ఆప్ పై పగ తీర్చుకున్న కాంగ్రెస్ ? ఖాతా తెరవకున్నా బీజేపీని గెలిపించిందిలా..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హ్యాట్రిక్ సాధించాలన్న ఆప్ అధినేత కేజ్రివాల్ కల నెరవేరలేదు. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చినా.. ఈసారి మాత్రం దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దీని వెనుకక చాలా కారణాలే ఉన్నాయి. అయితే ఆప్ ఓటమికి ప్రధాన కారణం బీజేపీ అని అంతా భావిస్తున్నా గణాంకాలు చూస్తే మాత్రం ఢిల్లీలో ఆప్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీయే అని అర్దమవుతోంది. ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్ ఆప్ ను ఎలా ఓడించిందో చూద్దాం..
ఢిల్లీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. బీజేపీ, ఆప్ మధ్య సాగిన హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తప్పలేదు. అయితే ఢిల్లీలో ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ.. అధికార ఆప్ ను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో మాత్రం సక్సెస్ అయింది. ఇవాళ జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఈ విషయం అర్దమవుతోంది. ముఖ్యంగా పలు మైనార్టీ సీట్లలో బీజేపీ విజయం వెనుక కచ్చితంగా కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది.

ఢిల్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించిన ఓట్ల పరంగా చూస్తే బీజేపీ మొదటి స్ధానంలోనూ, ఆప్ రెండో స్ధానంలోనూ, కాంగ్రెస్ మూడో స్ధానంలోనూ నిలుస్తున్నాయి. అయితే బీజేపీ, ఆప్ మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం ఐదు శాతమే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 6.7గా ఉంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏ స్ధాయిలో ఓట్లు చీల్చిందో అర్దమవుతోంది. ఇండియా కూటమిలో ఉన్నా తమను కలుపుకోకుండా విడిగా పోటీ చేసిన ఆప్ కు కాంగ్రెస్ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
ఇవాళ కౌంటింగ్ ఆరంభ సరళిలోనే ఢిల్లీ కంటోన్మెంట్ లో ఆప్‌కి చెందిన వీరేందర్ సింగ్ కడియన్ కేవలం 300 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీకి చెందిన భువన్ తన్వర్ కంటే వెనుకంజలో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ 1,912 ఓట్లను సాధించింది.
అలాగే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ సీట్లోనూ కాంగ్రెస్ అభ్యర్ధి సందీప్ దీక్షిత్... ఆయన్ను దెబ్బతీయడంతో బీజేకి చెందిన పర్వేష్ వర్మ కేవలం 3 వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు.
బద్లీ, నంగ్లోయ్ జాట్, మాదిపూర్, రోహిణి, ద్వారక వంటి కీలక నియోజకవర్గాల్లో ఇదే పరిస్దితి కనిపించింది. కాంగ్రెస్‌తో లోక్‌సభ ఎన్నికల ఒప్పందం నుంచి వైదొలగకుంటే ఆప్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
వాస్తవానికి 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇలా అధికార ఆప్ ను ఓడించి బీజేపీకి సాయం చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.












Click it and Unblock the Notifications