Himachal By elections: బీజేపీలో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్లు ఓటమి!
షిమ్లా: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఉపఎన్నికల్లో 13 స్థానాల్లో 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించగా.. కేవలం 2 సీట్లలోనే బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రెండు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది.
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరి పోటీ చేసిన ఇద్దరు ఇండిపెండెంట్లు ఓటమిపాలయ్యారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు భార్య, కాంగ్రెస్ అభ్యర్థి కమ్లేష్ ఠాకూర్.. డెహ్రా స్థానంలో బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ పై 9,339 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మరోవైపు, నలాగఢ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బావా తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్ పై 8990 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, బీజేపీకి చెందిన ఆశీష్ శర్మ.. హమీర్‌పూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఉపఎన్నికలో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై 1571 ఓట్లతో విజయం సాధించారు.
ఉపఎన్నికలో కమ్లేష్ ఠాకూర్ విజయం సాధించడంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటి సారి అసెంబ్లీకి వెళ్లనున్న భార్యాభర్తలుగా సీఎం సుఖ్ విందర్ సుఖు, కమ్లేష్ ఠాకూర్ రికార్డు సృష్టించారు. మరోవైపు, రాష్ట్ర అసెంబ్లీలో ఇక్క ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో డెహ్రా నుంచి హోషియార్, ఆశీష్ శర్మ.. హమీర్ పూర్ నుంచి, కేఎల్ ఠాకూర్ నలగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. అయితే, ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ కు ఓటు వేసిన తర్వాత స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటుదారులు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి ఆ తర్వాత కాషాయ పార్టీలో చేరారు.
స్వతంత్ర ఎమ్మెల్యేలు మార్చి 22న రాజీనామా చేసి మరుసటి రోజే బీజేపీలో చేరారు. ముగ్గురు స్వతంత్రుల రాజీనామాలను జూన్ 3న స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఆమోదించారు. జులై 10న మూడు స్థానాలకు జరిగని ఉపఎన్నికల్లో దాదాపు 71 శాతం పోలింగ్ నమోదైంది.












Click it and Unblock the Notifications