ఆగస్టు 15- జనవరి 26 కు జెండా ఎగురవేయడంలో తేడాలు తెలుసా..?
జాతీయ జెండా మన గర్వం, మన గౌరవం, స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది యోధులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది ఈ త్రివర్ణ పతాకం. మరి త్రివర్ణ పతాకాన్ని మనం రెండుసార్లు అవతరణ చేస్తాం. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరోటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం. దేశ ప్రధాని ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేస్తారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం స్వేచ్ఛకు, బ్రిటిష్ పాలన అంతానికి చిహ్నంగా భావిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
భారత రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకున్న సందర్భంగా జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇలా ప్రతి సందర్భానికి ఒక చరిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేస్తూ.. భారత్ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఉందని నిరూపిస్తోంది. జనవరి 26, 2025న భారతావని 76వ గణతంత్రదినోత్సవ వేడుకను జరుపుకోనేందుకు సిద్ధమైంది. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపినందుకు గుర్తుగా ఏటా గణతంత్రదినోత్సవాన్ని జరుపుకొంటాం. దేశరాజధాని దిల్లీలోని కర్తవ్యపథ్ లో భారత రాష్ట్రపతి త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరిస్తారు.

స్వాతంత్ర్య దినోత్సవం.. భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు.. బ్రిటిష్ పాలన అంతంతో పాటు భారత స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటాం. ఆరోజు దేశ ప్రధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జెండా ఎగురవేస్తారు.
ఎలా ఎగురవేస్తారు..?
జాతీయ జెండాను జెండా కర్ర చివరన కట్టివేస్తారు. ప్రధానమంత్రి ఆ జెండా తాడును పైకి లాగగా.. జాతీయ జెండా పైకి వెళ్తుంది. జెండా కర్ర చివరివరకూ జాతీయ పతాకం వెళ్లాక.. జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఎంతోమంది మంది ప్రాణ త్యాగాల మధ్య స్వాతంత్ర్యం సిద్దించింది కాబట్టి ఆగస్టు 15న జెండా ఎగురవేసే పద్దతి ఇలా ఉంటుంది.
రిపబ్లిక్ డే.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడం
ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే వేడుక చేసుకుంటాం. 1950లో రాజ్యాంగం ఆమోదం పొందిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం. సొంత చట్టాలతో తమ దేశాన్ని తాము పాలించుకుంటాం.. తమ దేశం ఎవరికీ బానిస కాదు.. భారతదేశంపై ఏ దేశమూ పెత్తనం చెలాయించేందుకు వీలు లేదన్న భావనతో ఈ దినోత్సవాన్ని జరుపుకొంటాం. జనవరి 26న దిల్లీలోని కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇక్కడ జాతీయ జెండా ముందుగానే జెండా కర్రకు పైన కట్టిఉంటుంది. రాష్ట్రపతి ఆ తాడును లాగి జెండాను విడుదలచేస్తారు. దీంతో జెండాలోని పూలు గాల్లో నుంచి కిందకు పడతాయి. అలాగే గణతంత్ర వేడుకలో భారీ పరేడ్, మిలిటరీ సైన్యం విన్యాసాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications