health tips: ఈ 9లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఉన్నా డయాబెటిస్ ఉన్నట్టే... గుర్తించండిలా!!
ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సగానికి ఎక్కువమంది ప్రజలు అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. 2019 అంచనాల ప్రకారం భారతదేశంలో 77 మిలియన్ల మందికి డయాబెటిస్ ఉంది. ఇక ఇది 2045 నాటికి 134 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది.

సరైన జీవన విధానం లేకపోవడం వల్లనే డయాబెటిస్
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో డయాబెటిస్ రావడం సరైన జీవన విధానం లేకపోవడం వల్ల సంభవిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారం, ప్రవర్తన అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని భుజించడం వంటి అనేక కారణాల వల్ల డయాబెటిస్ సంభవిస్తుంది. ఇక డయాబెటిస్ వచ్చిన వారు చాలా వరకు తమకు కలిగిన అనారోగ్యాన్ని గుర్తించలేకపోతున్నారు. తొలిదశలోనే డయాబెటిస్ ని గుర్తిస్తే అనేక అనారోగ్య సమస్యల నుండి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

డయాబెటిస్ ఉంటే కనిపించే లక్షణాలివే
ముఖ్యంగా డయాబెటిస్ ను గుర్తించడానికి మనుషులలో 9 ప్రధానమైన లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. డయాబెటిస్ బారిన పడినవారు సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తారని, తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నట్లయితే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు డయాబెటిస్ ఉన్న వారిలో అధికంగా దాహంగా ఉంటుందని, తరచు ఏదో ఒకటి తాగాలనే ఆలోచన వస్తుందని చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారిలో ఆకలి కూడా ఎక్కువ అవుతుందని, తరచు ఏదో ఒకటి తినాలి అన్న ఆకలి భావనను వారు కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

అలసట, ఆకస్మికంగా బరువు కోల్పోవటం, చర్మం దురద ఉంటే మధుమేహమే
చిన్న పని చేసిన డయాబెటిస్ బాధితులు అలసిపోతారని, అలసట డయాబెటిస్ ఉన్న వారిలో ఒక ముఖ్య లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. ఇక ఆకస్మికంగా బరువును కోల్పోవడం కూడా డయాబెటిస్ లక్షణాలలో ఒకటి అని వైద్యులు సూచిస్తున్నారు. ఆకస్మికంగా ఎక్కువగా శరీర బరువును కోల్పోతే కచ్చితంగా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో డయాబెటిస్ ఉన్నవారికి చర్మం ఎక్కువగా దురదగా ఉంటుందని, పదేపదే చర్మం దురద గా అనిపిస్తే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

గాయం మానదు, దృష్టి లోపాలు, జలదరింపు డయాబెటిస్ లక్షణాలే
డయాబెటిస్ ఉన్న వారిలో ఏదైనా గాయం అయితే, అది త్వరగా మానదని వైద్యులు చెబుతున్నారు. తగిలిన గాయం త్వరగా మానకుండా ఉంటే, ఖచ్చితంగా అనుమానించాల్సిందే అని వైద్యులు సూచిస్తున్నారు. వెంటనే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో దృష్టి అస్పష్టంగా ఉంటుందని, దృష్టి లోపాలు తలెత్తుతుంటే కచ్చితంగా డయాబెటిస్ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు డయాబెటిస్ ఉన్న వారిలో శరీరం జలదరింపుకు గురవుతూ ఉంటుందని, తరచూ శరీరం జలదరింపుకు గురవుతుంటే డయాబెటిస్ టెస్ట్ చేసుకోవాలని చెబుతున్నారు.

జీవనశైలి మార్పులతో డయాబెటిస్ నియంత్రణ
ముఖ్యంగా ఈ తొమ్మిది లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఉన్నా అశ్రద్ధ చేయకుండా డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవాలని, డయాబెటిస్ గా నిర్ధారణ అయితే, వైద్యుల సూచన మేరకు మందులు వాడటంతో పాటు జీవనశైలి మార్పులు కచ్చితంగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కచ్చితమైన ఆహార నియమాలు, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర వల్ల డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications