Hathras Tragedy: భారత్‌లో తొక్కిసలాటలు ఎక్కడెక్కడ జరిగాయి,ఎందరు మృతి చెందారు..?
Hathras Tragedy:హాథ్రస్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మతపరమైన సమావేశంలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా 100కు పైగా భక్తులు మృతిచెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారణం జరిగింది.భోలే బాబా ఇచ్చిన పిలుపు మేరకు అక్కడకు చేరిన జనం తొక్కిసలాట జరగడంతో కొందరు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు చికిత్స పొందుతూ మరణించారు. మతపరమైన సమావేశాల్లో జరిగిన తొక్కిసలాటలో ఎక్కడెక్కడ ఎందరు మరణించారో ఒకసారి చరిత్రను తిరగేద్దాం.
జనవరి 2005
మహారాష్ట్రలోని వాయి పట్టణంలో ఉన్న మంధారదేవీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 265 మందికి పైగా భక్తులు మృతి చెందగా.. వందలాది మంది గాయపడ్డారు. ఆలయానికి వెళ్లే మెట్ల మార్గం జారుతుండటంతో భక్తులు జారి కింద పడ్డారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో భారీ సంఖ్యలో భక్తులు మృతి చెందారు.

ఆగష్టు 2008:
హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 145 మంది భక్తులు మృతి చెందారు. కొండ చరియలు విరిగిపడుతున్నాయన్న వార్త గుప్పుమనడంతో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో అంతా పరుగులు తీశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందారు.
సెప్టెంబర్ 2008:
రాజస్థాన్ రాష్ట్రం లోని చాముందగర్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.దుర్గా దేవిని పూజించేందుకు అక్కడికి చేరుకున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు.
మార్చి 2010:
ఉత్తర్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. తినేందుకు తిండి కూడా దొరకని సందర్భం అది. ఆ సమయంలో ఓ ఆలయంలో ఆహారం, బట్టలు ఇస్తున్నారన్న విషయం తెలిసి వరద బాధితులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అధికంగా చిన్నారులు ఉండటం దేశాన్ని కలచివేసింది.
ఫిబ్రవరి 2013:
2013లో ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన కుంభమేళా ఘోర విషాదాన్ని నింపింది. కుంభమేళాకు 10 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతి చెందారు. ఇందులో 27 మంది మహిళలతో పాటు ఎనిమిదేళ్ల బాలిక మృత్యువాత పడింది.
నవంబర్ 2013:
మధ్యప్రదేశ్‌లోని రత్నగఢ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 115 మంది భక్తులు మృతి చెందారు.100కు పైగా గాయపడ్డారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు దాదాపుగా 1,50,000 మంది భక్తులు హాజరయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ తొక్కిసలాట జరగడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
జనవరి 2022:
జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు.ఆలయ ద్వారం చిన్నగా ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.
జూలై 2015
గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కోటగుమ్మ పుష్కర్‌ఘాట్ వద్దకు పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నారు.












Click it and Unblock the Notifications