ఒమిక్రాన్ వేళ తాజా అలర్ట్- వణికిస్తున్న చలి : 5 రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ..!!
ఒక వైపు ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో క్రమేణా వ్యాపిస్తోంది. ఏపీ- తెలంగాణలోనూ తాజాగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఐఎండీ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న అయిదు రోజులు దేశ వ్యాప్తంగా చలి గాలులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొమురంభీం జిల్లా గిన్నెదరిలో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.9, విశాఖ జిల్లా మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది.

వణికిపోతున్న విశాఖ ఏజెన్సీ
తీవ్రమైన చలితో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక, ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి వణికిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే శీతల గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలి అధికంగా ఉండటంతో పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతలగాలులు, దట్టమైన పొగమంచును కప్పి ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు. చూడటానికి సుందరంగా ఉన్న చలి కారణంగా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు.

అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు
ఈ సీజన్లో అత్యల్పంగా మినుములురు 07, చింతపల్లి 8.4, పాడేరు 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే సంక్రాంతి నాటికి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతే పరిస్థితి ఏంటని పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఐఎండీ హెచ్చరికల మేరకు సౌరాష్ట్ర, కచ్‌లలో వచ్చే బుధ, గురు వారాల్లో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని ఆ శాఖ తన రోజువారీ బులెటిన్‌లో పేర్కొంది. డిసెంబర్ 17 నుంచి 21 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, సౌరాష్ట్ర, కచ్‌లలో చలిగాలులు వీచే అవకాశం ఉంది.

రానున్న అయిదు రోజులు జాగ్రత్తగా
డిసెంబర్ 18 నుండి 21 వరకు, ఉత్తర రాజస్థాన్‌లో.. డిసెంబర్ 19 నుండి 21 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి అలాగే ఉంటుంది. గుజరాత్‌లోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం ఉంది. మహారాష్ట్రపై 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. పంజాబ్ అలాగే హర్యానాలో రాబోయే రెండు రోజులు దట్టమైన లేదా చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 17న వాయువ్య రాజస్థాన్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో కూడా చాలా దట్టమైన పొగమంచు పరిస్థితులు ఏర్పడతాయి.

ఉత్తరాది నుంచి బలమైన శీతల గాలులు
ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర కాశ్మీర్‌లో చలి తీవ్రత పెరిగింది. పర్యాటక ప్రాంతం గుల్‌మార్గ్‌లో ఇప్పటివరకూ ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో వేసవి రాజధానిలో అత్యంత శీతల ఉష్ణోగ్రత నమోదైంది. అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్ అయిన పహల్గామ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 6.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. దీంతో..ప్రస్తుతం వైరస్ వ్యాపిస్తున్న వేళ.. చిన్నారులు - పెద్ద వయసు వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications