రోడ్డుపై నమాజ్ లేకపోతే హనుమాన్ చాలీసా కూడా లేదు-యోగీ కామెంట్స్..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమదైన శైలిలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. దేశానికే యూపీ గ్రోత్ ఇంజన్ గా మారిందని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎంపికైన పోలీసు సిబ్బందికి అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న యోగీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను అధికారంలోకి రాకముందు యూపీ ఎలా ఉండేదో ఆయన గుర్తుచేశారు. పోలీసు వ్యవస్ధతో పాటు రాష్ట్రంలో అప్పట్లో నెలకొన్న పరిస్ధితుల్ని యోగీ వివరించారు.
గత ఆరేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు లేవని, బక్రీద్, రామనవమి, ఈద్ వంటి పండుగలను గతంలో ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా జరుపుకుంటున్న ఉత్తరప్రదేశ్‌లో వ్యవస్థీకృత నేరాలు దాదాపు నిర్మూలించినట్లు యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. అలాగే ఎలాంటి ఉగ్రవాద దాడుల ఘటనలు కూడా జరగలేదని తెలిపారు. ఉత్సవాల సమయంలో సామాన్యులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపారు.

రోడ్డుపై నమాజ్ లేకపోతే, హనుమాన్ చాలీసా కూడా లేదని యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివాదం లేకుండా వారం రోజుల్లోనే గతేడాది 1.20 లక్షలకు పైగా లౌడ్‌స్పీకర్లను మతపరమైన ప్రదేశాల నుండి తొలగించిందని యోగీ ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. గత అఖిలేష్ ప్రభుత్వంపై యోగీ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇంతకుముందు రాష్ట్రంలో పోలీసులు కూడా సురక్షితంగా లేరని, గతంలో లక్నోలో దుండగులు నడిపిన జీపు బానెట్‌కు డిప్యూటీ ఎస్పీ ఉరివేసుకున్నారని గుర్తుచేశారు.

ఇవాళ అలా చేస్తే తలెత్తే పరిణామాల గురించి తెలుసు కాబట్టి అలాంటి ధైర్యం చేయలేదని యోగీ తెలిపారు. ఇంతకుముందు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలు తమ కుమార్తెలను చదివించడానికి దూరంగా పంపేవారని, అయితే ఇప్పుడు రాష్ట్ర పోలీసుల ప్రయత్నాల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఆదర్శప్రాయంగా మారిందని ఆయన అన్నారు. శాంతియుత, సురక్షితమైన వాతావరణం కారణంగా,ఉత్తరప్రదేశ్ రూ.36 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆకర్షించిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications