
Hijab Row: ముస్లిం యువతులు తరగతి గదుల్లో కూడా హిజాబ్ వేసుకునేలా అనుమతించాలన్న కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?
''హిజాబ్-ఈ-ఇఖ్తియారీ’’.. హిజాబ్ ధరించాలో, వద్దో అనేది మహిళల ఇష్టం. కర్నాటక నుంచి ఇరాన్ వరకు ఈ నినాదం ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోంది.
హిజాబ్ తప్పనిసరిగా వేసుకోకపోతే కఠినమైన శిక్షలు విధించే నిబంధనలు, చట్టాలకు వ్యతిరేకంగా ఇరాన్‌లో భారీగా మహిళలు నిరసనలు చేపడుతున్నారు.
మరోవైపు కర్నాటకలో తరగతి గదుల్లో హిజాబ్ వేసుకునేలా అనుమతించాలని కోరుతూ కొందరు యువతులు కొన్ని నెలల క్రితం నిరసన తెలియజేశారు.
అయితే, ఈ రెండు నిరసనలు ఒకదానికి మరొకటి విరుద్ధంగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ, దీని వెనుక ఆలోచనలు మాత్రం ఒకటే. తాము ఏం వేసుకోవాలో నిర్ణయించే హక్కును తమకే వదిలిపెట్టాలని వారు కోరుతున్నారు. తమ శరీరంపై హక్కులను తమకే వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో కర్నాటక వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. కర్నాటకలోని స్కూళ్లు/కాలేజీల్లో హిజాబ్ వేసుకునేందుకు యువతులను అనుమతించాలో వద్దో అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై విచారణ ఇప్పటికే పూర్తయింది. తుది తీర్పు కూడా ఈ వారం వెల్లడించే అవకాశముంది.
- 'నా కూతురు శవాన్ని కూడా నన్ను చూడనివ్వలేదు. ఆమె గురించి అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలు'-మహసా తండ్రి ఆవేదన
- హిజాబ్ ధరించని మహిళలను 'వెంటాడి, వేటాడే’ ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఎవరు? ఏం చేస్తారు?

ఇప్పటివరకు ఏం జరిగింది?
కర్నాటకలోని ఉడుపి జిల్లాలో హిజాబ్ వేసుకుని అమ్మాయిలు తరగతులకు హాజరు కాకుండా ఒక జూనియర్ కాలేజీ గత ఏడాది ఆంక్షలు విధించింది.
2021, జులై 1న ''గవర్నమెంట్ పీయూ కాలేజీ ఫర్ గర్ల్స్’’ ఈ నిర్ణయం తీసుకుంది. ''యూనిఫామ్’’ కింద ఏ దుస్తులు వేసుకోవాలో, ఏవి ధరించకూడదో కాలేజీ స్పష్టంచేసింది. అందరూ ఈ నిబంధనలను అనుసరించాలని సూచించింది.
అయితే, లాక్‌డౌన్ తర్వాత కాలేజీ తెరచిన వెంటనే, కొందరు ముస్లిం యువతులు ఇదే కాలేజీకి తమ సీనియర్లు హిజాబ్ వేసుకొని వచ్చేవారని తెలుసుకున్నారు. అందుకే తాము కూడా హిజాబ్ వేసుకుని వస్తామని, దీనికి అనుమతించాలని వారు కాలేజీ యాజమాన్యాన్ని కోరారు.
ఉడుపి జిల్లాలో జూనియర్ కాలేజీల ''డ్రెస్ కోడ్’’ను స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలోని కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీ నిర్ణయిస్తుంది.
అయితే, ఆ ముస్లిం విద్యార్థుల అభ్యర్థనను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రఘువీర్ భట్ తిరస్కరించారు. తరగతి గదుల్లో హిజాబ్ వేసుకొనేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ఆయన తోసిపుచ్చారు.
''ఇది క్రమశిక్షణతో ముడిపడిన వ్యవహారం. అందరూ యూనిఫామ్ నిబంధనలను పాటించాలి’’అని బీబీసీతో గత ఫిబ్రవరిలో ఆయన చెప్పారు.
ఈ నిర్ణయానికి తమ పార్టీ సిద్ధాంతాలతో సంబంధం ఉందా? అని బీబీసీ ప్రశ్నించినప్పుడు, ''రాజకీయాలు చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, ఇది విద్య. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు’’అని ఆయన వివరించారు.
కొత్త నిబంధనల ప్రకారం, ముస్లిం యువతులు హిజాబ్ వేసుకొని కాలేజీలకు రావడానికి వీల్లేదు.
అయితే, గత డిసెంబరులో కొంతమంది అమ్మాయిలు హిజాబ్‌తో కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని కొందరు అడ్డుకున్నారు.
అయితే, అక్కడే నిలబడి ఆ అమ్మాయిలు కాలేజీ మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. జనవరి 2022లో వీరు కాలేజీ మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- హిజాబ్ ధరించనందుకు అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రాణాలు కోల్పోయిన యువతి
- సల్మాన్ రష్దీ: 'సైతాన్ ఒక కన్ను పోగొట్టుకుంది’- రష్దీ మీద దాడిపై ఇరాన్ మీడియాలో కథనాలు

నిరసనలు, నినాదాలు, హింస
ఉడుపి జిల్లాలో మొదలైన ఈ వివాదం చాలా వేగంగా ఇతర జిల్లాలకూ విస్తరించింది.
శివమొగ్గ, బెళగావి జిల్లాల్లోనూ ముస్లిం యువతులు హిజాబ్ వేసుకుని కాలేజీలకు రాకుండా ఆంక్షలు విధించారు.
మరోవైపు కాషాయ కండువాలు కప్పుకొని కొందరు యువత.. హిజాబ్ వేసుకున్న యువతులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తూ కనిపించారు. కొండాపుర్, చికమగళూర్ లాంటి ప్రాంతాల్లో నిరసనలు, ప్రతి నిరసనలు చోటుచేసుకున్నాయి.
బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న ముస్కాన్ ఖాన్ హిజాబ్ వేసుకొని కాలేజీలోకి అడుగుపెట్టడం, ఆమెకు వ్యతిరేకంగా కొందరు ''జై శ్రీరామ్’’ నినాదాలు చేయడం లాంటి దృశ్యాలు కనిపిస్తున్నా వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ముస్కాన్ కూడా ''అల్లాహు అక్బర్’’అని నినాదాలు చేస్తూ కనిపించారు. కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కర్నాటక హైకోర్టు ఈ అంశంపై విచారణ మొదలుపెట్టేందుకు మూడు రోజులకు ముందుగా, అందరూ కాలేజీ యాజమాన్యం సూచించినట్లే యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఒక ఆదేశాన్ని కూడా జారీ చేశారు. యూనిఫామ్ కాకుండా ఇతర వస్త్రాలను అనుమతించబోమని ఆయన స్పష్టంచేశారు.
విద్యార్థుల యూనిఫామ్ విషయంలో కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీలకు పూర్తి హక్కులు ఉంటాయని ఆ ఆదేశంలో పేర్కొన్నారు.
ప్రైవేటు కాలేజీలు మాత్రం తమ యూనిఫామ్ విషయంలో వారే సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు.
ఆ తరువాత రెండు రోజులు నిరసనలు మరింత పెరిగాయి. కొన్నిచోట్ల ఇవి హింసాత్మకంగానూ మారాయి.
ఫిబ్రవరి 8న ఉడుపిలోని ఎంజీఎం కాలేజీలో హిజాబ్ వేసుకున్న అమ్మాయిలకు వ్యతిరేకంగా వందల మంది జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ కనిపించారు.
కర్నాటకలోని చాలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. కొన్నిచోట్ల పోలీసులు లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలు కూడా ప్రయోగించారు.
ఆ తర్వాత కొన్ని రోజులపాటు విద్యా సంస్థలను మూసివేసి ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.
అప్పటికి కర్నాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలుపెట్టింది.
- సల్మాన్ రష్దీ: ఎన్టీఆరే 'ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?
- సల్మాన్ రష్దీ ఎవరు? ఇండియాలో జన్మించిన ఈ రచయితను కొందరు ఎందుకు చంపాలనుకుంటున్నారు
కర్నాటక హైకోర్టు తీర్పు..
11 రోజులపాటు హైకోర్టు ఈ కేసును విచారించింది.
ఫిబ్రవరి 5న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలకు కోర్టు మద్దతు పలికింది. ప్రభుత్వ కాలేజీలో యూనిఫామ్ ఉండేచోట హిజాబ్‌లపై ఆంక్షలు విధించొచ్చనే నిబంధనలకు కోర్టు మద్దతు పలికింది. ఇది రాజ్యాంగంలో నిర్దేశించిన సహేతుక ఆంక్షల కిందకే వస్తుందని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీల నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. మరోవైపు ఇస్లాంలో హిజాబ్ వేసుకోవడం తప్పనిసరనే వాదనను ధర్మాసనం తిరస్కరించింది.
''హిజాబ్, భగ్వా లేదా ఇతర మతానికి ప్రతీకంగా భావించే వస్త్రాలను వేసుకురాకుండా యూనిఫామ్‌లు మాత్రమే సూచించడం అనేది విద్యను అందరికీ చేరువ చేయడం దిశగా పడిన అడుగు’’గా ధర్మాసనం అభివర్ణించింది.
- ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే చాలామంది అమ్మాయిలు కన్యత్వ సర్టిఫికేట్లు తీసుకురావాలి
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
సుప్రీం కోర్టుకు ఎలా?
కర్నాటక హైకోర్టు తీర్పును వెల్లడించిన వెంటనే సుప్రీం కోర్టులో దీనిపై అప్పీలు దాఖలైంది.
ప్రస్తుతం సుప్రీం కోర్టు తమ విచారణను పూర్తిచేసింది. తీర్పును రిజర్వు చేసింది. ఈ వారంలోనే తీర్పు వెల్లడించే అవకాశముంది.
ఈ కేసు విచారణకు కర్నాటక ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా హాజరయ్యారు. ''2004 నుంచి ఎవరూ తరగతులకు హిజాబ్ వేసుకుని రావడం లేదు. గత డిసెంబరులో కొందరు యువతులు హిజాబ్ వేసుకొని రావడంతోనే ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేపట్టింది. ముస్లిం యువతులు హిజాబ్ వేసుకొని తరగతులకు హాజరు కావాలని ప్రోత్సహించింది’’అని చెప్పారు.
అయితే, ఈ ఆరోపణలను పీఎఫ్ఐ ఖండించింది. గత సెప్టెంబరులో ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
''ఈ ప్రచారం ఏదో ఒకచోట విద్యార్థులు మొదలుపెట్టిన ప్రచారం కాదు. వీరంతా ఒక పెద్దకుట్రలో భాగం. వీరందరినీ కొందరు నడిపిస్తున్నారు’’అని తుషార్ వ్యాఖ్యానించారు.
''ఇది మతానికి సంబంధించిన వ్యవహారం కాదు. విద్యార్థులందరికీ సమాన హక్కులు, సమాన నిబంధనలు ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం’’అని ఆయన వివరించారు.
ఈ కేసును జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాలు సభ్యులుగాగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
- ఇరాన్: ఇక్కడ మహిళలకు ఎక్కువగా ఉరి శిక్షలు విధిస్తున్నారు ఎందుకు
- నియంతలైనా దేశం దాటి పారిపోవాల్సిందేనా? అజ్ఞాతంలోకి వెళ్లాక ఏం జరుగుతుంది? 10 మంది పాలకుల కథ..
ఇరాన్‌లో అలా..
భారత్‌లో హిజాబ్ వివాదం నడుస్తున్నప్పుడే, ఇరాన్‌లోనూ హిజాబ్ వివాదం చెలరేగింది.
గత నెలలో 22ఏళ్ల మహసా అమీనీ హిజాబ్ సరిగా వేసుకోలేదని చెబుతూ ఇరాన్ మొరాలిటీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే, వారి అదుపులో ఉన్నప్పుడే ఆమె మరణించారు.
ఇరాన్‌లో నిబంధనల ప్రకారం, అమీనీ హిజాబ్‌ను ధరించలేదని పోలీసులు ఆరోపించారు. ఆమె గుండె పోటుతో మరణించారని వారు చెబుతున్నారు. అయితే, ఆమెను దారుణంగా కొట్టి చంపారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో హిజాబ్‌తోపాటు చాలా అంశాలకు వ్యతిరేకంగా ఇరాన్‌లో మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.
కొందరు మహిళలు వీధుల్లో హిజాబ్‌లను తగులబెడుతున్నారు. వారిపై హింసాత్మకంగా పోలీసులు దాడులు చేస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.
ఇరాన్‌లో నిరసనలకు ప్రస్తుతం భారత్‌లోని రైట్ వింగ్, లెఫ్ వింగ్.. రెండు వర్గాల పార్టీలూ మద్దతు పలుకుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- లేపాక్షిలో స్తంభం నిజంగా గాల్లో వేలాడుతోందా, దాని వెనకున్న వాస్తవాలేంటి ?
- ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)