ఆరోపణలొస్తే రాజీనామా: అద్వానీ, రాజేకు పెద్దలు నో!
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మోడీ ప్రభుత్వం పైనే పరోక్షంగా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. లలిత్ మోడీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ స్పందించారు.
శనివారం మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఉన్న వారికి రుజువర్తన, సత్యసంధతలే ప్రాణమని, దానిని ఆయా నేతలు పాటించి తీరాలన్నారు. అంతేకాకుండా 1996 నాటి హవాలా కుంభ కోణంలో తనపై ఆరోపణలు వచ్చిన మరుక్షణమే ఎంపీగా ఉన్న తాను ఆ పదవికి రాజీనామా చేశానని చెప్పారు.
రాజీనామా నిర్ణయం తనంతట తానుగా తీసుకున్నదేనన్నారు. కుంభకోణంలో తనకు క్లీన్ చిట్ లభించాకే 1998లో తిరిగి ఎన్నికయ్యానని గుర్తు చేశారు. బెంగాల్ దినపత్రిక ఆనందబజార్‌తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో సుష్మ, రాజేలపై నేరుగా వ్యాఖ్యానించేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు.

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప.. తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేశానన్నారు. జన్‌సంఘ్ శకం నుంచి తాము నిజాయితీనే బోధిస్తున్నామని, అవినీతి విషయంలో రాజీ లేదన్నారు.
ఇదిలా ఉండగా, లలిత్ మోడీ వివాదంలో చిక్కుకున్న రాజస్థాన్ సీఎం వసుంధర రాజే శనివారం ఢిల్లీకి వచ్చి బీజేపీ అగ్రనేతలను కలవకుండానే జైపూర్‌కు వెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. నీతి ఆయోగ్‌కు అనుబంధంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సమావేశానికి రాజె హాజరయ్యారు.
జైపూర్ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆమె, మధ్యాహ్నం తిరిగి అదే హెలికాఫ్టర్‌లో వెళ్లిపోయారు. వసుంధరను అధినాయకత్వం పిలిచిందని తొలుత ప్రచారం జరిగింది. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి లలిత్ మోడీకి సహకరించటంపైనే కాక అతనితో ఉన్న వ్యాపార సంబంధాలపై వివరణ ఇస్తారన్న ప్రచారం జరిగింది.
అయితే ఆమె ఎవరినీ కలవకుండానే వెళ్లిపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆమెకు అపాయింటుమెంట్ దొరకలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, బీహార్ విధానసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా తప్పును అంగీకరించినట్టు కావటమేకాక విపక్షాలకు భయపడిపోయామన్న సందేశం ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీకి ఆరెస్సెస్ సూచించినట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications