భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం: మరో 48గంటలు, నిలిచిన రవాణా
దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో లోకల్ రైళ్లను రద్దు చేశారు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో లోకల్ రైళ్లను రద్దు చేశారు. విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం..
లోతట్టు ప్రాంతాలు నడుములోతు నీళ్లలో మునిగిపోయాయి. దీనికితోడు రానున్న 48 గంటల్లో కుంభవృష్టి కురవనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ముంబై వాసులను మరింత భయాందోళనలకు గురిచేస్తోంది.

భారీగా నిలిచిపోయిన నీరు..
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. భారీ వర్షాలతో సియోన్, దాదర్, ముంబై సెంట్రల్, కుర్లా, అంధేరీ, సాకినాక ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది.

కుంభవృష్టిగా వర్షం..
మంగళవారం ఉదయం నుంచే ఆరు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. అటు సముద్రం ఎగిసిపడుతోంది. సోమవారం సాయంత్రం మూడున్నర మీటర్ల ఎత్తయిన అలలు రికార్డుకావడం గమనార్హం.

మరో 48గంటలు..
కాగా, భారీ వర్షాలతో ముంబైకి తాగు నీరందించే నాలుగు రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతుండటం నగర వాసులను ఆనందానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలో మరో 24 నుంచి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రజలకు హెచ్చరిక
సుమారు 250మి.మీల వర్షపాతం నమోదవనుందని తెలిపింది. ప్రధానంగా కొంకన్ ప్రాంతంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతేగాక, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని అధికారులు స్పష్టంచేస్తున్నారు.












Click it and Unblock the Notifications