పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు
పాకిస్తాన్ గగనతలం మీద భారత సైనిక విమానం ఎగురుతోంది. ఇంతలో ఆ విమానానికి మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఆ మంటలు విమానాన్ని కమ్మేశాయి.
'రెడ్ వన్, యు ఆర్ ఆన్ ఫైర్’... తన తోటి పైలట్ ఫర్ది చెప్పిన మాటలు స్క్వాడ్రన్ లీడర్ ధీరేంద్ర జాఫా చెవినపడ్డాయి.
మరో పైలట్ మోహన్ కూడా బయటకు దూకేయమని చెప్పారు. మూడో పైలట్ జగ్గూ సక్లానీ మరింత గట్టిగా, 'జాఫా సర్... కిందకు దూకేయండి’ అని అరిచారు.
జాఫా ప్రయాణిస్తున్న సుఖోయ్ విమానంలో మంటలు అప్పటికే కాక్‌పిట్ దాకా చేరుకున్నాయి. విమానం నియంత్రణ కోల్పోసాగింది. వెంటనే జాఫా సీట్ ఎజెక్షన్ బటన్ నొక్కి ప్యారషూట్ సాయంతో కిందకు దూకారు.
నేలమీద పడగానే కొందరు గ్రామస్థులు 'అల్లాహ్-ఒ-అక్బర్’ అని అరుస్తూ జాఫా చుట్టూ మూగారు. వెంటనే అతడి బట్టలు చింపడం మొదలుపెట్టారు. దొరికింది దొరికినట్లు దోచుకోవాలన్నదే వాళ్ల ఆలోచన. ఒకరు అతడి వాచీ లాక్కున్నారు. మరొకరు సిగరెట్ లైటర్ తీసుకున్నారు. సెకన్ల వ్యవధిలోనే జాఫా బూట్లు, గ్లవ్స్, మఫ్లర్ లాంటివన్నీ దోచుకున్నారు.
ఇంతలో ఓ పాకిస్తానీ మిలటరీ అధికారి వచ్చి, 'నీ దగ్గర ఏవైనా ఆయుధాలున్నాయా’ అని అడిగాడు. 'ఓ రివాల్వర్ ఉంది, కానీ, దాన్ని కూడా ఎవరో లాక్కున్నారు’ అని జాఫా చెప్పారు.
పాకిస్తానీ జైల్లో భారత జాతీయ గీతం
బలంగా నేలను తాకడంతో జాఫాకు కదలడం కూడా కష్టమైంది. దాంతో ఇద్దరు జవాన్లు ఆయనను సైనిక శిబిరంలోకి మోసుకెళ్లారు. అక్కడ కనీసం టీ కప్పును పట్టుకోవడానికి కూడా జాఫా ఒంట్లోని శక్తి సరిపోలేదు. దాంతో ఓ పాకిస్తానీ సైనికుడు ఆయనకు స్పూన్‌తో టీ తాగించడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ జాఫా కళ్లు కృతజ్ఞతతో నిండిపోయాయి.
జాఫాను అక్కడి నుంచి నేరుగా ఖైదీల శిబిరానికి తీసుకెళ్లి, ఆయన నడుముకు పట్టీ వేసి ఓ గదిలో బంధించారు. రోజూ ఆయనకు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యేవి. బాత్రూమ్‌కి వెళ్లాల్సొస్తే ఆయనకు చుట్టుపక్కల ఏమీ కనిపించకుండా కళ్లకు గంతలు కట్టేవారు.
ఓ రోజు ఆయన్ను అదే భవనంలోని మరో గదికి తీసుకెళ్లారు. ఆయన లోపలికి వెళ్లగానే అక్కడ కాసేపు నిశ్శబ్దం అలముకొంది. ఇంతలో ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్ దిలిప్ పారుల్కర్ దగ్గరికొచ్చి జాఫాను హత్తుకున్నారు. జాఫా నడుముకి ఉన్న పట్టీ అక్కడి వారికి కనిపించలేదు.
ఆ గదిలో మరో పదిమంది భారత యుద్ధ ఖైదీలున్నారు. చాలా రోజుల తరవాత భారతీయుల మొహాలను చూడటంతో జాఫా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈలోగా ఆ శిబిరానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఉస్మాన్ హనీఫ్ నవ్వుతూ ఆ గదిలో అడుగుపెట్టారు. ఓ కేకు తీసుకొచ్చి అందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు చెప్పారు.
- లోక్‌సభ ఎన్నికలు 2019: తొలిదశలో 91 లోక్‌సభ స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్
- LIVE లోక్‌సభ ఎన్నికలు: మహబూబ్ నగర్లో 15 శాతం... ఖమ్మంలో 7.8 శాతం పోలింగ్

కాసిని జోకులు, నవ్వుల తరవాత అక్కడి సీనియర్ అధికారి వింగ్ కమాండర్ బానీ కోయిలో సూచన మేరకు అందరూ చనిపోయిన సైనికులకు అంజలి ఘటించారు. ఆ తరవాత జాతీయ గీతాన్ని ఆలపించారు.
1971 డిసెంబర్ 25న పాకిస్తాన్ జైలు గదిలో వినిపించిన భారత జాతీయ గీతాన్ని విని తమ గుండె గర్వంతో ఉప్పొంగిపోయిందంటారు జాఫా.
జైలు గోడకు కన్నం
రోజులు గడుస్తున్నా ఈ యుద్ధ ఖైదీల భవితవ్యం తేలలేదు. భారత పాలసీ ప్లానింగ్ కమిటీ చైర్మన్ డీపీ ధార్ పాకిస్తాన్ నుంచి భారత్ తిరిగొచ్చినా, వీళ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
దీంతో ఖైదీల శిబిరంలో ఉన్న సైనికుల్లో అసహనం పెరిగిపోయింది. ఒకవేళ తన విమానం కూలిపోయి ప్రత్యర్థులకు దొరికిపోతే, ఎలాగైనా సరే తాను జైలు నుంచి తప్పించుకొని బయటపడతానని 1971యుద్ధానికి ముందే ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్ దిలీప్ పారుల్కర్ చెప్పారు. చెప్పినట్టుగానే ఆయన అదే పని చేశారు.
జైలు నుంచి పారిపోవడానికి చేసిన ప్రయత్నాల్లో ఇతర ఖైదీలు మాల్విందర్ సింగ్, హరీష్ సింగ్జీ కూడా ఆయనకు తోడయ్యారు.
- పదేళ్లు గడచినా బెనజీర్ హత్య మిస్టరీ ఇంకా ఎందుకు వీడలేదు?
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు 'రా’ ఎలా కనిపెట్టింది?
ఎస్కేప్ ప్లాన్
జైల్లోని 5వ నంబర్ గదిలో 21/15 అంగుళాల వైశాల్యంతో ఓ కన్నం చేస్తే, నేరుగా పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయిమెంట్ ఆఫీసులోకి చేరుకోవచ్చనీ, అక్కడి నుంచి 6 అడుగుల ఎత్తున్న గోడ దూకితే మాల్ రోడ్డులోకి ప్రవేశించొచ్చని వాళ్లు ప్రణాళిక వేశారు.
కురువిల్లా అనే సైనికుడు ఎలక్ట్రీషియన్ నుంచి ఓ స్క్రూ డ్రైవర్ దొంగిలించారు. మాల్విందర్ సింగ్ మరో కటింగ్ పరికరాన్ని సేకరించారు.
రాత్రి 10 గంటల తరవాత దిలీప్, గ్రేవల్ కలిసి గోడకున్న సిమెంటును గీకేవారు. హరీ, చటీలు ఎవరైనా వస్తున్నారేమోనని నిఘా పెట్టేవారు. ఆ సమయంలో గదిలోని ట్రాన్సిస్టర్ సౌండ్ పెంచేవారు.
అప్పట్లో జెనీవా కన్వెన్షన్ నియమాల ప్రకారం భారతీయ యుద్ధ ఖైదీలకు నెలనెలా కొంత డబ్బు అందేది. దాంతో వాళ్లు తమకు అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు. పాకిస్తాన్ గార్డుల్లో ఒకరైన ఔరంగజేబ్ అనే వ్యక్తి దర్జీ పని కూడా చేస్తారని పారుల్కర్‌కు తెలిసింది. దాంతో, తాము డబ్బు చెల్లిస్తామనీ, తమ కోసం పఠాన్ సూట్లు కుట్టి ఇవ్వమనీ పారుల్కర్ ఆయన్ను అడిగారు.
వాళ్ల కోసం ఔరంగజేబ్ పచ్చ రంగు పఠాన్ సూట్లు కుట్టారు. కామత్ అనే మరో యుద్ధ ఖైదీ ఓ సూది, అయస్కాంతాల సాయంతో దిక్సూచీని తయారు చేశారు.
- 'తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- బీబీసీ స్పెషల్: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ఎడారీకరణ ముప్పు
వర్షంలో జైలు నుంచి పరార్
ఆగస్టు 12వ తేదీన జైల్లోని భారతీయ ఖైదీలకు ఉరుముల శబ్దం వినిపించింది. అదే రోజు రాత్రి గదిలోని గోడకున్న సిమెంటు ఆఖరి పొరను వాళ్లు తొలగించారు. మొదట ముగ్గురు సైనికులు ఆ రంద్రంలోంచి అతి కష్టమ్మీద బయటకు వెళ్లారు. అక్కడ గోడ అవతలకు తొంగి చూస్తే వీధంతా బాగా రద్దీగా కనిపించింది.
ఇసుక నుంచి తప్పించుకోవడానికి దూరంగా ఉన్న గార్డు మొహానికి దుప్పటి కప్పుకొని కనిపించాడు. ఈలోగా ఉరుములతో కూడిని వర్షం మొదలవడంతో ఆ గార్డు ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ వరండాలోకి పరుగెత్తాడు.
అతడు మళ్లీ దుప్పటి కప్పుకోగానే ముగ్గరు ఖైదీలు గోడ దూకి వీధిలోకి ప్రవేశించారు. అప్పుడే, సినిమా హాల్లో నుంచి బయటకు వస్తున్న జనాల్లో వాళ్లు కలిసిపోయారు. కాస్త దూరం నడవగానే, 'పాకిస్తాన్‌లోనే అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి మనం తప్పించుకున్నాం. స్వేచ్ఛను సాధించాం’ అని ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్ హరీష్ సింగ్జీ గట్టిగా అరిచారు.
కానీ, మరో ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్ మాల్విందర్ సింగ్ మాత్రం, 'ఇంకా పూర్తిగా స్వేచ్ఛ దొరకలేదు’ అని అన్నారు.
మాల్విందర్, హరీష్, దిలీప్ పారుల్కర్... ముగ్గురూ తాము కుట్టించుకున్న పఠాన్ సూట్లు తొడుక్కున్నారు. వాళ్లెవరికీ నమాజ్ చేయడం రాదు. దాంతో తాము క్రైస్తవులమని చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌లో క్రిస్టియన్లు కూడా చాలామంది ఉండటంతో తమని ఎవరూ అనుమానించరని వారు భావించారు.
దిలీప్, మాల్విందర్, హరీష్‌లు తమ పేర్లను ఫిలిప్ పీటర్, ఆలి ఆమిర్, హారొల్డ్ జాకబ్‌లుగా మార్చుకున్నారు.
- బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు
- పగలు లాయర్లు... రాత్రుళ్లు బార్లో 'డ్రాగ్’ డాన్సర్లు
బస్సులో పెషావర్‌కు...
వర్షంలో తడుస్తూనే వడివడిగా వారు బస్ స్టేషన్‌కు చేరుకున్నారు. "పెషావర్‌కు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెషావర్! పెషావర్!" అంటూ కండక్టర్ కేకలు వేస్తున్నాడు. ఆ ముగ్గురూ వెంటనే బస్సు ఎక్కారు.
ఉదయం ఆరు గంటలకు వాళ్ళు పెషావర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఒక టాంగాలో జమ్రుద్ రోడ్డు దాకా వెళ్ళారు. ఆ తరువాత నడక ప్రారంభించారు.
కాసేపటికి, మరో బస్సు ఎక్కారు. బస్సులో చోటు లేకపోవడంతో కండక్టర్ వారిని పైకి ఎక్కి కూర్చోమన్నాడు. జమ్రుద్‌కు చేరుకున్న తరువాత రోడ్డు మీద వారికి ఒక గేటు కనిపించింది. "మీరు ఆదివాసీల ప్రాంతంలోకి అడుగు పెడుతున్నారు. సందర్శకులు రోడ్డు మీద నుంచి ఎటూ వెళ్ళకూడదు. మహిళల ఫోటోలు తీయకూడదు" అనే హెచ్చరిక బోర్డు అక్కడ కనిపించింది.
బస్సు మీద కూర్చుని వారు 9.30 గంటలకు లాండీకోతల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ముందుకు వెళితే అఫ్గానిస్తాన్ వస్తుంది. వాళ్ళు ఒక టీకొట్టు దగ్రకు వెళ్ళారు. మాల్విందర్ టీ చప్పరిస్తూ అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని, 'లండీఖానా ఇక్కడికి ఎంత దూరం?' అని అడిగారు. అతనికి అదేమీ తెలియదు.
అక్కడి ప్రజల తల మీద ఏదో ధరిస్తున్నారని దిలీప్ గుర్తించారు. స్థానికుల్లానే కనిపించడానికి దిలీప్ రెండు పెషావర్ టోపీలు కొనుక్కొచ్చారు.
ఒక టోపీ మాల్విందర్ తలకు చిన్నదైపోయింది. దిలీప్ మళ్ళీ దుకాణానికి వెళ్ళి అది ఇచ్చేసి వేరేది తెచ్చారు.
- భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..
- సోనియా గాంధీ గౌను ఇందిర రక్తంతో తడిచిపోయింది..
తహసీల్దార్ సహాయకుడికి అనుమానం
వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి టీస్టాల్ కుర్రాడు, 'టాక్సీలో లండీఖానా వెళ్ళడానికి 25 రూపాయలు' అని అరుస్తున్నాడు. ఆ ముగ్గురూ టాక్సీ వైపు నడుస్తుంటే వెనకాల నుంచి ఏదో గొంతు వినిపించింది.
మీరు లండీఖానాకు వెళ్ళాలా అని ఎవరో వ్యక్తి వాళ్ళను అడిగాడు. ఆ ముగ్గురూ అవునని చెప్పడంతో, అసలు మీరెక్కడి నుంచి వచ్చారని అడిగాడు.
దిలీప్, మాల్విందర్ ఇద్దరూ ముందుగానే అల్లుకున్న కథను అతనికి చెప్పారు. అది విని ఆ వ్యక్తి మాట కొంత కఠినంగా మారింది. "లండీఖానా అనే ఊరే లేదు. అది బ్రిటిష్ కాలంతోనే పోయింది" అని అన్నాడు. వీరు ముగ్గురూ బెంగాలీలని, అఫ్గానిస్థాన్ మీదుగా బంగ్లాదేశ్‌కు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారని అతడు అనుమానించాడు. దానికి గ్రేవల్ నవ్వుతూ, 'మేం బెంగాలీల్లా కనిపిస్తున్నామా? నువ్వెప్పుడైనా బెంగాలీలను చూశావా' అని అడిగాడు.
మొత్తానికి, ఆ తహసీల్దార్ సహాయకుడు వాళ్ళు చెప్పింది నమ్మలేదు. వాళ్ళను తహసీల్దార్ వద్దకు తీసుకువెళ్ళాడు. తహసీల్దార్ కూడా వాళ్ళు చెప్పిన మాటలకు సంతృప్తి చెందలేదు. వారిని జైల్లో పెట్టక తప్పదన్నాడు.
ఏడీసీ ఉస్మాన్‌కు ఫోన్ చేసుకోవచ్చా?
ఇంతలో దిలీప్‌కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పాకిస్తానీ ఎయిర్‌ఫోర్స్ అధిపతి ఏడీసీ అయిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్‌తో ఒకసారి ఫోన్లో మాట్లాడవచ్చా అని దిలీప్ అడిగారు. ఉస్మాన్ అంటే మరెవరో కాదు, భారతీయ ఖైదీల కోసం క్రిస్టమస్ కేక్ తెచ్చిన ఆనాటి రావల్పిండి జైలు ఇంచార్జ్. ఉస్మాన్ లైన్లోకి వచ్చారు.
'సార్ మీరు ఈ వార్త వినే ఉంటారు. మేమంతా లండీకోతల్ వద్ద ఉన్నాం. ఇక్కడి తహసీల్దార్ మమ్మల్ని నిర్బంధించారు. మీరు మీ మనుషుల్ని ఇక్కడికి పంపించగలరా?' అని దిలీప్ అడిగారు.
ఫోన్ తహసీల్దార్‌కు ఇవ్వండని ఉస్మాన్ అన్నారు. 'ఆ ముగ్గురూ మా మనుషులే. వారిని ఏమీ అనవద్దు, చేయి చేసుకోవద్దు' అని చెప్పారు.
ఆ ఆలోచన తనకు అనుకోకుండా తట్టిందని దిలీప్ పారుల్కర్ బీబీసీకి చెప్పారు. ఆయన అధికార పరిధి చాలా పెద్దది కాబట్టి, తహసీల్దార్ తమను ఏమీ అనే అవకాశం ఉండదని ఆయన భావించారు.

షిమ్లాలో జుల్ఫీకర్ అలీ భుట్టోకు స్వాగతం పలికిన ఇందిరా గాంధీ
రావల్పిండి జైల్లో 11 గంటల ప్రాంతంలో కలకలం మొదలైంది. జాఫా గది పక్కనే ఉన్న గార్డ్‌రూమ్‌లో ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ తరువాతే హడావిడి మొదలైంది. గార్డ్స్ అంతా అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. మిగిలిన ఏడుగురు ఖైదీలను వేర్వేరుగా చీకటి గదుల్లో నిర్బంధించారు.
'ఇదంతా జాఫా పనే. అతడిని షూట్ చేయండి. ఆ ముగ్గురు ఖైదీలతో కలిసి ఇతను కూడా పారిపోవడానికి ప్రయత్నించాడని మేం చెబుతాం' అని ఒక గార్డ్ అన్నాడు.
'శత్రువు ఎప్పటికీ శత్రువే. మేం మిమ్మల్ని నమ్మాం. అందుకు బదులుగా మీరు మాకు ఇచ్చిందేమిటి?' అని జైలు డిప్యూటీ డైరెక్టర్ రిజ్వీ ప్రశ్నించారు.
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్లు, వంట మనుషులా?
ఖైదీల విడుదల - స్వదేశాగమనం
ఆ తరువాత ఖైదీలందరినీ లయాల్పూర్ జైలుకు తీసుకువెళ్ళారు. అక్కడ భారత సైన్యానికి చెందిన ఖైదీలు కూడా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో వచ్చారు. ఆయన మాట్లాడుతూ, 'మీ ప్రభుత్వానికి మీగురించి దిగుల్లేదు. కానీ, నేనే మిమ్మల్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను' అని అన్నారు.
యుద్ధ ఖైదీలు 1972 డిసెంబర్ 1న వాఘా సరిహద్దు దాటారు. వారంతా తమ ప్రభుత్వం తమను కాపాడడానికి ఏమీ చేయలేదన్న అసహనంతో ఉన్నారు. భుట్టో ఔదార్యమే వారికి స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ, సరిహద్దు రేఖ దాటి భారత భూభాగంలోకి అడుగు పెట్టిన వెంటనే వేలాది మంది వారిని పూలదండలతో స్వాగతించారు. ఆలింగనాలతో అభిమానం చాటుకున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి జ్ఞానీ జైల్ సింగ్ కూడా అప్పుడు అక్కడే ఉన్నారు.
వాఘా నుంచి అమృత్‌సర్‌కు వచ్చే దారిలో 22 కిలోమీటర్ల పొడవునా వందలాది స్వాగత తోరణాలు వారికి ఆహ్వానం పలికాయి. ప్రజల ప్రేమాభిమానాలు చూశాక వారిలో అసహనం, అసంతృప్తి మబ్బు పింజల్లా ఆవిరైపోయాయి.
ఆ మరునాడు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో వారి అభినందన సభ జరిగింది.
- 'నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
అందమైన జైలు
మాల్విందర్‌కు బరేలీలో పోస్టింగ్ వచ్చింది. ఏడాది జీతంలో 2,400 రూపాయలు పెట్టి ఆయన ఫియట్ కారు కొనుక్కున్నారు.
ఎయిర్ ఫోర్స్ చీఫ్ పిసి లాల్‌కు దిలీప్ ఫౌంటెన్ పెన్ కానుకగా ఇచ్చారు. నిజానికి, అది పెన్ను కాదు. జైలు నుంచి తప్పించుకోవడానికి వారు తయారు చేసుకున్న దిక్సూచి.
దిలీప్ పారుల్కర్ తల్లిదండ్రులు వెంటనే అతనికి పెళ్ళి ఏర్పాట్లు చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన అయిదు నెలల తరువాత ఆయన పెళ్ళి జరిగింది. ఆయనతో కలిసి పాకిస్తాన్ జైళ్లో గడిపిన స్క్వాడ్రన్ లీడర్ ఎ.వి.కామత్ నుంచి పెళ్లి రోజున దిలీప్‌కు ఒక టెలిగ్రామ్ వచ్చింది, 'ఈ అందమైన జైలు నుంచి మాత్రం ఎప్పటికీ తప్పించుకోలేవు.'
(వింగ్ కమాండర్ ధీరేంద్ర రాసిన 'డెత్ వజ్ నాట్ పెయిన్‌ఫుల్' పుస్తకం ఆధారంగా రాసిన కథనం. భారతీయ పైలట్లు 1971 యుద్ధం తరువాత పాకిస్తాన్ యుద్ధ ఖైదీల శిబిరం నుంచి ఎలా తప్పించుకున్నారో ఆయన ఈ పుస్తకంలో వివరించారు.)
ఇవి కూడా చదవండి
- జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య పేరు 'అధికారికంగా’ కనిపించదెందుకు?
- కేరళ సేల్స్ విమెన్ కూర్చునే హక్కు ఇలా సాధించుకున్నారు
- స్నేహానికి సరిహద్దులు లేవని నిరూపించిన చిన్నారులు
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
- ఈ మహిళలు బతకడానికి.. ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెడతారు
- పవన్ కల్యాణ్‌కు ఫిన్లాండ్ విద్యా విధానం ఎందుకంతగా నచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)