క్యూఆర్ కోడ్ గిఫ్ట్ కూపన్లు, ఓటుకు రూ 10 వేలు, మాజీ సీఎం ఫైర్, ఎన్నికలు, పోలింగ్ ఎందుకు?
తాను పిరికివాడిని కాను అంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఘాటుగా స్పందించారు. క్యూఆర్ కోడ్ గిఫ్ట్ కూపన్, ఓటర్లకు డబ్బు పంపిణీ చెయ్యలేదని తాను పిరికివాడిని ఎలా అవుతానని మాజీ సీఎం కుమారస్వామి డీకే బ్రదర్స్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తాను నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మీలాగా ఓటుకు నోటు అంటూ డబ్బులు పంచలేదని కుమారస్వామి ఆరోపించారు.
నేను పిరికివాడిని కాదు, వాళ్లు పిరికివాళ్లు, కుతంత్ర రాజకీయ నాయకులు. నేరుగా ఎన్నికలను ఎదుర్కోలేని డీకే శివకుమార్ సోదరులు ఓటర్లకు గిఫ్ట్ కూపన్లు పంచిపెడుతున్నారని, ఓటుకు కొన్ని ప్రాంతాల్లో రూ 10 వేలు కూడా ఇస్తున్నారని, ఇదే విషయంపై ఎన్నికల కమిషన్‌కు తాము ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. దీనిపై గతంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

ఇప్పటికే డీకే బ్రదర్స్ ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇప్పుడు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటూ మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నికలు నిర్వహించకుండా నేరుగా ఉచితంగా కానుకలు, డబ్బు పంపిణీ చేసే విధానాన్ని తీసుకురావాలి. వారి బలాన్ని బట్టి డబ్బులు పంచి ఓట్లు పొందే విధానాన్ని అమలు చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ తరహా వ్యవస్థ వస్తే కాంగ్రెస్‌కు మాత్రమే మంచి జరుగుతుందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి దుయ్యబట్టారు.
దీనిని ఎన్నికలు అని పిలవాలా? దీనిని ఎన్నికలగా పరిగణించవచ్చా? దీన్ని ప్రజాస్వామ్య పండుగ అంటారా ? ఇది ధనవంతులకు, దోపిడీదారులకు పండుగ, జనాలకు కాదు. ఎన్నికల సంఘం మారాలని, ఎన్నికల కమిషన్ వ్యవస్థను మార్చడమే మంచిదని మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. భారతదేశంలో కాంగ్రెస్ హయాంలో మనం సంపాదించిన ప్రతిదానిపై 90% పన్ను చెల్లించామని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.
ఓ జ్యోతిష్యుడు చెప్పినట్లు కనకపురలోని ఓటర్లకు గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేశారని కుమారస్వామి ఆరోపించారు. ఒక్కో ఓటర్ కు రూ. 505 డబ్బులు, మలేమహదేశ్వర దేవాలయం లడ్డూ, గ్యారంటీ కార్డులు, క్యూఆర్ కోడ్ ఉన్న గిఫ్ట్ కూపన్లు రాత్రంతా పంపిణీ చేశారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. కార్డులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ, జేడీఎస్ పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం లేదని, ఓటమి భయంతోనే డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ కుటిల రాజకీయాలు చేస్తున్నారని కర్జాటక మాజీ సీఎం, మండ్య లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థి హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.












Click it and Unblock the Notifications