సిగ్గుపడుతున్నా, శిక్షించండి: సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు ఓంపురి
ముంబై: భారత సైనికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు ఓం పురి.. తన తప్పును తెలుసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎంతో సిగ్గుపడుతున్నట్లు తెలిపారు.
యూరీ ఉగ్రవాద ఘటనలో సైనికులు మరణించడంపై ఓంపురి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'ఎవరు వారిని సైన్యంలో చేరమన్నారు? ఎవరు ఆయుధాలు చేతపట్టమన్నారు' అని అన్నారు. దీంతో భారత్‌లో పుట్టి భారత సైన్యాన్ని కించపరుస్తూ మాట్లాడతారా? అంటూ ఆయనపై పలువురు ప్రముఖులతోపాటు పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో ఓంపురి మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. 'నేను చేసినవ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా. తప్పు చేశాను. నన్ను శిక్షించాల్సిందే. ముందు నేను యూరీ ఘటనలో వీరమరణం పొందిన వారికి క్షమాపణ చెప్తున్నా. వారు నన్ను మన్నిస్తే భారతదేశానికి, సైన్యానికి క్షమాపణ చెప్పుకుంటాను' అని తెలిపారు.
అంతేగాక, 'నోటికొచ్చినట్లు వాగేసి ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన అంతా సద్దుమణగదని నాకు తెలుసు. నన్ను మన భారత సైనికులే శిక్షించాలి. వారే నాకు ఆయుధాన్ని చేతబట్టడం అంటే ఏంటో తెలిసేలా చేయాలి. ఉగ్రదాడి జరిగిన చోటికి నన్ను పంపించాలి. నన్ను క్షమించకూడదు. నేను శిక్షార్హుడిని' అంటూ ఓంపురి తాను చేసిన తప్పుడు వ్యాఖ్యలకు చింతించారు.


Click it and Unblock the Notifications