చెడుపై విజయమే విజయదశమి: వెంకయ్య, కేసీఆర్, జగన్ విషెష్
విజయ దశమి పర్వదినం సందర్భంగా ప్రముఖులు విష్ చేస్తున్నారు. అందరికీ విజయాలు చేకూర్చాలని శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయమే.. దసరా అని గుర్తుచేశారు. విజయదశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారని అన్నారు. అంతేకాకుండా మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి ఆదర్శవంతమైన జీవనాన్ని మనకు గుర్తుచేస్తుంది. వారు పాటించి చూపిన సన్మార్గంలో మనం కూడా పయనించేందుకు మార్గదర్శనం చేస్తుంది. మనలోని చెడు ఆలోచనలను వదులుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేందుకు దసరా అందరి జీవితాల్లో శాంతి, సమరస్యం, సమృద్ధి తీసుకురావాలని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ శుభాకాంక్షలు
ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుక అని ఆయన చెప్పారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా ఇచ్చే స్ఫూర్తి అని వివరించారు. చెడుపై మంచి విజయానికి సంకేతమే విజయదశమి అని పేర్కొన్నారు. ఈ దసరా సందర్భంగా అందరికీ ఆరోగ్యం, సిరిసంపదలు కలగాలని ఆయన ఆ భగవంతుడిని ప్రార్థించారు.

జగన్ శుభాకాంక్షలు
ప్రజలందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయమే.. విజయ దశమి అని వివరించారు. అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.
Recommended Video

దసరా అంటే..?
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు నిర్వహిస్తారు. పదో రోజు విజయ దశమిని దసరా అని పిలుస్తారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు విజయదశమి.. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేస్తారు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.












Click it and Unblock the Notifications