Nimisha Priya: త్వరలో నిమిష ప్రియ విడుదల?
Nimisha Priya: యెమెన్ జైలులో మరణశిక్ష ఖైదీగా ఉన్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిష ప్రియ విడుదలపై ఆశలు సజీవంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చల వల్ల త్వరలో ఆమె విడుదల గురించి శుభవార్త వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్ 16న అమలు జరగాల్సిన మరణశిక్ష వాయిదా పడిన తర్వాక ఇది ఒక పెద్ద ఊరట కలిగించే పరిణామం.
చర్చల్లో అంతర్జాతీయ వ్యాపారులు
నిమిష ప్రియ కేసులో చురుకుగా పాల్గొంటున్న కేరళ ఎమ్మెల్యే చాందీ ఊమెన్.. ఆమె విడుదల గురించి కీలక సమాచారాన్ని వెల్లడించారు. చాందీ ఊమెన్.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు. చాందీ ఊమెన్ మాట్లాడుతూ.. యెమెన్‌లో నివసిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు నిమిష ప్రియ విడుదల కోసం చురుకుగా మధ్యవర్తిత్వం వహిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రయత్నాలు సఫలమైతే.. రానున్న రోజుల్లో నిమిష విడుదలపై మంచి వార్త రావచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా చాందీ ఊమెన్ ఈ కేసును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని గవర్నర్‌ను 3సార్లు కోరారు.

మరణశిక్ష వాయిదా వెనుక కారణాలు
నిమిష ప్రియకు విధించిన మరణశిక్షను జులై 16న అమలు చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం, సౌదీ అరేబియా ఏజెన్సీలు, భారత్‌లోని ప్రముఖ మత పెద్దల చొరవ కారణంగా ఆమె మరణశిక్ష వాయిదా పడింది. మరణశిక్షను ఆపడానికి కాంతాపురం గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబుబాకర్ ముస్లియార్ కూడా మతపరమైన జోక్యం చేసుకున్నారు. ఆయన యెమెన్‌లోని తన స్నేహితుడి ద్వారా యెమెన్ శూరా కౌన్సిల్‌ను సంప్రదించి మధ్యవర్తిత్వం వహించారు. ఈ సమష్టి ప్రయత్నాల ఫలితంగానే మరణశిక్షను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిపివేశారు.
నిమిష ప్రియ కేసు ఇలా..
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన నిమిష ప్రియ 2008లో నర్సుగా పనిచేయడానికి యెమెన్‌కు వెళ్లారు. అక్కడ ఆమె తన సొంత క్లినిక్ స్థాపించారు. 2017లో, ఆమె తన యెమెన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్డో మెహదీ నుండి తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందడం కోసం అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే, దురదృష్టవశాత్తూ అధిక మోతాదు కావడంతో మెహదీ మరణించాడు. ఈ కేసులో 2018లో నిమిషా ప్రియను దోషిగా తేల్చి మరణశిక్ష విధించారు. ఆ తర్వాత 2020లో దిగువ కోర్టు ఈ తీర్పును సమర్థించగా, 2023 నవంబర్‌లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా అదే తీర్పును కొనసాగించింది. యెమెన్ చట్టాల ప్రకారం, బాధితుడి కుటుంబానికి 'బ్లడ్ మనీ' (రక్తపు డబ్బు) చెల్లించి నిమిషను కాపాడుకునే అవకాశం ఇంకా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చలు ఫలించి, ఆమె త్వరలో ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు, భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications