గగుర్పాటు కలిగించే హత్య.. శవంలో అన్ని బుల్లెట్లా?
దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఓ దారుణ హత్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పాత కక్షలు ఓ వ్యక్తి ప్రాణాలను అత్యంత కిరాతక పద్ధతిలో బలితీసుకున్నాయి. అసలేం జరిగిందంటే.. దక్షిణ ఢిల్లీలోని అయా నగర్‌లో నవంబర్ 30న రతన్ లోహియా(52) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో తాజాగా వెలువడిన ఫోరెన్సిక్, పోలీసులు దర్యాప్తు నివేదికలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. హంతకులు రతన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆయన మృతదేహం నుంచి పోలీసులు ఏకంగా 69 బుల్లెట్లను వెలికితీశారు. ఓ వ్యక్తిని చంపడానికి ఇంత భారీ స్థాయిలో కాల్పులు జరపడం వారి మధ్య ఉన్న ప్రతీకార తీవ్రతను సూచిస్తోంది.
ఏం జరిగింది?
నవంబర్ 30న ఉదయం సుమారు 6 గంటల సమయంలో రతన్ లోహియా పని నిమిత్తం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ ఒక నల్లటి నిస్సాన్ మాగ్నైట్ కారులో మాటువేసిన ముగ్గురు దుండగులు ఆయనను చుట్టుముట్టారు. రతన్ తప్పించుకునే లోపే భారీ స్థాయిలో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన అక్కడికక్కడే మరణించారు.

దర్యాప్తులో తేలిన అసలు నిజం ఇదే..
హంతకులు వాడిన కారుకు నంబర్ ప్లేట్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ హత్య వెనుక అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశాల నుంచి ఈ హత్యకు సుపారీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ హత్య వెనుక రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న 'రక్తపు ఏరుల' గొడవ ఉంది. గత మే నెలలో 15వ తేదీని రంబీర్ లోహియా కుమారుడు అరుణ్ లోహియా హత్యకు గురయ్యారు. అరుణ్ హత్య కేసులో ఇప్పుడు చనిపోయిన రతన్ లోహియా పెద్ద కుమారుడు దీపక్ అరెస్ట్ అయ్యారు. తన కుమారుడి మరణానికి ప్రతీకారంగానే రంబీర్ లోహియా, అతని బంధువులు రతన్‌ను చంపించారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భయాందోళనలో స్థానికులు
యువత మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణలు ఇలా పెద్దల ప్రాణాలను తీసే స్థాయికి చేరడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రతన్ కుమార్తె మాట్లాడుతూ.. తమ తండ్రికి ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదని, కేవలం కక్ష తీర్చుకోవడానికే ఆయనను బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications