భారత్ లో కోవిడ్ వ్యాప్తి-ప్రజలకు ఐఎంఏ సూచనలు- మాస్కుల్ని తప్పనిసరి చేయనున్న కేంద్రం..
భారత్ లో కోవిడ్ భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో వెలుగుచూసిన కోవిడ్ కేసులన్నీ ఒమిక్రాన్ పాత రకం లేదా చైనా నుంచి తాజాగా దిగుమతి అయిన కొత్తరకం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ప్రభుత్వాలు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నాయి. వాటి ఫలితాలు వస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్ధితి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు కీలక సూచనలు చేస్తోంది.
కోవిడ్ వ్యాప్తి భయాల నేపథ్యంలో ప్రజలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఏంఏ) తాజా అడ్వైజరీ విడుదల చేసింది. ఇందులో జనాల్ని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బయట గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరిగి గతంలోలా నిబంధనలు పాటించాలని, ఎక్కడా ఛాన్స్ తీసుకోవద్దని ఐఎంఏ సూచిస్తోంది. గత 24 గంటల్లో అమెరికాతో పాటు ఇతర విదేశాలన్నీ కలిపి 5.4 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు ఐఎంఏ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనం వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది.

గత 24 గంటల్లో భారత్ లో 145 కొత్త కేసులో నమోదయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ సూచిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వైద్య సదుపాయాలు భారీగానే అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడ వరకూ తెచ్చుకోకుండా జనం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రభుత్వం కూడా భారీగా వ్యాక్సిన్లు, ఇతర సదుపాయాల్ని అందుబాటులోకి తేవాలని కోరింది. మరోవైపు కేంద్రం కూడా కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల్ని తప్పనిసరి చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలోలా కోవిడ్ నిబంధనల్ని పక్కాగా అమలు చేసేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇవాళ ప్రధాని నిర్వహిస్తున్న భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications