భారత్‌పై అమెరికా ఆర్థిక సర్జికల్ స్ట్రైక్? రష్యా చమురు కొనుగోళ్లపై సంచలన బిల్లు!
అమెరికాలో రష్యా చమురు కొనుగోళ్లపై 100 శాతం సుంకాలను విధించే బిల్లుకు అమెరికన్ సెనేటర్ల నుంచి భారీ మద్దతు లభించింది. 60 మందికి పైగా అమెరికా సెనేటర్ల బృందం ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేస్తున్న దేశాలపై ఈ చట్టం 100 శాతం వరకు సుంకాలను విధిస్తుంది. రష్యాకు అందుతున్న యుద్ధ నిధులను అరికట్టడానికి అమెరికా తీసుకుంటున్న అత్యంత కఠినమైన చర్యల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది. 60 మంది సెనేటర్ల ఆమోదంతో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు పెరిగాయి. ఒకవేళ ఇది ఆమోదం పొందితే రష్యా చమురు కొనుగోలు చేసే భారత్, చైనా, అజర్‌బైజాన్ , హంగేరి వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించబడతాయి. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ వారం అకస్మాత్తుగా మరణించిన సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును రూపొందించారు.
60 మందికి పైగా సెనేటర్ల మద్దతు పొందిన ఈ బిల్లు వైట్ హౌస్ మద్దతును కూడా పొందుతోంది. తన మరణానికి ముందు దాదాపు రెండేళ్ల పాటు ప్రభుత్వంతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించడంలో గడిపిన సెనేటర్ లిండ్సే గ్రాహం ఆకస్మిక మరణం తర్వాత ఈ బిల్లు రాజకీయ ప్రాముఖ్యత ఇటీవల పెరిగింది. గత 12 నెలలుగా అత్యధికంగా చమురు కొనుగోలు చేసిన ఐదు దేశాలపై సుంకాలు విధించే సెక్షన్ 113 ఈ బిల్లుకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ బిల్లుకు చైనా, భారత్‌లు ప్రధాన లక్ష్యాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ బిల్లు రష్యా నుంచి నేరుగా దిగుమతి చేసుకునే వస్తువులపై 500 శాతం వరకు సుంకాలను విధించడానికి కూడా అధికారం ఇస్తుంది. ఇది క్రెమ్లిన్ రాజకీయ, సైనిక నాయకత్వం, దాని అతిపెద్ద బ్యాంకులు, రష్యా రక్షణ పారిశ్రామిక స్థావరంతో సంబంధం ఉన్న కంపెనీలపై కఠినమైన ఆంక్షలను కూడా విధిస్తుంది.

అయితే ఈ బిల్లులో అమెరికా తన స్వప్రయోజనాల కోసం ప్రదర్శిస్తున్న ద్వంద్వ విధానం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు విమర్శలు కురిపిస్తున్నారు. రష్యా నుంచి యురేనియం కొనుగోలు ఈ బిల్లులో సెక్షన్ 114(ఈ) మినహాయింపునివ్వడం గమనార్హం. అమెరికాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని అణు సంస్థ రోసాటమ్.. అమెరికా అణు విద్యుత్ కేంద్రాలకు సుసంపన్నమైన యురేనియంను ప్రధానంగా సరఫరా చేస్తోంది. ఇతర దేశాలు రష్యా నుంచి ఇంధనాన్ని కొనకూడదని ఆంక్షలు పెడుతున్న అమెరికా.. తన అవసరాల కోసం రష్యా యురేనియంపై ఆధారపడటాన్ని మాత్రం కొనసాగించడం గమనార్హం.
యూరప్‌కు గ్యాస్ మినహాయింపులు
రష్యా నుంచి తక్కువ మొత్తంలో సహజ వాయువును దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్న 15 యూరోపియన్ మిత్రదేశాలకు కూడా ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుంది. సెక్షన్ 113(డి) ప్రకారం ఓ దేశం గత సంవత్సరం తన మొత్తం గ్యాస్ ఎగుమతులలో 15 శాతం కంటే తక్కువ రష్యా నుండి దిగుమతి చేసుకున్నట్లయితే ఆ దేశం గ్యాస్ కొనుగోళ్లపై కొత్త సుంకాలను ఎదుర్కోవలసి ఉండదు. ఈ బిల్లు కింద దాదాపు ఏ ఆంక్ష లేదా సుంకం నుంచైనా మినహాయింపులు మంజూరు చేయడానికి ఈ చట్టం అధ్యక్షుడికి విస్తృత అధికారాన్ని కూడా ఇస్తుంది, అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్‌కు తెలియజేసి, తిరస్కరణ ఉమ్మడి తీర్మానం ద్వారా అభ్యంతరం తెలపడానికి 30 రోజుల గడువు ఇవ్వాలి.












Click it and Unblock the Notifications