లాక్‌డౌన్ విధించిన మరో రాష్ట్రం: వారంపాటు అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్
ఛండీగఢ్: కరోనా కేసులు రోజుకు మరింతగా పెరుగుతున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వారం రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. మే 3 నుంచి వారం రోజులపాటు హర్యానాలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.
అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ ఉంటాయని స్పష్టం చేశారు. శనివారం హర్యానా రాష్ట్రంలో కొత్తగా 13,588 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 125 మంది రోగులు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,01,566కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,341 చేరింది.

కాగా, ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వీకెండ్ లాక్‌డౌన్ విధించింది. గుర్గావ్, ఫరీదాబాద్, పంచకుల, సోనిపత్, రోహ్తక్, కర్నల్, హిసర్, సిర్సా, ఫతేబాద్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఈ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. అంతేగాక, రాష్ట్రంలో ఎవరైనా కరోనా మందులను గానీ, మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను గానీ బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కర్ణాటక, ఒడిశా తర్వాత హర్యానాలోనూ లాక్‌డౌన్ విధించారు.
మరోవైపు దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,92,488 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,689 మంది మరణించారు. 3,07,865 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,95,57,457కు చేరింది. ఇందులో 1,59,92,271 మంది కోలుకున్నారు.
కరోనా మృతుల సంఖ్య 2,15,542 వేలుగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 33,49,644కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో మూడు లక్షలకు పైగా పేషెంట్లు కోలుకోవడం రికార్డు. ఈ స్థాయిలో రికవరీలు ఇదివరకెప్పుడూ నమోదు కాలేదు. కరోనా కల్లోలం రేపుతోన్న ఈ పరిస్థితుల్లో మూడు లక్షలకు పైగా రికవరీ సంఖ్య ఉండటం భారీ ఊరట కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications