌ను విడదీయడంతోపాటు తమ ఖాతాలో కలుపుకునేందుకు కమలనాథులు విఫల యత్నం చేశారు. 2014 లోక్ సభ ఎన్నికల ప్రచారం నుంచి ఈ ధోరణి ఎక్కువగా వినిపిస్తున్నారనుకోండి.

రాహుల్ శివభక్తుడని ఇలా ప్రధాని

రాహుల్ శివభక్తుడని ఇలా ప్రధాని

ఆఖరికి ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ.. 1979లో విపక్ష నేతగా ఉన్నప్పుడు మోర్బీ వరద ప్రాంతాలను సందర్శించినప్పుడు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకున్న సంగతినీ ప్రధాని మోదీ రాజకీయం చేశారు. ఆయనతోపాటు అక్కడే సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొన్న ఆరెస్సెస్ కార్యకర్తలు కూడా తమ ముఖాలకు మాస్కులు ధరించిన సంగతి ‘ఇండియా టుడే' ప్రచురించిన ప్రత్యేక కథనంలో బయట పడింది. గురువారం ఢిల్లీలో అంబేద్కర్ అధ్యయన కేంద్రాల ప్రారంభిస్తూ ప్రధాని మోదీ.. బాబా సాహెబ్‌ను విస్మరించి కొందరు శివ భక్తుడినని ప్రచారం చేసుకుంటున్నారని పరోక్షంగా రాహుల్‌పై విమర్శలు సాగించారు.

ప్రచారానికి దూరంగా ఉండాలని కపిల్ సిబల్‌ను కోరిన కాంగ్రెస్

ప్రచారానికి దూరంగా ఉండాలని కపిల్ సిబల్‌ను కోరిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ గాంధీని ‘ఔరంగజేబు' అని కూడా అభివర్ణించారు. అనూహ్యంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘అయోధ్య' వివాదాన్ని కూడా బీజేపీ ప్రచారంలోకి తెచ్చింది. 2019 ఎన్నికల వరకు అయోధ్య వివాదంపై విచారణ నిలిపేయాలని సుప్రీంకోర్టులో సున్నీబోర్డు తరఫు న్యాయవాది - కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ చేసిన వాదనను వివాదం చేసి.. ‘రామ మందిరాన్ని' వివాదం చేస్తారా? దీనిపై ఇటీవల ఆలయాలను సందర్శిస్తున్న రాహుల్ సమాధానాలు చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నలు సంధిస్తే.. కమలనాథులు సోషల్ మీడియాలో యాంటీ ప్రచారం చేపట్టారు. దీంతో గుజరాత్ అసెంబ్లీ ప్రచారానికి దూరంగా ఉండాలని కపిల్ సిబాల్‌ను కాంగ్రెస్ కోరింది.

మణిశంకర్ అయ్యర్ పై సస్పెన్షన్ వేటేసిన కాంగ్రెస్

మణిశంకర్ అయ్యర్ పై సస్పెన్షన్ వేటేసిన కాంగ్రెస్

తొలిదశ ఎన్నికల ప్రచారానికి ముగింపు దశలో ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన ‘నీచ వ్యక్తి' ఒకింత అభ్యంతరకరమే. గతంలోనూ 2014 ఎన్నికల ముందు ‘చాయ్ వాలా' దేశ ప్రధాని అవుతారా? అని చేసిన వ్యాఖ్య ఆధారంగా చర్చాగోష్టులు నిర్వహించిన నేపథ్యం కమలనాథులది. అంతకుముందు 2007లో అప్పటి గుజరాత్ సీఎంగా ప్రస్తుత ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ‘మ్రుత్యు బేహారి' అని సంబోధించడాన్ని వేదికగా చేసుకుని బీజేపీ అసాంతం ఎన్నికల ప్రచారం సాగించి విజయం సాధించింది. మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యలు గుజరాతీలను అవమానించడమేనన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. మణి శంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ సాధారణ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయడం ఆ కోవలోకే వస్తుంది.

బీజేపీ సెటైర్లకు దీటుగా రాహుల్ జవాబు

బీజేపీ సెటైర్లకు దీటుగా రాహుల్ జవాబు

రోజుకో ప్రశ్న పేరిట ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లెక్కల్లో తప్పులు చెప్పడాన్ని సోషల్ మీడియాలో బీజేపీ పేతలు ప్రశ్నించారు. దీనిపై తాను ప్రధాని మోదీని కాదని, మనిషినని, తప్పులు చేస్తానని అంగీకరిస్తూనే తన తప్పులు ఎత్తి చూపి సరిదిద్దాలని కమలనాథులకు సూచనలు చేశారు. ఇక వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం పెంపొందించేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సూరత్, రాజ్ కోట్ ప్రాంతాల్లో సభలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది.

నిరుద్యోగ సమస్యపై ఇలా అల్పేశ్ పోరు

నిరుద్యోగ సమస్యపై ఇలా అల్పేశ్ పోరు

ఇక 2015 నుంచి రాష్ట్రంలో సాగిన పాటిదార్ల రిజర్వేషన్ల ఆందోళన, దళితులపై గోరక్షక దళాల దాడులకు వ్యతిరేకంగా హక్కుల పరిరక్షణ పోరాటం.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ సారథ్యంలో ఉద్యమాలు జరిగాయి. దీనికి తోడు గతేడాది నవంబర్ నెలలో నోట్ల రద్దుతో అస్తవ్యస్థ పరిస్థితుల మధ్య ఈ ఏడాది ఆదరాబాదరాగా అమలులోకి తెచ్చిన జీఎస్టీతో వ్యాపార వర్గాలు కుదేలయ్యాయయని విశ్లేషకులు చెప్తున్నారు. పాటిదార్ల ఉద్యమ నేతగా తెరపైకి వచ్చిన హార్దిక్‌ పటేల్‌, ఓబీసీ నాయకునిగా ఎదిగిన అల్పేశ్‌ ఠాకూర్‌, దళితుల గొంతుకగా ప్రాచుర్యం పొందిన జిగ్నేశ్‌ మేవానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.

కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ యంగ్ టర్కులపైనే..

కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ యంగ్ టర్కులపైనే..

ఈ ముగ్గురు ‘యంగ్ టర్కు'లకు గల ప్రజాదరణను పూర్తి స్థాయిలో ఓట్ల రూపంలోకి మలచటంలో ఎంత వరకూ సఫలం కాగలరనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ముగ్గురూ 40 ఏళ్ల వయస్సు లోపువారే. బీజేపీని ఓడించాలన్న వీరి పిలుపును ఆయా సామాజిక వర్గాల (పాటీదార్లు - 14 శాతం, ఓబీసీలు - 42 శాతం, దళితులు - 9 శాతం) ఓటర్లందరూ అనుసరిస్తే కాంగ్రెస్‌కు 65శాతం ఓట్లు ఖాయం. కానీ, తమ సామాజిక వర్గం ఓటర్లపై వీరు ప్రభావం చూపుతారా? లేదా? యువతను మాత్రమే వారు ప్రభావితం చేయగలరా? అన్న సంగతి ఈ నెల 18వ తేదీన తేలనున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కమలం వైపే పాతతరం పాటిదార్ల చూపు

కమలం వైపే పాతతరం పాటిదార్ల చూపు

ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్‌కు పాటీదార్లలో గల పలుకుబడిని తగ్గించేందుకు బీజేపీ చేసిన యత్నాలు అంతగా పలించలేదు. 25 ఏళ్ల వయస్సులోపు పాటీదార్లు హార్దిక్‌పై వచ్చిన ఆరోపణలను గానీ, కాంగ్రెస్‌తో చేతులు కలపటాన్ని గానీ పట్టించుకోవటంలేదు. ఎందుకంటే ‘హార్దిక్‌ వయస్సు ఉన్న యువత అంతా గత 22 ఏళ్లుగా బీజేపీ పాలననే చూస్తున్నారు. క్షత్రియులు ప్రాబల్యమున్న కాంగ్రెస్‌ తమ పట్ల వివక్ష చూపుతుందన్న బీజేపీ నేతల విమర్శలు వారిపై ప్రభావం చూపటంలేదు'' అని సామాజిక వేత్త కంతిభాయ్‌ పటేల్‌ విశ్లేషించారు. రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్‌ హామీ యువ పాటీదార్లను ఆకట్టుకున్నా పాత తరం పాటిదార్లలో ఆ విశ్వాసం కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

రంగంలోకి పురుషోత్తం సోలంకి ఇలా

రంగంలోకి పురుషోత్తం సోలంకి ఇలా

నిరుద్యోగ సమస్యపై గళమెత్తిన అల్పేశ్‌ ఠాకూర్‌కు ఓబీసీల్లో మంచి ఆదరణే లభించింది. అగ్రవర్ణ క్షత్రియుల పంట భూములను సాగు చేసే ఠాకూర్లకు వారితో దశాబ్దాల తరబడి సత్సంబంధాలే ఉన్నాయి. అందువల్ల క్షత్రియుల ప్రాబల్య కాంగ్రెస్‌ పట్ల అల్పేశ్‌ తెరపైకి రాకుముందు నుంచే ఠాకూర్లకు సానుకూలత ఉంది. ఠాకూరేతర ఓబీసీల్లో అల్పేశ్‌ ఠాకూర్ పలుకుబడి పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు కోలీ సామాజిక వర్గ నేత పురుషోత్తమ్‌ సోలంకిని బీజేపీ రంగంలోకి దించినా ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండటం గమనార్హం.. పాటీదార్ల ఆధిక్యం ఉన్న వస్త్ర, సెరామిక్‌, వజ్రాలు సానపెట్టే పరిశ్రమలతో కోలీలకు అనుబంధం ఉంది. 42 శాతం మంది ఓబీసీల్లో కోలీలు 18 శాతం, ఠాకూర్లు 10 శాతం, ఇతరులు 14 శాతం మంది జనాభా ఉన్నారు. సాధారణంగానే కోలీ, ఠాకూర్‌ వర్గాల మధ్య అంతగా పొసగదన్న విమర్శలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జిగ్నేశ్ మేవానీతో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం

జిగ్నేశ్ మేవానీతో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం

దళిత నేతగా తెరపైకి వచ్చిన జిగ్నేశ్‌ వల్ల కాంగ్రెస్‌కు అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు దళితులు ఎప్పటి నుంచో ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఉనా సంఘటన వల్ల బీజేపీ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ దళితుల ఓట్లపై ఆశలు వదులుకోలేదు. రాష్ట్ర జనాభాలో దళితులు తొమ్మిది శాతంగా ఉన్నారు. సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించే దళితులకు ఉచిత ఆహారం, వసతిని కల్పిస్తున్న సంత్‌ సవ్‌గుణ్‌ సమాధిస్థాన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ దళిత నేత శంభు తుండియాను రాజ్యసభకు పంపటం ద్వారా సానుకూల వాతావరణాన్ని బీజేపీ సృష్టించుకునే యత్నం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Various opinion polls conducted by different TV channels have projected BJP's win in Gujarat elections. However, these polls also say that Congress won't go down without a fight as India's oldest party will give the saffron party some solid competition, in the process, eating into its vote share in the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి