అమ్మను చంపి ఐఏఎఫ్ అధికారి ఆత్మహత్య
జోధ్ పూర్: భారత వైమానిక దళంలో పని చేస్తున్న ఓ అధికారి దారుణానికి పాల్పడ్డాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిని దారుణంగా హత్య చేసి చివరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈ సంఘటన జరిగింది.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగదేవ్ సింగ్ యాదవ్ (38) జోధ్ పూర్ లోని ఇండియన్ ఫోర్స్ స్టేషన్ లో జూనియర్ వారెంట్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన తన తల్లి సంతరాదేవి (70)తో కలిసి జోధ్ పూర్ లో నివాసం ఉంటున్నారు.
సంతరాదేవి చాల కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఆమెకు జబ్బు నయం కాలేదు. ఈ విషయంలో జగదేవ్ సింగ్ కుంగిపోయాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని కంటికి కాపలాగా చూసుకోవడం కష్టం అని అనుకున్నాడు.

జగదేవ్ సింగ్ భార్య, పిల్లలు మాత్రం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. తల్లిని చూసుకోవడం ఆయనకు కష్టం అయ్యింది. ఇక భరించలేని జగదేవ్ సింగ్ జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. తల్లిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. తరువాత అతను ఇంటి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం గుర్తించిన ఇరుగు పొరుగు వారు జగదేవ్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో చికిత్స విఫలమై ఆయన మరణించాడని పోలీసులు చెప్పారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం జీర్ణించుకోలేక జగదేవ్ తల్లిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications