భగత్ సింగ్‌ను కూడా ఉగ్రవాదిగా చిత్రీకరించారు: ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌ను స్వాగతిస్తున్నా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి ఇవ్వాళే చివరిరోజు. ఈ సాయంత్రానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఆదివారం పోలింగ్‌ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పంజాబ్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌లో మూడో దశలో 59 నియోజకవర్గాల్లో ప్రచారం పరిసమాప్తమౌతుంది. ఎల్లుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

117 స్థానాలకు ఒకే విడతలో..
పంజాబ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 117 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం, 2,13,88,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 24,689 పోలింగ్ బూత్‌లను నెలకొల్పింది. కాంగ్రెస్ జెయింట్స్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సహా శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఉగ్రవాదిగా ముద్ర..
ఈ పరిణామాల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. తనపై జరుగుతున్న ఆరోపణలు, విమర్శనాస్త్రాలను తిప్పికొడుతున్నారు. తనను ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని తేలిగ్గా తీసుకున్నారు. వంద సంవత్సరాల కిందట షహీద్ భగత్ సింగ్‌ను కూడా బ్రిటీషర్లు ఉగ్రవాదిగా చిత్రీకరించారని గుర్తు చేశారు. ఇప్పుడు తాను అలాంటి ఆరోపణలను ఎదుర్కొంటోన్నానని అన్నారు. భగత్ సింగ్‌కు తాను ఆదర్శంగా తీసుకున్నానని, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నానని చెప్పారు.

హాస్యాస్పదంగా..
అందుకే- తన రాజకీయ ప్రత్యర్థులు ఉగ్రవాదితో పోల్చుతున్నారంటూ ఎదురుదాడికి దిగారు. కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా పరిగణించట్లేదని కేజ్రీవాల్ అన్నారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కుమార్ విశ్వాస్ చెప్పినవిధంగా తాను ఉగ్రవాదినే అయితే ఈ పది సంవత్సరాల్లో తనను ఎందుకు అరెస్ట్ చేయలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఆరోపణలు అర్థరహితమైనవని అన్నారు.

ఛార్జ్‌షీట్‌ను స్వాగతిస్తా..
రెండు రోజుల్లో తనపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారని, దీనికి తాను సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ చెప్పారు. ఇలాంటి ఛార్జ్‌షీట్లు ఎన్ని పెట్టినా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తే.. దాన్ని ఆనందంగా స్వాగతిస్తానని పేర్కొన్నారు. మంచి పనులు చేసే వారిని ఉగ్రవాదిగా చిత్రీకరించడం రాజకీయ ప్రత్యర్థులకు అలవాటేనని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications