తగ్గేదే లే- చూసుకుందాం
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసి విమర్శలను ఎదుర్కొన్న డీఎంకే యువిజన విభాగం అధినేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. మరోసారి వార్తల్లోకెక్కారు. సనాతనం ధర్మంపై విమర్శలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.
దిండిగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన అంశాన్ని ప్రస్తావించారు. గతంలో తనపై వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. వాటిని తాను తేలిగ్గా తీసుకున్నానని వ్యాఖ్యానించారు. సనాతనం గురించి మాత్రమే కాదు పెరియార్, పెరారిజ్ఞార్, కళైజ్ఞార్ కరుణానిధి అనుసరించిన విధానాలు, వారి సూక్తులను ఉటంకించానని గుర్తు చేశారు.

తాను చేసిన అప్పటి వ్యాఖ్యలను వక్రీకరించారని, ఎవరికి అనుకూలంగా వాళ్లు మలచుకున్నారని ఉదయనిధి స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో తనపై కేసులు నమోదు చేశారని, బహిరంగంగా క్షమాపణలు చెప్పారంటూ డిమాండ్ సైతం చేశారని అన్నారు.
తన మాటలను వక్రీకరించినప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ఉదయనిధి ప్రశ్నించారు. కళైజ్ఞార్ కరుణానిధి మనవడినని, ఎవరికీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు. అప్పుడు చెప్పిన మాటలకు తాను కట్టుబడే ఉన్నానని, అవి పెరియార్, పెరారిజ్ఞార్ వంటి మహనీయులు చెప్పిన సూక్తులేనని స్పష్టం చేశారు.
తమిళనాడుపై ఎవరూ కూడా హిందీని బలవంతంగా రుద్దలేరనీ ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తమిళనాడు రాష్ట్ర గేయం తమిళ తాయి వళతు నుంచి ద్రవిడం అనే పదాన్ని తొలగించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తోన్నాయని, డీఎంకే జీవించి ఉన్నన్ని రోజులు ఆ పదాన్ని తొలగించడం ఎవరి వల్లా కాదని చెప్పారు.
ద్రవిడ మోడల్‌లో తమ ప్రభుత్వం సాగిస్తోన్న పాలన దేశానికే ఆదర్శమని ఉదయనిధి వ్యాఖ్యానించారు. ఆచార వ్యవహారాల పేరుతో మహిళలపై జరిగిన అనేక దాడులను పెరియార్ అడ్డుకున్నారని, సమాజంలో వారికి సమాన స్థాయిని కల్పించారని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితమే కరుణానిధి పూర్వీకుల ఆస్తుల్లో మహిళలకు సమాన వాటా కల్పించారని గుర్తు చేశారు.
ఆయన అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి స్టాలిన్ సాగుతున్నారని, మహిళల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఉదయనిధి అన్నారు. మహిళలకు సమాన హక్కులు, గుర్తింపు లభించినప్పుడే ఆ సమాజానికి సార్థకత లభిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications