కేజ్రివాల్ పరువు కాపాడిన ఆ రెండు వర్గాలు-ఏకంగా 14 సీట్లిచ్చి..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టాలన్న కేజ్రివాల్ కల చెదిరిపోయింది. ఢిల్లీలో మారిన ఓటరు వైఖరి ఆప్ కు శరాఘాతంగా పరిణమించింది. అయితే ఇంత సంక్షోభంలోనూ అరవింద్ కేజ్రివాల్ పార్టీకి ఓ రెండు వర్గాల ఓటర్లు మాత్రం అండగా నిలిచారు. ఆప్ గెలిచిన 22 సీట్లలో వీరు 14 సీట్లను గెలిపించి కానుకగా ఇచ్చారు. ఈ రెండు వర్గాలు లేకపోతే కేజ్రివాల్ పరువు గంగపాలయ్యేదన్న చర్చ సాగుతోంది.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లున్నాయి. వీటిలో తాజా ఎన్నిక్లలో బీజేపీ 48 సీట్లు గెల్చుకుంటే ఆప్ 22 సీట్లకు పరిమితం అయింది. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఆప్ గెలిచిన 22 సీట్లలో ముస్లింలు, దళితుల ప్రభావం ఎక్కువగా ఉన్న 14 సీట్లే ఉన్నాయి. ఆయా సీట్లలో ఓటర్లు ఆప్ కు మరోసారి అండగా నిలవడంతో కేజ్రివాల్ పార్టీకి పరువు దక్కింది. దీంతో ఇప్పుడు ఈ 14 సీట్లు రాకపోయి ఉంటే ఆప్ కు ఘోర పరాజయం ఎదురయ్యేదన్న చర్చ జరుగుతోంది.

వాస్తవానికి ఆప్ కు దళితులు, ముస్లింల ఓటు బ్యాంక్ గణనీయ స్దాయిలో ఉంది. వీరితో పాటు మధ్యతరగతి ఓటర్ల అండతో ఆప్ గతంలో ఘన విజయాలు సాధించింది. ఈసారి కూడా ముస్లింలు, దళితులు ఆప్ సాధించిన సీట్లలో మూడొంతులు కట్టబెట్టారు. అలాగే కేజ్రివాల్ కు సంప్రదాయంగా అనుకూలంగా ఉండే 19 సీట్లలో ఈ 14 సీట్లు కూడా ఉన్నాయి. అంటే వీటి స్ట్రైక్ రేట్ 75 శాతంగా ఉందన్న మాట. ఈ 19 సీట్లను గత ఎన్నికల్లో ఆప్ ఏకపక్షంగా గెల్చుకుంది. కానీ ఈసారి వీటిలో 5 సీట్లు కోల్పోయింది.
ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పెరగడంతో ఈ ఐదు సీట్లను ఆప్ కోల్పోయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చూసినా గతంలో ఆప్ కు ఏకపక్షంగా పడిన దళితులు, ముస్లింల ఓట్ల శాతం కూడా 15 నుంచి 20 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే నాలుగు ఎస్సీ రిజర్వుడు సీట్లలో ఆప్ ఓడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆప్ 12 దళిత ప్రభావిత సీట్లను ఏకపక్షంగా గెల్చుకుంది. అలాగే ఏడు ముస్లిం ప్రభావిత సీట్లలో ఆరింటిని గెల్చుకుంటూ వచ్చింది. కానీ వీటిలో 6 నుంచి 22 శాతం ఓట్లను ఆయా నియోజకవర్గాల్లో ఆప్.. కాంగ్రెస్ లేదా ఎంఐఎంకు కోల్పోయింది. ఇందులో ముస్తఫాబాద్ సీటును బీజేపీకి కోల్పోవడం వెనుక ఆప్ సాధించిన 16.6 శాతం ఓట్లు, కాంగ్రెస్ చీల్చిన 6 శాతం ఓట్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications