గుజరాత్ టైటాన్స్ జట్టుకు తప్పిన పెను ప్రమాదం
ఐపీఎల్ ఫైనల్‌లో ఓటమి పాలైన గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్‌కు తిరిగి వస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్లేయర్లు ప్రయాణిస్తోన్న బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని ముందుగానే గమనించడంతో సరిపోయింది.
బస్సులో ఉన్న మొత్తం ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్, బస్సు సిబ్బందిని సురక్షితంగా కిందికి దించారు. ఎవరికీ గాయాలుు గానీ, ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో ప్లేయర్లు ప్రత్యామ్నాయ రవాణా వసతి ఏర్పాటు చేసేంత వరకు దాదాపు గంట పాటు రోడ్డు మీదే ఉండిపోవాల్సి వచ్చింది. ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన తరువాత ఈ ఘటన సంభవించింది.

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ అనంతరం జట్టు ఆటగాళ్లు తాము బస చేసిన హోటల్ కు బస్సులో వెళ్తున్నప్పుడు మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యుట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత బస్సు డ్యాష్ బోర్డు నుంచి పొగ వెలువడింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. డ్రైవర్ ముందుగానే దీన్ని గుర్తించడంతో బస్సులో ఉన్న వారందరినీ కిందికి దించారు.
ఒక ఫైనల్స్ లో ఓడిపోయామనే నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇదొక చేదు అనుభవంగా మారింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కఠిన ప్రయాణ షెడ్యూల్‌ను ఎదుర్కొంది. మే 30న అహ్మదాబాద్‌కు బయలుదేరాల్సిన సమయంలో ముల్లాన్‌పూర్‌లో ప్రతికూల వాతావరణం వల్ల జాప్యం ఏర్పడింది. దీంతో గుజరాత్ టైటాన్స్ శనివారం సాయంత్రం ఆలస్యంగా అహ్మదాబాద్ కు చేరుకుంది.
ఇదే విషయాన్ని గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి సైతం ప్రస్తావించారు. మ్యాచ్ అనంతర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ వ్యవధిలో అధిక మ్యాచ్‌లు ఆడామని, జట్టు అలసిపోయిందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications