ఆపరేషన్ సింధూర్ విజయానికి కారణం అదే: ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీ.. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దేశ చరిత్రలో ఇలా సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ఇదే తొలిసారని ఆయన అభివర్ణించారు. దేశ భద్రత ప్రమాదంలో పడినప్పుడు ప్రధాని మోదీ తీసుకున్న సరైన నిర్ణయంతో ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించామన్నారు. ఇది కేవలం సైన్యం సాధించిన విజయం మాత్రమే కాదని.. భారత సార్వభౌమత్వం, సమగ్రత, శాంతిని నెలకొల్పామని తెలిపారు. ప్రధాని మోదీనే ఈ ఆపరేషన్ కు ఆ పేరు పెట్టారని తెలిపారు.
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధాని మోదీ.. సైన్యానికి పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు. ఇలా చేయడం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్ లోని రేవా లోని టీఆర్ఎస్ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ సమర్థమైన నాయకత్వం, దూరదృష్టి మూలంగా ఆపరేషన్ సింధూర్ లో చారిత్రాత్మక విజయం సాధించినట్లు పేర్కొన్నారు.

ఆపరేషన్ సింధూర్ విజయం కేవలం మిలిటరీ విక్టరీ మాత్రమే కాదని భారత సార్వభౌమత్వం, సమగ్రత, శాంతిని మరోసారి స్థాపించాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీనే ఆపరేషన్ సింధూర్ పేరును సూచించారని తెలిపారు. ఈ ఆపరేషన్.. యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. త్రిదళాలు కలిసి దేశ స్ఫూర్తిని చాటాయని పేర్కొన్నారు. కరేజ్, కాన్ఫిడెన్స్, కామ్ నెస్ ఈ మూడు నియమాలతోనే విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే జనరేషన్ జెడ్ పైనా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు జనరేషన్ జెడ్ పైనే ఉందని తెలిపారు. ప్రస్తుతం యువతకు డిజిటల్ రంగంపై అవగాహన, సామాజిక పరిపక్వత, అంతర్జాతీయ పరిజ్ఞానం కలిగి ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications