గ్యాస్ సిలిండర్ల ధర భారీగా పెంపు- కనివినీ ఎరుగని రేట్లు
ఊహించిందే జరిగింది. వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వీటి రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని ఇప్పుడు కూడా కొనసాగించాయి.
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా 42 రూపాయలు పెరిగింది. దీంతో ఒక్కో సిలిండర్ ధర అమాంతం రూ.3113.50 పైసలకు చేరింది. కోల్‌కతాలో రూ.53.50 పైసల మేర పెరిగింది. అక్కడ సిలిండర్ ధర రూ.3255.50కి చేరింది. కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర ఈ స్థాయిలో ఉంటుందని బహుశా ఎవరూ ఊహించివుండరు. ఇదే కాకుండా అయిదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల రేటు కూడా మారింది. ఒక్కో సిలిండర్ పై 11 రూపాయలు పెరిగింది. గృహావసర సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు.

ఇరాన్ పై యుద్ధం మొదలు కావడానికి ముందు నుంచే వీటి రేట్లు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. జనవరిలో రూ.1691.50గా ఉన్న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు ఎకాఎకిన రూ.3113.50కి చేరింది. ఈ ఆరు నెలల కాలంలో వీటి రేట్లు పెరగడం వరుసగా ఇది ఆరో నెల. అంటే ప్రతి నెలా కూడా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 1వ తేదీన 993 రూపాయలు పెంచిన దెబ్బకు ఒక్కో సిలిండర్ ధర రూ. 3,000 రూపాయలు దాటేసింది. ఇప్పుడు రూ. 3,255 రూపాయలకు చేరింది.
తాజాగా మరో 42 రూపాయల మేర అదనపు భారం వినియోగదారులపై పడింది. ముఖ్యంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న హోటళ్లకు తాజా ధరల పెరుగుదల మరింత భారం మోపినట్టయింది. ఈ పెంపుతో హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ రేట్ల ముఖ చిత్రమే సమూలంగా మారిపోయింది.
గృహ వినియోగం కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రేట్లు ప్రస్తుతానికి యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ జారీ చేసిన రేట్ల ప్రకారం.. ఢిల్లీ- రూ. 913, కోల్‌కతా- రూ. 939, ముంబై- రూ. 912.50, చెన్నై- రూ. 928.50, హైదరాబాద్- రూ. 965, లక్నో- రూ. 950.50, పాట్నా- రూ. 1,002.50, బెంగళూరు- రూ. 915.50 పైసలుగా ఉంటోన్నాయి.












Click it and Unblock the Notifications