చల్లని కబురు: ఈసారి ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ(IMD) రైతులకు, ప్రజలకు చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూగా రుతుపవనాలు భారతదేశ ప్రధాన భూభాగాన్ని తాకనున్నాయని వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి.
ఆ తర్వాత ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ, జూలై 15 నాటికి దేశం మొత్తం రుతుపవనాలు ఆవరిస్తాయి. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఐఎండీ ప్రస్తుత అంచనా ప్రకారం మే 31 నాటికి రుతుపవనాలు కేరళకు రానున్నాయి.

గత 19 ఏళ్లలో ఒక్క 2015 తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కేరళకు రుతుపవనాలు వచ్చే తేదీలకు సంబంధించిన కార్యాచరణ అంచనాలు రుజువయ్యాయి. రుతుపవనాలు మే 19న అండమాన్ నికోబార్ తీరాన్ని తాకనున్నట్లు ఇప్పటికే ఐఎండీ చెప్పింది.
ఈసారి ఇండియన్ ఓషియన్ డైపోర్(IOD) లేదా పశ్చిమంతో పోలిస్తే తూర్పున సాధారణ హిందూ మహాసముద్రం కంటే చల్లగా ఉంటుంది, ఇది మళ్లీ దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు వర్షం కురిపించడంలో సహాయపడుతుంది. ఐవోడీ ప్రస్తుతం 'తటస్థంగా' ఉంది, ఆగస్టు నాటికి సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.
తెలంగాణకు పది రోజుల ముందుగానే రుతుపవనాలు
తెలంగాణకు పది రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications