కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లే, హిందూ వ్యతిరేకులు, యత్నాల్ తో !
బెంగళూరు/గదగ్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని విషకన్యతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, సినీ హీరోలు సుదీప్, దర్శన్ తదితరులు బీజేపీకి, డాక్టర్ శివరాజ్ కుమార్, దునియా విజయ్, నటి రమ్యా కాంగ్రెస్ పార్టీల తరుపున ప్రచారం చేస్తున్నారు.
బీజేపీలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే బెళగావి జిల్లాలోని విజయపుర బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇటీవల సోనియా గాంధీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విషసర్పంతో సమానం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విమర్శించడంతో బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ మండిపడ్డారు.

మా నాయకుడు నరేంద్ర మోదీ విష సర్పం అయితే మీ నాయకురాలు సోనియా గాంధీ విషకన్యనా అంటూ బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ బహిరంగంగా సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పాలని, ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
కావాలంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను తప్పా సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదని, సోనియా గాంధీని విషకన్యతో పోల్చిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాలు తేల్చిచెప్పారు. ఇప్పుడు గదగ్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ మెనిపినకాయకు మద్దతుగా రోడ్ షో నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే యత్నల్ మరోసారి కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లే అని, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు దేశద్రోహులు అని బీజేపీ ఎమ్మెల్యే బసవన్ గౌడ పాటిల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని, అందుకే భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవన్ గౌడ పాటిల్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే యత్నల్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications