NDA vs INDIA: మూడోసారీ గెలిపించండి- ఆ పని చేస్తా: మోదీ- కీలక హామీ ఇచ్చిన ప్రధాని
న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- దీని దూకుడును నిలువరించడానికి యూపీఏ సమాయాత్తమౌతోన్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతోన్నాయి.
బీజేపీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి కూడా ఇవ్వాళ దేశ రాజధానిలో భేటీ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని హోటల్ అశోకలో ఈ భేటీ ఏర్పాటైంది. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలు, మిత్రపక్షాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా 38 పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏను మూడోసారి కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమనే ఎన్నుకుంటే.. దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ అన్నారు.
2024 ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ కూటమి మరోసారి ఘన విజయాన్ని సాధించబోతోందని మోదీ జోస్యం చెప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య, మిత్రపక్షాల అభ్యర్థులకు పడే ఓట్లు 50 శాతానికి పైగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు యూపీఏకు బదులుగా ఇండియా అనే కొత్త పేరును పెట్టుకోవడాన్నీ మోదీ స్పందించారు. ఎన్డీఏకు కొత్త అర్థం చెప్పారు.

ఎన్డీఏలో ఎన్ అంటే న్యూ ఇండియా, డీ అంటే డెవలప్‌మెంట్, ఏ అంటే ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. దేశ ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. నేషన్ ఫస్ట్, సెక్యూరిటీ ఆఫ్ నేషన్ ఫస్ట్, ప్రొగ్రెస్ ఫస్ట్, ఎంపవర్‌మెంట్ ఆఫ్ పీపుల్స్ ఫస్ట్.. అని మోదీ పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ తరఫున సానుకూల రాజకీయాలు చేశామని మోదీ గుర్తు చేశారు. ప్రభుత్వాలను ఎదిరించేందుకు తాము ఎప్పుడూ విదేశీయుల సాయం కోరలేదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. ప్రతిపక్షంలో ఉన్నా గానీ దేశాభివృద్ధికి అడ్డుపడలేదని, తాము అడ్డంకిగా మారలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications