తొలిసారి నా ముఖంపై చిరునవ్వు: సుప్రీంకోర్టు తీర్పుపై బిల్కిస్ బానో స్పందన
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్‌లో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులు జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో బాధితురాలు స్పందించారు. న్యాయమంటే ఇదే అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ తీర్పు తనకు ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. ఏడాదిన్నర తర్వాత తనకు సంతోషం కలిగిందని చెప్పారు.
'ఈరోజు నిజంగా నాకు కొత్త సంవత్సరం. ఉపశమనంతో కన్నీళ్లు వచ్చాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో తొలిసారి నా ముఖంలో చిరునవ్వు చూసుకున్నా. నా పిల్లల్ని ఆలింగనం చేసుకున్నా. నా ఛాతిలో నుంచి కొండంత రాయిని బయటకు తీసిన అనుభూతి కలిగింది. మళ్లీ నేను పూర్తి శ్వాస తీసుకోగలను. న్యాయమంటే ఇదే అనిపిస్తోంది. అందరికీ సమన్యాయం కలుగుతుందనే ఆశ ఈ తీర్పు ద్వారా కలుగుతోంది. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు' అని బిల్కిస్ బానో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు.

కాగా, బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఆ ఖైదీలకు రెమిషన్ (శిక్షకాలం తగ్గింపు) మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అంతేగాక, ఆ 11 మంది దోషులు రెండు వారాల్లోగా జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో దోషులపై ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సుప్రీం తీర్పుపై బాధితురాలు బిల్కిస్ బానో తోపాటు రాజకీయ పార్టీల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దోషులకు సరైన శిక్ష పడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దోషులకు మద్దతు పలికేవారికి సుప్రీం తీర్పు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications