బీజేపీకి భారీ షాక్: కాంగ్రెస్‌లో చేరిన పార్టీ ఉపాధ్యక్షుడు
ఛండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు జీఎల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 250 మంది నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. జీఎల్ వర్మ తమ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ నేతలు స్వాగతించారు.
హర్యానా డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పనిచేసిన శర్మ తమ పార్టీలో చేరడంపై మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటేనని చెప్పారు.

కాంగ్రెస్ ఒక్కటే ఉపాధి కల్పన, అభివృద్ధి, క్రీడలు, పెట్టుబడులు తదితర అంశాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని భూపిందర్ సింగ్ హుడా పేర్కొన్నారు. జీఎల్ శర్మతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో ప్రముఖంగా గురుగ్రామ్ జిల్లా బీజేపీ కార్యదర్శి మహేశ్ వశిష్ట్, రోహ్‌తక్ లోక్‌సభ ఐటీ సెల్ హెడ్ ప్రవీణ్ ముద్గిల్, బేనీ ప్రసాద్ గౌర్(లీగల్ సెల్), ప్రజాపతి సమాజ్ గురుగ్రామ్ ప్రెసిడెంట్ బస్తీరాం తదితరులు ఉన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. 31 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు. ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను జులానా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫోగట్‌తో పాటు బజరంగ్ పునియా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగింది. బద్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చని చర్చ సాగింది. కానీ, ఇప్పుడు విడుదల చేసిన జాబితాతో బజరంగ్ పేరు లేకపోవడం గమనార్హం. అలానే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా ఘర్హి అస్లెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది.
సురేందర్ పన్వార్‌కు సోనిపట్ నుంచి, జగ్‌బీర్ సింగ్ మాలిక్‌కు గోహనా నుంచి, భరత్ భూషణ్ బత్రాకు రోహ్‌తక్ నుంచి టికెట్ ఇచ్చారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ హోడల్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లాడ్వాలో కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్.. హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నేత నయాబ్ సైనీతో తలపడనున్నారు.












Click it and Unblock the Notifications